ఆదివాసీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు
సారపాక(బూర్గంపాడు): ఆదివాసీల సమస్యలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్షనేత, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీ వర్గీకరణ కోరుతూ గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సారపాకలోని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆదివాసీలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ కాబట్టే తాను ఎమ్మెల్యేను కాగలిగానని అన్నారు. ఆదివాసీల న్యాయపోరాటానికి అండగా ఉంటానన్నారు.
పాలకులకు ఆదివాసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఏజెన్సీలో నిజమైన ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటాలు కొనసాగించాలన్నారు. వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ డిమాండ్‌తో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 1956 నుంచి 1970 వరకు ఆదివాసీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఇప్పుడు కూడా వర్తింపజేయాలన్నారు.
1970 తర్వాత పెంచిన 2 శాతం రిజర్వేషన్లు యరుకల, యానాది, లంబాడీలకు అమలు చేయాలన్నారు. ఉమ్మడిగా రిజర్వేషన్ల అమలుతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన్య వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు బంజారాలు కొనకుండా కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దాగం ఆదినారాయణ, పాయం సత్యనారాయణ, ముర్రం వీరయ్య, సొడె చలపతి, గొంది లీలాప్రసాద్, ఇర్పా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.