నెలకు రూ.6లక్షల ఉద్యోగాన్ని వదిలి | Ramaprasad Resigns From Software Job And Works In Agriculture | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ రైతు.. నెలకు రూ.6లక్షల ఉద్యోగాన్ని వదిలి

Published Sat, Jan 11 2020 10:04 AM | Last Updated on Sat, Jan 11 2020 10:37 AM

Ramaprasad Resigns From Software Job And Works In Agriculture - Sakshi

సాక్షి, మార్కాపురం: ఆకాశమంత ఎత్తు ఉండే టవర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. నెలకు రూ. 6 లక్షల వేతనం. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తిన్నా తరగనంత ఆదాయం. స్టార్‌ హోటల్స్‌లో సమావేశాలు, డీన్నర్లు.. ఇవేమి ఆయనకు సంతృప్తి కలిగించలేదు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ఉన్న మమకారం మరచిపోలేకపోయాడు. సంపాదించింది చాలనుకుని సౌది అరేబియాలోని జెడ్డాలోని యునిలివర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కొండ ఒడ్డు వెంట సుమారు 30 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోని మండల కేంద్రమైన కృత్తివెన్నుకు చెందిన గూడవర్తి రమాప్రసాద్‌ ఇంజినీరింగ్‌ చదువు అయిపోగానే మలేషియా, సింగపూర్, యూఎస్‌లలో ఐబీఎం, కొల్గేట్‌ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశాడు.

ఐదేళ్ల కిందట సౌది అరేబియాలోని జెడ్డాలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన యునిలివర్‌లో నెలకు రూ. 6 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాడు. ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఏదో వెలితి. పరాయిదేశంలో ఉన్న పుట్టిన ఊరుపై మమకారం పోలేదు. స్వగ్రామంలో పొలాలు కొందామంటే చాలా ధర. ఈ నేపథ్యంలో తన తండ్రి నాగేశ్వరరావు ద్వారా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో మూడేళ్ల కిందట 30 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేయించాడు. సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయించాలని తండ్రికొడుకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 6 ఆవులు, 4 గేదెలు కొనుగోలు చేశారు. పొలంలోనే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటూ వ్యవసాయం ప్రారంభించారు. తండ్రికి చేదోడు, వాదోడుగా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో సూచనలు ఇస్తున్న రమాప్రసాద్‌ ఏడాది కిందట ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యబిడ్డలతో బోడపాడు గ్రామానికి వచ్చి పూర్తిగా వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు.  

నష్టాలను అధిగమించేందుకు  
కేవలం ఒక్క వ్యవసాయంపైనే, ఒక్క పంటపైనే ఆధారపడితే నష్టం వస్తుందని భావించాడు. వర్షాభావ పరిస్థితులు ఉన్న మార్కాపురం ప్రాంతంలో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఉద్యానశాఖ సహాయంతో 3 ప్రాంతాల్లో 100X100X5 సెంటిమీటర్లతో నీటి కుంటను తవ్వించాడు. కొండ ప్రాంతం కావటంతో కొద్దిగా వర్షం పడినా కుంటల్లోకి నీరు వచ్చి చేరేది. అక్కడి నుంచి పైపు లైన్ల ద్వారా తాను సాగు చేస్తున్న 15ఎకరాల్లోని బత్తాయికి, 7ఎకరాల్లో దానిమ్మకు నీళ్లు అందించే ఏర్పాటు చేశాడు. మరో 5 ఎకరాల్లో చేపల చెరువుల కోసం తవ్వాడు. ఇంటి ముందు షెడ్‌ వేసి ఆవులు, గేదెలను పోషణ చేపట్టాడు.

వాటి ద్వారా వచ్చే ఎరువులు పొలాలకు ఉపయోగించాడు. ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసి బత్తాయి, దానిమ్మ చెట్లకు ఉపయోగించాడు. సేంద్రియపు ఎరువుల కోసం ఎండిన ఆకులు, ఫిష్‌ వేస్టేజ్‌ని ఉపయోగించుకున్నాడు. గత ఏడాది బత్తాయి తోటలపై సుమారు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టగా రూ. 18 లక్షలకు కాయలు అమ్మాడు. దీంతో రూ. 8 లక్షలు ఆదాయం వచ్చింది. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల వరకు బత్తాయి దిగుబడి వస్తోంది. మరో వైపు పాల డెయిరీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీని వలన నెలకు ఏదో ఒక రూపంలో ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతోనే వివిధ రకాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలపై దృష్టి సారించారు.  

ధైర్యంతో ఉద్యోగం వదలి వచ్చా   
నెలకు రూ. 6 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదలి పెట్టాలంటే భయం వేసింది. అయినా భూమిని నమ్ముకున్న వాడు నష్టపోడని మా నాన్న చెప్పేవాడు. ఆ ధైర్యంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాను. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నాను. తప్పనిసరి పరిస్థితి అయితేనే రసాయనిక, ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాడు. ఒక వైపు పంటల సాగు, మరో వైపు చేపల చెరువులు, ఇంకొక వైపు డెయిరీఫాం ఇలా ఇక్కడే ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెంది నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నలుగురిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏదో తెలియని వెలితి. ఇప్పుడు మానసికంగా చాలా సంతృప్తి చెందుతున్నా. ప్రతి రోజు పొలాన్ని పరిశీలిస్తుంటా. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటా. పశువైద్యాధికారి భాస్కరరెడ్డి దగ్గర కూడా ఆవులు, గేదెల పెంపకంలో సహాయం తీసుకుంటుంటా. వ్యవసాయం నష్టమని చాలా మంది రైతులు భావిస్తున్నారు. లాభాల బాటలో పయనించి ఆదర్శంగా నిలవాలనే భావిస్తున్నా.  
– రమాప్రసాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement