tribal people problems
-
మావారి ఆచూకీ తెలపండి
పాడేరు(విశాఖ పట్టణం) : పిల్లలను పాఠశాలకు పంపేందుకు వచ్చిన తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వెంటనే వారి ఆచూకీ తెలపాలని పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన గిరిజనులు వరద రామ్మూర్తి, పోత్రంగి కనకాలమ్మ, తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎస్పీ రాజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన వరద వెంకటేష్ అనే గిరిజనుడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాడేరులో ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నాడన్నారు. గ్రామానికి చెందిన మరో గిరిజనుడు పాత్రోంగి కోటిబాబు కూడా పిల్లలను పాడేరులోని ఓ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్నాడన్నారు. వీరిరువురు ఈ నెల 18న తమ కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలను పాఠశాలలకు పంపేందుకు పాడేరు వచ్చారన్నారు.సినిమాహాల్ సెంటర్లో ఉండగా పోలీసులు వచ్చి తమ వారిని అన్యాయంగా వారి వెంట తీసుకుపోయారన్నారు. తీసుకువెళ్లేముందు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారన్నారు. కానీ నేటికి వారి ఆచూకీ తెలపలేదన్నారు. ఎక్కడ దాచిపెట్టారో, వారిని ఏం చేస్తున్నారో భయంగా ఉందన్నారు. తమ వారికి మావోయిస్టులతో కానీ వారి కార్యకలపాలతో కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. మాపై గిట్టని వారు తమవారి పట్ల పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చునన్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని లేని పక్షంలో బేషరతుగా విడుదల చేయాలని వారు కోరారు. -
మాయ‘దారి’ కష్టాలు
సాక్షి, సీతంపేట: మండలంలోరి పాండ్ర, మేడ ఒబ్బంగి గిరిజన గ్రామాలు ఎత్తైన కొండలపై ఉన్నాయి. ఆ గ్రామాల గిరిజనులు ఓటేయాలంటే నడుచుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్నరాయి పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. లోతుగూడ గిరిజనులు ఓటు వేయాలంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబాం గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామానికి ఇంకా పూర్తిగా రహదారి నిర్మించలేదు. జోడిమానుగూడ, ఈతమానుగూడ తదితర గ్రామాల పరిధిలో 150 మంది వరకు ఓటర్లు ఉంటారు. వీరంతా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలిగాం గ్రామానికి ఓటు వేయడానికి రావాల్సి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలు వందకు పైగానే ఉం టాయి. వీరందరికీ ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నడకయాతన తప్పదని పలువురు వాపోతున్నారు. సీతంపేట ఏజెన్సీలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాలే ఎక్కువ. ఇక్కడే ఎక్కువగా గిరిజనులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే సాధారణ ఎన్నికల్లో మాత్రం కొండలపై నివసిస్తున్న గిరిజనులకు ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ఎన్నికల్లో అవస్థలు తప్పడం లేదు. సీతంపేట ఏజెన్సీలో 456 గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో 200 గ్రామాల వరకు కొండలపైనే ఉన్నాయి. 420 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు. మిగతా గ్రామాలకు అరకొరగా రహదారి సౌకర్యం ఉంది. అయితే రహదారి కల్పించిన గ్రామాలకు ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు. మండలంలోని 24 పంచాయతీల్లో 103 పోలింగ్ కేంద్రాలుండగా ఓటర్లు 39,337 మంది ఉన్నారు. వారిలో పురుషులు 18,531 ఉండగా మహిళలు 19.967 మంది ఉన్నారు. ఇతరులు ఒకరు ఉన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. 10 వేల మందికి పైగా ఓటర్లు కొండలపై నివాసముంటున్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాలకు నడిచే రావాల్సి ఉంటుంది. ఓటుహక్కువినియోగించుకోవాలి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. 103 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కేంద్రాలన్నింటిలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాలు లేని కొన్ని గ్రామాల ఓటర్లు సమీప పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. - ప్రకాశరావు, తహసీల్దార్ నడుచుకుంటూ వెళ్తాం బెన్నరాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తాం. దీంతో చాలా మందికి అవస్థలు తప్పడం లేదు. గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. ఏదో విధంగా కేంద్రాలకు చేరుకుని ఓటు వేయడానికి అందరం మొగ్గుచూపుతాం. - ఎం.ఫల్గుణరావు, పాండ్ర కొండ దిగి ఎక్కాలి ఓటేయాలంటే కొండదిగి ఎక్కాల్సి ఉంటుంది. చాలా కష్టమైన పని. మా గ్రామం ఈతమానుగూడ పరిధిలో చిన్న, చిన్న గూడలు ఉన్నాయి. ఈ గూడల గిరిజనులంతా కొండదిగువన ఉన్న శిలిగాం గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఇబ్బందులు తప్పడం లేదు. - ఎస్.చెంచయ్య, గొయిది మాజీ సర్పంచ్ -
ఆదివాసీ తెగువకు ప్రతీక పత్థల్‌గఢీ
జార్ఖండ్‌లో జరుగుతున్న పత్థల్‌గఢీ ఉద్యమం నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావించడం ఆదివాసీల సమస్యలను నిర్లక్ష్యం చేయడంలో భాగంగానే చూసితీరాలి. అంతేకాదు, ఆ ముద్ర వేయడం ద్వారా ఆదివాసీలను అణచివేయొచ్చనే కుటిలత్వం అందులో ఇమిడి ఉంది. ఒకవేళ నక్సలైట్లే ఈ డిమాండ్ చేసినా లేక ఇంకెవరైనా చేసినా ఆ సముచిత డిమాండ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒకవైపు నక్సలైట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని ప్రభుత్వాల మద్దతుదారులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారానికి సొంత నాయకత్వంలో పోరాడుతుంటే వారిపై నక్సలైట్లని ముద్ర వేస్తే సమస్య మరింత జటిలమవుతుంది. ‘‘భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి, ఎలాంటి గుర్తింపు లేని లక్షలాది మంది భూమిపుత్రుల పక్షాన నిలబడి మాట్లాడు తున్నందుకు గర్వంగా ఉంది. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులే నా మాటలకు శక్తి. ఆదివాసులను దేశం లోని చాలా మంది ‘జంగ్లీ’ అని పిలుస్తారు. అలాంటి పేరు చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. ఆదివాసీ ప్రజలకు మీరు ప్రజాస్వామ్యాన్ని బోధించాల్సిన అవసరం లేదు. మీరే వారి నుంచి ప్రజాస్వామిక విలువలు, పద్ధతులూ నేర్చుకోవాల్సి ఉంది. ఈ భూమ్మీద అత్యంత ప్రజాస్వామిక ప్రియులు ఆదివా సీలే,’’ అంటూ గర్జించిన కంఠం అడవిబిడ్డ, ముండా ఆదివాసీ తెగనాయకుడు జైపాల్ సింగ్‌ది. 1946 డిసెంబర్ 16న భారత రాజ్యాంగ సభను కుదిపేసిన జైపాల్‌సింగ్ సింహనాదమది. ‘ఆదివాసీయేతరులు నా జాతి ప్రజలను నిరంతరం దోపిడీ చేయడం, అణ చివేయడం చరిత్రనిండా కనిపిస్తోంది. అయితే మనం ఈనాడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలు నిర్లక్ష్యా నికి గురికాకుండా, సమానత్వం కోసం కృషి చేయా లని, అందుకు ఈ రాజ్యంగ సభ, ప్రత్యేకించి జవహ ర్లాల్ నెహ్రూ హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ జైపాల్‌సింగ్ తన ప్రసంగంలో కోరారు. జైపాల్‌సింగ్ 1903 జనవరి 3న నిరుపేద ముండా కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం జార్ఖం డ్లోని ఖూంటీ జిల్లా పహాన్ టోలీ గ్రామం జైపాల్ సింగ్ జన్మస్థలం. మొదట పశువుల కాపరిగా పనిచే శారు. క్రైస్తవ గురువుల ప్రోత్సాహంతో విద్యాభ్యాసం ప్రారంభించి, రాంచీలోని సెయింట్ పాల్ కళాశా లలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లోనేæ ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపిక య్యారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1934లో ఆఫ్రికాలోని గోల్డ్ కోస్ట్‌లో అధ్యాప కుడిగా చేరారు. 1937లో ఇండియా తిరిగి వచ్చి రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలో అ«ధ్యా పకుడిగా చేరిన వెంటనే 1938లో బికనీర్ సంస్థా నంలో విదేశాంగ కార్యదర్శిగా కుదిరారు. ఆదివాసీ మహాసభ స్థాపనతో పోరాటం ఆదివాసీల తరఫున పోరాడడానికి 1937లో ఆదివాసీ మహాసభను స్థాపించారు. స్వాతంత్య్రం ఇవ్వడానికి కొన్ని నెలల ముందు ఏర్పడిన భారత రాజ్యాంగ సభకు ఆయన ఎన్నికయ్యారు. ఆ సభలో చేసిన ప్రసంగం ఆదివాసీల హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడానికి ఎంతో ఉపకరించింది.ఆ ప్రసం గంలోని వాక్యాలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆదివాసీలు ఇంకా తమ మనుగడ కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బిర్సా ముండా నాయకత్వంలో తిరుగుబాటు, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాటాలూ, ప్రస్తుతం నక్సలైట్ పార్టీల నేతృత్వంలో కొనసాగు తున్న ఆదివాసీ సాయుధ పోరాటాలు నేటి పరిస్థితు లకు సాక్షిగా నిలబడుతున్నాయి. ప్రభుత్వాల ఆలో చనల్లో, ఆచరణలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. పైగా హింసా ఉద్యమాలనే పేరుతో ప్రభు త్వాలు ఆదివాసీలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తు న్నాయి. ఈ అనుభవంతో ఆదివాసీలు ఉద్యమప థంలో తమదైన నూతన ఒరవడిని సృష్టించుకుంటు న్నారు. అందులో బిర్సా ముండా, జైపాల్సింగ్లు పుట్టిన జార్ఖండ్ గడ్డ మొదటి వరుసలో నిలబడు తోంది. పార్టీల జెండాలు లేకుండా సొంత ఎజెం డాతో జార్ఖండ్‌లో ముండా తెగ ఆదివాసీలు తెగింపు నకు దిగారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ ఉద్యమ మెరుపులు దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. తుపాకులు, బాంబులు, మందుపాతరలు లేకుండా కేవలం శిలల మీద రాసిన అక్షరాలతో జార్ఖండ్‌లోని ముండా తెగ ఆదివాసీలు స్వపరిపాలన కోసం పోరాడుతున్నారు. తమపై సాగుతున్న నిర్బం ధాన్ని నిరసిస్తూ, పోలీస్ సెక్యూరిటీ ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆదివాసీల సాహసంతో ఈ ఉద్యమం వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్యమాన్ని ఆదివాసీలు ‘పత్థల్‌గఢీ’గా పిలుస్తున్నారు. జార్ఖండ్‌లోని ఖూంటీ, గుమ్లా, సిమ్డేగా, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాల్లోని దాదాపు 200 గ్రామాల్లో పత్థల్‌గఢీ ఉద్యమం విస్తరిం చింది. ప్రతి ఆదివాసీ పల్లె మొదట్లో పదిహేను అడు గుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు కలిగిన రాతిపైన 1996లో పార్లమెంటు ఆమోదించిన పంచా యతీ (షెడ్యూల్డ్ ఏరియాల విస్తరణ) చట్టం(పెస) లోని ముఖ్య నిబంధనలను చెక్కుతున్నారు. దాని కింద ఆదివాసీయేతరులకు మా పల్లెల్లోకి ప్రవేశం లేదనే హెచ్చరికను సైతం శిలాక్షరాలుగా తొలుస్తు న్నారు. పత్థల్‌గఢీ అనేది ముండా ఆదివాసీల సాంప్ర దాయంలో ఒక భాగం. వ్యక్తులు మరణించిన తర్వాత సమాధి చేస్తూ, వాళ్ళ శిరస్సు కింద ఒకరా తిని ఉంచుతారు. ఆ రాతి మీద తలపెట్టి భౌతిక కాయాన్ని పూడ్చిపెడితే రాతి మీద ప్రశాంతంగా నిద్రపోతారని ఆదివాసీల విశ్వాసం. ఈ సాంప్రదా యాన్ని ఉద్యమానికి సంకేతంగా వాడడం ఇప్పుడే కాదు, పెస చట్టం వచ్చిన కొత్తలోనే ప్రముఖ సామా జిక ఉద్యమకారుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీడీ శర్మ, మాజీ ఐపీఎస్ అధికారి బందీ ఒరాన్లు ఇలాంటి శిలాశాసనాల ప్రదర్శనకు అంకురార్పణ చేశారు. అప్పట్లో కేవలం పెస చట్టం ప్రచారానికి ఈ ప్రక్రియను వాడేవారు. కానీ ఇప్పుడు మరోసారి తమ హక్కుల రక్షణకు అదే పోరాట రూపాన్ని సరికొత్తగా ఉపయోగిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. ఆదివాసీల్లో పెరిగిన అసంతృప్తి డిసెంబర్ 2014లో జార్ఖండ్‌లో బీజేపీ నాయకత్వాన సంకీర్ణ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆదివాసీల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఆదివాసీ కౌలుదారీ రక్షణ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ చట్టాల్లో తీసుకువచ్చే సవరణల ద్వారా ఆదివాసీ భూములను అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని ఆలోచించారు. దీన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకపక్షంగా అసెంబ్లీ ఆమో దించిన ఈ చట్టాలను ఆదివాసీ ప్రజల తిరుగుబాటు వల్ల ఆ రాష్ట్ర గవర్నర్ ద్రౌపదీ ముర్మూ ఆమో దించకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిం చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని మరో కొత్త చట్టాన్ని గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదింప జేసుకుంది. ఇది గత చట్టాలకన్నా మరింత ప్రమాదకరమైందని ప్రతి పక్షాలు, ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి. దీనికి ఇంకా గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పనకు ఏమాత్రం ప్రయ త్నించని ప్రభుత్వం తమ భూములను కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తోందని చెబుతూ దీన్ని ప్రతి ఘటించాలని ఆదివాసీలు నిర్ణయించుకున్నారు. అందుకు ‘పెస’ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగిం చుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలైన షెడ్యూల్డ్ ఏరియాలో వనరులు, ఉత్తర్వులు, ఇతర ఏ అంశా ల్లోనైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆదివాసీ గ్రామ సభలకే ఉంటుందనే నిబంధనను అమలుకు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ‘గ్రామసభలకే సర్వాధికారం’ అనే నినాదాన్ని లేవ నెత్తారు. ప్రధానంగా ఇరవై, పాతికేళ్ల యువతీయువ కులే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆదివాసీ ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఈ యువ కులకు మద్దతుగా నిలబడుతున్నారు. అధ్యాపకులు, న్యాయ వాదులు ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. తమ డిమాండ్లను ఉద్యమకారులు ప్రకటించారు. 2018 జనవరి 16న తమ కోర్కెల పత్రాన్ని ఖూంటీ జిల్లా అధికారులకు అందజేశారు. ఆదివాసీల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించి, గ్రామసభలకు అందించాలనేది మొదటి డిమాండ్. నక్సలైట్ల పేరుతో అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించడం ఆపి వేయాలి. షెడ్యూల్డ్ ఏరియాల నుంచి పోలీసు, మిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలి. ఇలాంటి డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యకలాపాల్లో, చివరకు ఎన్నికల్లో కూడా తాము పాల్గొనబోమని ఆదివాసీలు తేల్చి చెప్పారు. ఆదివాసీ పోరాటానికి నక్సల్ ముద్ర! రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ మాత్రం ఈ ఉద్యమాన్ని నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఉద్యమకారులను చర్చలకు పిలిచి, సమస్యలు పరి ష్కరించాలని కోరుతున్నాయి. జార్ఖండ్‌లో జరుగు తున్న పత్థల్‌గఢీ ఉద్యమం నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావించడం ఆదివాసీల సమస్యలను నిర్లక్ష్యం చేయ డంలో భాగంగానే చూసితీరాలి. అంతేకాదు, ఆ ముద్ర వేయడం ద్వారా ఆదివాసీలను అణచివేయొ చ్చనే కుటిలత్వం అందులో ఇమిడి ఉంది. ఒకవేళ నక్సలైట్లే ఈ డిమాండ్ చేసినా లేక ఇంకెవరైనా చేసినా ఆ సముచిత డిమాండ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒకవైపు నక్సలైట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని ప్రభుత్వాల మద్దతుదారులూ చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. ఆదివా సీలు తమ సమస్యల పరిష్కారానికి సొంత నాయ కత్వంలో పోరాడుతుంటే వారిపై నక్సలైట్లని ముద్ర వేస్తే సమస్య మరింత జటిలమవుతుంది. గతంలో ఎస్టీల ఉద్యమాలకు ఆదివాసీయేతరులు నాయ కత్వం వహించారు. ఈసారి ఆదివాసీల్లో ఎదిగి వచ్చిన విద్యావంతులు, ఉద్యోగులు స్వశక్తితో ఉద్య మిస్తున్నారు. ఇది ఆదివాసీ ఉద్యమాల్లో నూతన శకం. అందువల్లనే పత్థల్‌గఢీ గత ఉద్యమాల నుంచి అనుభవాలను నేర్చుకొని, ప్రజాస్వామ్య పంథాలో పోరాటానికి నడుం కట్టింది. దేశంలో రోజు రోజుకూ ఆదివాసీ తెగలు అందిపుచ్చుకుంటోన్న చైతన్యానికి ఇదో మచ్చుతునక. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సహించ బోమని ఈ ఉద్యమం హెచ్చరిస్తోంది. మల్లెపల్లి లక్ష్మయ్య ;వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 97055 66213 -
అడవి బిడ్డలపై ఆంక్షలు
మన్ననూర్ (అచ్చంపేట): అడవి బిడ్డలపై ఆంక్షలు విధిస్తున్నారు.. తమ గూడాలకు వెళ్లాలన్నా.. అవసరాలకు అడవి వీడి మన్ననూర్, అమ్రాబాద్ తదితర ప్రాంతాలకు రావాలన్నా.. ఇతర ప్రాంతాల్లో చదివే పిల్లలను పలకరించడానికి వెళ్లాలన్నా అటవీశాఖ నిబంధనలు అడ్డొస్తున్నాయి. అధికారుల అనుమతి లేనిదే మన్యం దాటే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి తల్లికి ద్రోహమా.. అడవిలోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుని తాత ముత్తాతల కాలం నుంచి అక్కడే నివసిస్తున్నామని.. ఏ నాడూ అడవి తల్లికి ద్రోహం తలపెట్టని తమపై ఎందుకు అనుమానం అంటూ చెంచులు వాపోతున్నారు. తమ ఇళ్లకు వెళ్లాలంటే కూడా అధికారుల అనుమతి తీసుకోవాలా.. అంటూ వాపోతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్, పుల్లాయిపల్లి, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంగిడిగుండాలు తదితర పెంటలో చెంచులు తమ జీవనం సాగిస్తున్నారు. గతంలో చెంచులు కాయలు, పండ్లను అడవిలో దొరికే దుంపలతో ఆకలి తీర్చుకునే వారు. రోగమోస్తే ఆకు పసర్లతోనే సర్దుకునేవారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అలవాటు పడిన చెంచులు మైదాన ప్రాంతాల్లో ఉండే ప్రజలతో సంబందాలు ఏర్పరచుకుంటున్నారు. నిబంధనలు కఠినతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్యప్రాణి సంరక్షణ చట్టాలను సవరిస్తూ అమ్రాబాద్‌ను పులుల రక్షిత ప్రాంతంగా గుర్తించింది. వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు చట్టాల్లో అనేక సవరణలు తీసుకొచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ముమ్మరంగా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు హద్దులు నిర్ణయించింది. అయితే ఎప్పటిలాగే చెంచులు అడవిని వదిలి అవసరాలకు వస్తుండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెంచులతోపాటు ఇతరులు అభయారణ్యంలోకి అనుమతి లేకుండా రాకపోకలు చేస్తున్నారనే అనుమానంతో చెంచులకు సైతం అనుమతి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఫర్హాబాద్ వద్ద చెకింగ్ చెంచు పెంటలకు వెళ్లాలన్నా.. బయటికి రావాలన్నా ఫరహాబాద్ వద్ద అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు నుంచి వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అనేకసార్లు చెంచులు, అటవీశాఖ అధికారులు, సిబ్బందికి వాగ్వివాదం, ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అధికారులు, చెంచులు తరుచూ ఒకరినొకరు చూసుకుంటూనే ఆంక్షలు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అడవి బిడ్డలపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలనే చేస్తున్నరు.. మా ఇళ్లకు వెళ్లకుండా ఫారెస్టోళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నరు. జబ్బు చేసినా, దవాఖానకు వెళ్లాలన్నా, పిల్లలను చదువులకు పంపించాలన్న ప్రతిసారి పర్మీషన్ తీసుకోవాలంటే ఎట్లా.. చెకింగ్ చేసేటోళ్లు కూడా మా చెంచు బంధువులే కదా. మా గురించి వాళ్లకు తెల్వదా.. మా నుంచి నుంచి ఎవరికి ముప్పు వస్తది. – చిర్ర రాములు, చెంచుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. చెంచులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. వారివెంట వచ్చే అనుమానితులు, ఇతరులు తారసపడినప్పుడు మాత్రమే చెక్‌పోస్టు వద్ద మా సిబ్బంది అడ్డుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నాం. చెంచులతో మాకు ఎలాంటి వివక్ష లేదు. – శ్రీదేవి, ఫారెస్టు రేంజ్ అధికారి, మన్ననూర్ -
మంత్రి వచ్చి ఏం పొడుస్తాడు: టీడీపీ ఎమ్మెల్యే
సీతంపేట(శ్రీకాకుళం): ప్రతీ దానికి మంత్రి వస్తారు అని చెప్పడం సరికాదు...ఆయన గతంలో వచ్చి ఏం పొడిచాడు, ఇప్పుడేం పొడుస్తాడు..అని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ 70వ పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. వివిధ సమస్యలపై చర్చ జరుగుతుండగా ఈనెల 24న గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెళ్ల కిశోర్ బాబు వస్తున్నారని, ఆయన వచ్చినపుడు సమస్యలు కొన్ని చెప్పవచ్చని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. ఇందుకు స్పందించిన శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా మాట్లాడారు. మంత్రికి పాడేరులో థింసా నృత్యం చేయడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. మంత్రి అచ్చెన్న ఆదేశిస్తేనే జీవోలు ఇస్తారా?... మంత్రి అచ్చెం నాయుడు ఆదేశాలిస్తేనే జీవోలు ఇస్తారా? లేకపోతే ఇవ్వరా అని కలెక్టర్, ఐటీడీఏ అధికారులను శివాజీ ప్రశ్నించారు. ఏ సమావేశమైనా జీవో కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి. గిరిజన ఎమ్మెల్యే, గిరిజనాభివృద్ధి కోసం ఐటీడీఏ ఉంది. మంత్రి ఆదేశాలు ఇస్తేగానీ జీవో కాపీలు ఇవ్వరు ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యం కాదని ప్రోటోకాల్ పాటించాలని శివాజీ అన్నారు. గిరిజన సమస్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కళావతి అనేక ప్రశ్నలు వేస్తుంటే అరోణ్యరోదనగా మిగులుతున్నాయని, పట్టించుకునే వారు లేరని శివాజీ అన్నారు. ఐటీడీఏలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అడ్డంగా వెళ్తోందని ఆరోపించారు. -
ఆదివాసీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు సారపాక(బూర్గంపాడు): ఆదివాసీల సమస్యలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షనేత, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీ వర్గీకరణ కోరుతూ గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సారపాకలోని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంటి ఎదుట ఆదివాసీలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ కాబట్టే తాను ఎమ్మెల్యేను కాగలిగానని అన్నారు. ఆదివాసీల న్యాయపోరాటానికి అండగా ఉంటానన్నారు. పాలకులకు ఆదివాసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఏజెన్సీలో నిజమైన ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటాలు కొనసాగించాలన్నారు. వాటికి తన మద్దతు ఉంటుందన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ డిమాండ్‌తో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 1956 నుంచి 1970 వరకు ఆదివాసీలకు అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఇప్పుడు కూడా వర్తింపజేయాలన్నారు. 1970 తర్వాత పెంచిన 2 శాతం రిజర్వేషన్లు యరుకల, యానాది, లంబాడీలకు అమలు చేయాలన్నారు. ఉమ్మడిగా రిజర్వేషన్ల అమలుతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన్య వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు బంజారాలు కొనకుండా కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దాగం ఆదినారాయణ, పాయం సత్యనారాయణ, ముర్రం వీరయ్య, సొడె చలపతి, గొంది లీలాప్రసాద్, ఇర్పా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.