'ఒకేరోజు మూడు పార్టీలు మారినవారు ఉన్నారు'
తిరుమల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్షేమంగా ఉండాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికమైన ఉద్వేగాలు ఉంటాయని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.
కుటుంబం నుంచి వేరు పడిన తర్వాత కూడా అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తాయని...అయితే పెద్దలు ఆ వివాదాలను పరిష్కరిస్తారని, అలాగే కేంద్రం కూడా ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాలని గుత్తా కోరారు. ఇరు రాష్ట్రాలు బంగారు భవిష్యత్ కలిగి ఉండాలన్నారు.
రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని గుత్తా అన్నారు. కొంతమంది నాయకులు ఒకేరోజు మూడు పార్టీలు మారిన సంఘటనలు ఉన్నాయన్నారు. నేతలకు స్థిరత్వం అనేది ఉండాలని, ప్రజలు అన్నిటిని గమనిస్తూ ఉంటారన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు...టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు గుత్తా పైవిధంగా స్పందించారు. ఎటుపోయి ఎటువచ్చినా పార్టీలు మారటంలో సంఖ్యాబలం మారుతుందే తప్పా, పెద్దగా ఒరిగేది ఏమీలేదన్నారు.