కరోనా కాలాన చీకటి వెలుగులు | Rewind 2020: Year Roundup In East Godavari | Sakshi
Sakshi News home page

2020: తూర్పు గోదావరి రౌండప్‌

Published Thu, Dec 31 2020 9:07 AM | Last Updated on Thu, Dec 31 2020 9:07 AM

Rewind 2020: Year Roundup In East Godavari - Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో నిర్మానుష్యంగా మారిన కాకినాడ (ఫైల్‌)

సాకక్షి, అమలాపురం: 2020 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జీవితాంతం వెంటాడే ‘కరోనా’ బాధను కలిగించింది. కంటికి కనిపించని ఒక ప్రాణి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సామాన్యులు, పేదలు, మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారినందరినీ బాధించింది. లాక్‌డౌన్‌ పేరుతో ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది. వరదలు, వర్షాలు, ప్రమాదాలు జిల్లా వాసులను ఏడాది పొడవునా వెంటాడాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏడాది చివరిలో కరోనా వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ కోసం చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద, మధ్య తరగతికి చెందిన వేలమంది లబ్ధిపొందడం, ఏడాది చివరిలో రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం శుభపరిణామం.

అతలాకుతలం
కరోనా మన జిల్లాపై పెను ప్రభావాన్ని చూపించింది. వేల మందిని సోకింది. వందల మందిని ఆస్పత్రుల పాల్జేసింది. ఒకానొక సమయంలో జిల్లాలో రోజుకు 1,500కు పైబడి పాజిటివ్‌ కేసులు వచ్చాయి. జూలై, ఆగస్టు నెలల్లో కరోనా కేసులు ప్రమాదకరస్థాయికి చేరాయి. జిల్లాలో తొలి కరోనా కేసు మార్చి 21న నమోదైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా, ఆ తర్వాత నుంచి ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ మొదలైంది. ఇంత వరకు జిల్లాలో 1,23,604 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 403 యాక్టివ్‌ కాగా, 1,22,565 మంది కోలుకున్నారు. 636 మంది మృత్యువాత పడ్డారు. ఇతర ప్రాంతాలలో ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చేశారు. ఇక్కడ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది కూలీలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అన్నవరం సత్యదేవుని వంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు రోజుల తరబడి మూతపడ్డాయి.

ప్రభుత్వ పటిష్ట చర్యలు  
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొంది. కోవిడ్‌ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఆధునిక వైద్యసేవలు అందించడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో వేలాదిమందికి ఆరోగ్యకరమైన సదుపాయాలు కల్పించింది. పౌష్టికాహారం అందించింది. నిరంతర వైద్యసేవల కారణంగా మరణాల శాతం చాలా తగ్గింది. జిల్లాలో వేలాది మంది కరోనా బారిన పడినా, రికవరీ శాతం 99.1 ఉండడం విశేషం. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు కూడా ప్రశంసలందుకున్నాయి. ఏడాది ఆరంభంలో మొదలైన కరోనా బెడద ఆఖరి రోజుల్లో కూడా వీడలేదు. ఇప్పుడు కరోనా కేసులు చాలా వరకు తగ్గడం ఊరటనిచ్చే అంశం కాగా, వాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండడం జిల్లా వాసుల్లో ధైర్యాన్ని నింపింది.

అడుగడుగునా వ్యవసాయం
జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయం పలు రకాల సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొంది. కరోనా, వరదలు, భారీ వర్షాలు ఇలా వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆక్వా, ఫౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను చవిచూశారు. ఎగుమతులు నిలిచిపోవడంతో ఆందోళన చెందారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం చేయడంతో వారం, పది రోజుల వ్యవధిలో గాడిన పడ్డారు. వరి, కూరగాయల రైతులు, ఉద్యాన రైతులను వరదలు, వర్షాలు బెంబెలెత్తించాయి. కొబ్బరి ధర తగ్గిన సమయంలో నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొబ్బరి ధర పెరిగేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. అయితే ప్రభుత్వం నుంచి అందిన సహాయంతో రైతులు కోలుకున్నారు.

4,55,022 మంది వరకు రైతు భరోసా, ఎంపీ కిసాన్‌ సహాయ నిధి నుంచి మూడు విడతలుగా రూ.1,334.96 కోట్ల మేర లబ్ధి పొందారు. పంట నష్ట పరిహారం కోసం గతంలో ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఈ ఏడాది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రెండు నెలలకే పరిహారం అందజేస్తుండడంతో రైతులు సాంతన పొందుతున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన సుమారు 23,171 మంది రైతులకు అక్టోబరు 27న రూ.16.59 కోట్లు, తాజాగా నివర్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు డిసెంబరు 29న రూ.46.25 కోట్ల పరిహారం అందజేశారు. ఈ ఏడాదిలోనే రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం వాటి ద్వారా విత్తనాలు, ఎరువుల అమ్మకాలు, ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయడం రైతులకు మేలు చేసింది.


కాకినాడ రూరల్‌ మండలంలో మంపుబారిన పడిన కాలనీలు (ఫైల్‌) 

భారీ వర్షాలు
ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్‌ ఒకటి నుంచి నవంబర్‌ 30 వరకూ ఆరు నెలల్లో 104 రోజుల పాటు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడడం విశేషం. జిల్లాలో సగటు వర్షపాతం 1,063.2 మి.మీటర్లు కాగా, 1,479.1 మి.మీటర్లు కురిసింది. ఇది సగటు కన్నా 38.7 శాతం అధికం. 53 మండలాల్లో అత్యధికంగా, 11 మండలాల్లో సాధారణ వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలో సగటు 731.7 మి.మీటర్లు కాగా, ఏకంగా 2,254.6 మి.మీటర్లు, అమలాపురంలో సగటు 1,066 మి.మీటర్లు కాగా, 1,812.2 మి.మీటర్ల రికార్డుస్థాయి వర్షం కురిసింది. అక్టోబరులో 11 నుంచి 13 వరకు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ రూరల్‌ మండలాన్ని నిండా ముంచాయి. నవంబరు 26న తమిళనాడులో తీరం దాటిన తుపాను జిల్లాపై పెను ప్రభావం చూపింది.

కోతల మీద ఉన్న ఖరీఫ్‌ పంటను ముంచేసింది. వరితో పాటు అన్ని రకాల పంటలు కలిపి 78,625 ఎకరాల్లో నీట మునిగాయి. భారీ వర్షాలతో మెట్ట, కోనసీమలో వరి, కూరగాయ పంటలు, ఉద్యాన పంటల రైతులు నష్టపోయారు. అయితే మెట్ట, ఏజెన్సీలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. చెరువులు, పంపా, ఏలేరు, భూపతిపాలెం, సుద్దగడ్డ, చంద్రబాబు సాగర్‌ వంటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. ఈ ప్రాంతంలో రెండో పంట సాగుకు సైతం రైతులు చేపట్టారు. 2016లో మెట్టలో 3.56 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు గత నవంబరులో 2.26 మీటర్లకు చేరాయి. ఏజెన్సీలో 5.68 మీటర్ల లోతున ఉన్న జలాలు 4.16కు వచ్చాయి. 

కొబ్బరి పీచు పరిశ్రమలకు తీవ్ర నష్టం
కరోనా సమయంలో చిన్నతరహా పరిశ్రమలు బాగా నష్టపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో మేము చేసిన ఉత్పత్తి రవాణా కాలేదు. ఆ తర్వాత రవాణా 
ఆంక్షలు వీడినా ఉత్పత్తి చేసే కార్మికులు రాలేదు. ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు వెళ్లిపోవడంతో స్థానికంగా కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా వల్ల కొబ్బరి పీచు చిన్న పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాలి. 
– మురళీ, క్వాయర్‌ పరిశ్రమ యజమాని, ఆలమూరు

వ్యవసాయం ఆదుకుంది 
కరోనా వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయి. వ్యవసాయమే త్వరగా కోలుకుంది. రైతులు, కూలీలు, వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఆ సమయంలో వ్యవసాయమే ఒక విధంగా ఆదుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రైతులకు మేలు చేశాయి. పంట నష్టపోయిన రెండు నెలల్లోనే 
పరిహారం ఇవ్వడం అభినందనీయం. 
– ఉద్దరాజు ప్రసాదరాజు, రైతు, కొత్తపేట 

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఏ మంచి పనిచేసినా తూర్పు సెంటిమెంట్‌కు పెద్ద పీట వేసే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ప్రారంభించిన రెండు కార్యక్రమాలకు జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్‌ ఆ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి దిశ చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్‌ రాష్ట్రంలో మొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించడం ద్వారా తూర్పుపై తనకున్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. 

పోటెత్తిన గోదావరి.. ముంచేసిన ఏలేరు
ఇటు గోదావరి.. అటు ఏలేరు. ఈ రెండూ వరదలతో ముంచెత్తాయి. ఏడేళ్ల తరువాత గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఆగస్టు 10న ఆరంభమైన వరద నీటి రాకతో 13వ తేదీ నాటికి 5.78 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. 14 నాటికి ఇది 7.88 లక్షలు, 15వ తేదీకి 12.14 లక్షలు, 16వ తేదీకి 15.52 లక్షలు, 17వ తేదీకి 19.69 లక్షలు, 18వ తేదీకి 22.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చింది. ఎగువున దేవీపట్నం నుంచి దిగువున సఖినేటిపల్లి, కాట్రేనికోన, అల్లవరం మండలాల వరకు పదుల సంఖ్యలో లంక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రెండు రోజులు పాటు తగ్గినట్టే తగ్గిన వరద 21వ తేదీన మరోసారి పెరిగి 18.59 లక్షల క్యూసెక్కులకు చేరింది. భారీ వరదల వల్ల 2,237 ఎకరాల్లో ఉద్యాన, ఇతర పంటలు దెబ్బతినడంతో లంక రైతులు నష్టపోయారు. సుమారు 14,600 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 8 మెట్టను ఏలేరు ముంచెత్తింది. రెండుసార్లు రికార్డుస్థాయిలో వరదలు వచ్చాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు తొలిసారి వరద రాగా, రెండోసారి అక్టోబరులో వరద తాకింది. సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. అప్పటికే ఎకరాకు సుమారు 34 వేల వరకు పెట్టుబడి పెట్టడంతో రైతులు నష్టాలను ఎక్కువగా చూశారు.

పెళ్లింట విషాదం
గోకవరం మండలంలోని తంటికొండపైగల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘాట్‌రోడ్డుపై అక్టోబరు 30న జరిగిన రోడ్డు ప్రమాదం జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. పెళ్లి బృందం ఉన్న వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తొమ్మిది మంది గాయపడ్డారు. పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెళ్లి వారి ఇంటనే కాదు.. జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆ వ్యాన్‌లో పెళ్లి కుమారుడి తరఫు వారు సుమారు 17 మంది వరకు తిరుగు ప్రయాణమయ్యారు. హ్యాండ్‌ బ్రేకు తీసిన వెంటనే ఆ ప్రదేశం పల్లంగా ఉండటంతో వాహనం వేగంగా కిందకు పడిపోయింది. 

జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలు
కరోనా కారణంగా ఈ ఏడాది మెగా క్రీడా టోర్నీలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత క్రీడాపరంగాను, క్రీడా పోటీల నిర్వహణలో తూర్పు పెద్ద దిక్కుగా మారింది. కరోనా కారణంగా రాష్ట్రస్థాయి డిగ్రీ, ఇంటర్మీడియట్, పాఠశాల స్థాయి పోటీలతో పాటు పలు క్రీడా అసోసియేషన్లు నిర్వహించే పోటీలు, ప్రైవేట్‌ టోర్నీలు నిలిచిపోయాయి. కరోనాకు ముందు అమలాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు మాత్రమే చెప్పుకోదగినవి. మొత్తం 15 అంశాలలో జరిగిన ఈ పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో 250 మంది, మాస్టర్స్, దివ్యాంగ విభాగంలో 85 మంది, మహిళా విభాగంలో 30 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలో జాతీయ మహిళల విభాగంలో బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించడం ఇక్కడే తొలిసారి కావడం గమనార్హం. ఇండియన్‌ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, పద్మశ్రీ ప్రేమ్‌చంద్‌ డగ్రా ఈ పోటీలకు రావడం హైలెట్‌గా నిలిచింది. అమలాపురం వంటి ప్రాంతంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడాన్ని పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు అభినందించారు.  

గ్యాస్‌ లీకేజీ
కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 4.30 గంటల మొదలైన గ్యాస్‌ లీకేజీ స్థానికులు భయభ్రాంతులకు గురిచేసింది. ఓఎన్జీసీ సంస్థకు చెందిన బావిని లీజుకు తీసుకున్న పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 48 గంటల పాటు స్థానికులతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఓఎన్జీసీ అధికారులను ఆందోళనకు గురి చేసింది. భీకర హోరుతో నేలపొరల నుంచి తన్నుకు వచ్చిన సహజ వాయువు (గ్యాస్‌) కమ్మివేయడంతో స్థానికులు గజగజలాడారు. సుమారు 1,600 మందిని పునరావాస 
కేంద్రాలకు తరలించడంతో పాటు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు దిగింది. ఎక్కడా నిప్పు రాజుకోకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంది. ప్రమాదం జరిగిన 48 గంటల తరువాత ఓఎన్జీసీ రెస్క్యూ బృందం గ్యాస్‌ లీకేజీని అరికట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  

బీసీలకు పదవుల పండగ 
రాజకీయ చైతన్యం కలిగిన తూర్పులో ఈ ఏడాది పలువురికి ఉన్నత పదవులు వచ్చాయి. బీసీ సామాజిక వర్గానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం లభించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జూన్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జూలైలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ కులాలకు ప్రకటించిన కార్పొరేషన్లలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. గాండ్ల, తెలికుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా రాజమహేంద్రవరానికి చెందిన సంకిస భవానీ ప్రియ, అయ్యరక కార్పొరేషన్‌ చైర్మన్‌గా సామర్లకోటకు చెందిన అవాల రాజేశ్వరి, పెరికి కార్పొరేషన్‌ చైర్మన్‌గా తుని మండలం పి.తిమ్మాపురానికి చెందిన పురుషోత్తం గంగాభవాని, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కాకినాడకు చెందిన బందన హరి ఎంపికయ్యారు. వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్సీగా మాజీ అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఎన్నికయ్యారు. రాజకీయంగా ఈ ఏడాది మిగిలిన పార్టీలలో కొత్త నియామకాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, మన జిల్లాకు చెందిన సోము వీర్రాజు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, అమలాపురానికి రెడ్డి అనంతకుమారి, రాజమహేంద్రవరానికి కొత్తపల్లి జవహర్‌ నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చిలో మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. కరోనా పేరుతో ఎన్నికల కమిషన్‌ వాయిదా వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

తగ్గిన నేరాలు 
తీవ్ర నేరాల నమోదు సంఖ్య గతేడాదితో పోలిస్తే 2020లో తగ్గింది. 2019లో 120 కేసులు నమోదైతే  2020లో 104 కేసులు నమోదయ్యాయి. లోక్‌ అదాలత్‌లో 1,663 కేసులు పరిష్కరించారు. గతేడాది దిశ చట్టాన్ని అనుసరించి 758 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 999కి పెరిగింది. గిరిజనుల ఉన్నతికి కృషి చేసినందుకు, చేపట్టిన చర్యలకు ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మీకి బెస్ట్‌ కెపాసిటీ బిల్డింగ్‌ అవార్డు అందింది. కోవిడ్‌ మహమ్మారి 11 మంది పోలీసులను పొట్టనబెట్టుకుంది. చంటి పిల్లలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాది వీటి సంఖ్య 154కు చేరింది. 

ఏడు నెలలుగా ఉపాధి లేదు 
ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. వ్యవసాయ కూలీ అయిన నాన్నతో పాటు అమ్మ, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకే ఇంటిలో జీవనం సాగిస్తున్నాం. జూన్‌లో నూతన విద్యా సంవత్సరం ఆరంభం కావాల్సి ఉండగా కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి కారణంగా జరగలేదు. ఉపాధి లేకపోవడంతో జూన్‌ నుంచి కొద్ది నెలలు పాటు కూరగాయలను విక్రయించాను. కరోనావ్యాప్తి తీవ్రం కావడంతో దాన్ని వదులుకున్నాను. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. 
– సంగుల శ్రీనివాస్, అంగర, కపిలేశ్వరపురం మండలం

విద్యార్థుల సంఖ్య పెరిగింది 
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. వ్యవస్థ తారుమారైంది. మన ప్రాంతంలో కరోనా తగ్గినా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు ఇబ్బంది పడుతున్నారు. దశలవారీగా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యావ్యవస్థ గాడిలో పడటానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులకు ఊరట లభించింది.
– మోకా ప్రకాష్‌. హెచ్‌ఎం, తొండవరం, అంబాజీపేట మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement