గండికోట ఉత్సవాల్లో భాగంగా కోటపై లైటింగ్ ప్రదర్శన
సాక్షి, కడప కల్చరల్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది జిల్లా కళా రంగంపై స్పష్టంగా కనిపించింది. జిల్లాలో అన్ని రకాల పర్యాటకానికి అనుకూలమైన ప్రదేశాలు ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సభలు, సమావేశాలపై నిషేధం ఉండడంతో కళా ప్రదర్శనలు, సాహిత్య సభలు కనిపించలేదు. ప్రజలకు ఆనందం, ఆహ్లాదం పంచాల్సిన శిల్పారామాలు, పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. లాక్‌డౌన్ తర్వాత రెండు నెలల్లో ఓ మోస్తరుగా పూర్వ వైభవం వైపు సాగుతున్నాయి. కరోనా భయంతో దేవుడే దిక్కని భావించిన భక్తులు దేవాలయాలు సైతం చాలా రోజులు మూసివేయడం, కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు ఉండడంతో దైవ దర్శనం కూడా చేసుకోలేక పోయారు.
పర్యాటక ప్రాభవం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పలు హరిత హోటళ్లు నిర్మించారు. 37 దేవాలయాలను అభివృద్ధి చేసి పర్యాటకాభివృద్ధికి కృషి చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కరోనా కష్ట సమయంలో కూడా జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇడుపులపాయ కేంద్రంగా ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ వైఎస్సార్ స్మారక పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వేంపల్లెలో అత్యాధునిక వసతులతో కొత్తగా శిల్పారామం ఏర్పాటు చేయనున్నారు. పులివెందులలోని శిల్పారామాన్ని మరింత హంగులతో ప్రజలను ఆహ్లాదపరిచేలా తీర్చిదిద్దనున్నారు. మోపూరు శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ హోటల్, పార్కు, పర్యాటకులకు వసతి కల్పన తదితర పనులు కూడా చేపట్టనున్నారు. (చదవండి: శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు)
ఎకో టూరిజంలో భాగంగా సోమశిల వెనుక జలాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ‘వన విహారి’ పేరిట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఈ సంవత్సరం పర్యాటకాభివృద్ధి పుస్తకాలను ప్రచురించింది. రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కరోనా ఆటంకాలను దాటుకుని ఈ సంవత్సరంలో తొమ్మిది పర్యాటక సమావేశాలు నిర్వహించింది. ఐదు పర్యాటక అభివృద్ధి పుస్తకాలను ప్రచురించారు. బద్వేలుకు చెందిన ప్రముఖ చిత్ర, శిల్పకారుడు గొల్లపల్లి జయన్న రూపొందించిన శిల్పాలతో కడప నగరంలో రెండు రోజుల ప్రదర్శన నిర్వహించడం ఈ సంవత్సరంలో ప్రముఖ కళా ప్రదర్శనగా నిలిచింది.
శాసనాలు: జిల్లాను శాసనాల ఖిల్లాగా అభివర్ణించడం న్యాయమేనని కడప నగరానికి చెందిన యువ శాసన శోధకుడు మునికుమార్ నిరూపించారు. ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సంవత్సరం మూడు శాసనాలను కనుగొన్నారు. తొండూరు, సుగమంచిపల్లెలతోపాటు మరో రెండుచోట్ల సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన యువకులు రెండు పురాతన శాసనాలను కనుగొన్నారు.
బ్రౌన్ వైభవం: బ్రౌన్ గ్రంథాలయం రజితోత్సవ కార్యక్రమాలను వైవీయూ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ గ్రంథాలయ చరిత్రలో ప్రముఖమైనదిగా భావించిన ఈ రజితోత్సవాన్ని పలు సాహిత్య కార్యక్రమాలు, వెబ్‌నార్, నేరుగానూ పలు కళా ప్రదర్శనలను నిర్వహించారు. బ్రౌన్ జయంతి నుంచి వర్ధంతి వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రజితోత్సవ సంచిక, ఐదు సాహిత్య పుస్తకాలను ప్రచురించారు. బాలల దినోత్సవాన్ని నిర్వహించలేకపోయిన జిల్లా గ్రంథాలయాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘చదవడం మాకిష్టం’పథకంలో భాగంగా విద్యార్థులు నీతి కథల పుస్తకాలను చదివే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని జిల్లా రెడ్డి సేవా సమితి ఈ సంవత్సరం పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నగరంలో మరో ప్రముఖ కళా వేదికగా మారింది. ఫిబ్రవరిలో నెలనెల సాహిత్యం వంద కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది.
మెరుపులు
♦ గండికోట ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. అక్కడ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తెచ్చారు.
♦మార్చి మాసంలో గండికోటలో జరిగిన తవ్వకాల్లో ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలు కొనసాగిస్తే మరిన్ని చారిత్రక అవశేషాలు బయల్పడే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు.
♦ పాతకడప చెరువు పరిసరాలను ఆధునికీకరించి ట్యాంక్‌బండ్ తరహాలో జిల్లా మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నగర పాలక సంస్థ సిద్ధమయ్యింది.
♦ కడప నగరంలోని రాజీవ్‌మార్గ్‌ను ఆహ్లాదకరమైన ట్యాంక్‌బండ్‌గా మార్చి నగర వాసులు సేద తీరేందుకు అనువుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
మరకలు
♦ కళారంగం పూర్తిగా కళ తప్పింది. కళాక్షేత్రాలు, రంగస్థలాలు కార్యక్రమాలు లేక వెలవెలబోయాయి. కళాకారులు ఆర్థికంగా చితికిపోయారు.
♦ 2021 జనవరిలో జరగాల్సిన గండికోట వారసత్వ ఉత్సవాలపై కరోనా కాటు పడనుంది.
♦ సీనియర్ రచయిత ఎన్సీ రామసుబ్బారెడ్డి, ధార్మికవేత్త, టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లాకు చెందిన కామిశెట్టి శ్రీనివాసులు, స్థానిక ఉర్దూ కవి మున్వర్ ఖాద్రి కన్నుమూశారు.
♦ ప్రముఖ రంగ స్థల కళాకారులు కేవీ శివారెడ్డి, చెక్కభజన కళాకారుడు లక్ష్మయ్య, అంధుడైన గాయకుడు, సంగీత దర్శకుడు సాంబశివుడు కన్నుమూశారు.
♦ సాహితీ కార్యక్రమాల నిర్వాహకులు, ముస్లిం మైనార్టీల్లో సాహిత్యాభిలాషకు కృషి చేసిన మస్తాన్‌వలీ, ఆకాశవాణి కడప కేంద్రం సీనియర్ వ్యాఖ్యాత మంజులాదేవి భౌతికంగా దూరమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment