బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్! | Steel plant should placed in bayyaram | Sakshi
Sakshi News home page

బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్!

Published Sat, Jun 14 2014 4:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్! - Sakshi

బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్!

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఎక్కడనేది దాదాపు తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మెలిక పెడితే తప్ప బయ్యారం మండలంలోనే ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్షాల సభ్యులు మాట్లాడిన అనంతరం.. కేసీఆర్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్లాంట్‌ను బయ్యారంలోనే ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సందర్భంగా బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని పలు రాజకీయ పార్టీలు ప్రతిపాదించాయి.
 
వైఎస్సార్‌సీపీ పక్షాన ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కల్పించవచ్చని చెప్పారు.
 
 ఆ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న సభ్యుల విజ్ఞప్తికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. బయ్యారంలో ఏర్పాటు చేస్తేనే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఇతర ఖనిజ సంపదను కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇటీవల ప్రధాన మంత్రి మోడీని కలిసిన సందర్భంగా ఇచ్చిన వినతిపత్రంలో కూడా బయ్యారంలోనే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు. దీంతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర సాధికార కమిటీకి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన ఇతర ప్రాంతాలను ఇక పరిశీలించే అవకాశం లేద ని తెలుస్తోంది.
 
బయ్యారంలోనే ఎందుకు..?
జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్ర సాధికార కమిటీ గత నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నుంచి నిపుణుల బృందం జిల్లా అధికారులు ప్రతిపాదించిన బయ్యారం మండలం ధర్మాపురం, కొత్తగూడెం మండలం కూనారం గ్రామాలకు ఉన్న అనుకూల, ప్రతికూలతలపై అధ్యయనం చేసింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక మేరకు సెయిల్ తీసుకునే నిర్ణయానికి కేంద్ర ఆమోదం లభిస్తే జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది.

అయితే, అధికారులు ప్రతిపాదించిన రెండు ప్రాంతాల్లో బయ్యారం మండలమే అనుకూలమనే వాదన వినిపిస్తోంది. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్‌గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడంతో పాటు, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉన్నాయి.
 
బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు 14 కిలోమీటర్ల దూరంలో రైలుమార్గం ఉంది. సింగరేణి కాలరీస్ పరిధిలో జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు వచ్చే అవకాశం ఉంది. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్‌పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220 కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది.
 
కాగా, కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడం ఇక్కడ ప్రతికూలంగా ఉంది. దీనిపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భారీ ప్రాజెక్టు నిర్మించిన చోట యూజీ మైనింగ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అసలుకే మోసం వస్తుందనే భావన జీఎస్‌ఐ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బయ్యారం అయితేనే మంచిదనే ఆలోచనలో అటు సెయిల్, జీఎస్‌ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement