జార్ఖండ్‌లో జరుగుతున్న పత్థల్‌గఢీ ఉద్యమం నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావించడం ఆదివాసీల సమస్యలను నిర్లక్ష్యం చేయడంలో భాగంగానే చూసితీరాలి. అంతేకాదు, ఆ ముద్ర వేయడం ద్వారా ఆదివాసీలను అణచివేయొచ్చనే కుటిలత్వం అందులో ఇమిడి ఉంది. ఒకవేళ నక్సలైట్లే ఈ డిమాండ్ చేసినా లేక ఇంకెవరైనా చేసినా ఆ సముచిత డిమాండ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒకవైపు నక్సలైట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని ప్రభుత్వాల మద్దతుదారులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారానికి సొంత నాయకత్వంలో పోరాడుతుంటే వారిపై నక్సలైట్లని ముద్ర వేస్తే సమస్య మరింత జటిలమవుతుంది.
‘‘భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి, ఎలాంటి గుర్తింపు లేని లక్షలాది మంది భూమిపుత్రుల పక్షాన నిలబడి మాట్లాడు తున్నందుకు గర్వంగా ఉంది. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులే నా మాటలకు శక్తి. ఆదివాసులను దేశం లోని చాలా మంది ‘జంగ్లీ’ అని పిలుస్తారు. అలాంటి పేరు చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. ఆదివాసీ ప్రజలకు మీరు ప్రజాస్వామ్యాన్ని బోధించాల్సిన అవసరం లేదు. మీరే వారి నుంచి ప్రజాస్వామిక విలువలు, పద్ధతులూ నేర్చుకోవాల్సి ఉంది. ఈ భూమ్మీద అత్యంత ప్రజాస్వామిక ప్రియులు ఆదివా సీలే,’’ అంటూ గర్జించిన కంఠం అడవిబిడ్డ, ముండా ఆదివాసీ తెగనాయకుడు జైపాల్ సింగ్‌ది.
1946 డిసెంబర్ 16న భారత రాజ్యాంగ సభను కుదిపేసిన జైపాల్‌సింగ్ సింహనాదమది. ‘ఆదివాసీయేతరులు నా జాతి ప్రజలను నిరంతరం దోపిడీ చేయడం, అణ చివేయడం చరిత్రనిండా కనిపిస్తోంది. అయితే మనం ఈనాడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలు నిర్లక్ష్యా నికి గురికాకుండా, సమానత్వం కోసం కృషి చేయా లని, అందుకు ఈ రాజ్యంగ సభ, ప్రత్యేకించి జవహ ర్‌లాల్ నెహ్రూ హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ జైపాల్‌సింగ్ తన ప్రసంగంలో కోరారు.
జైపాల్‌సింగ్ 1903 జనవరి 3న నిరుపేద ముండా కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం జార్ఖం డ్‌లోని ఖూంటీ జిల్లా పహాన్ టోలీ గ్రామం జైపాల్ సింగ్ జన్మస్థలం. మొదట పశువుల కాపరిగా పనిచే శారు. క్రైస్తవ గురువుల ప్రోత్సాహంతో విద్యాభ్యాసం ప్రారంభించి, రాంచీలోని సెయింట్ పాల్ కళాశా లలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లోనేæ ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపిక య్యారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1934లో ఆఫ్రికాలోని గోల్డ్ కోస్ట్‌లో అధ్యాప కుడిగా చేరారు. 1937లో ఇండియా తిరిగి వచ్చి రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలో అ«ధ్యా పకుడిగా చేరిన వెంటనే 1938లో బికనీర్ సంస్థా నంలో విదేశాంగ కార్యదర్శిగా కుదిరారు.
ఆదివాసీ మహాసభ స్థాపనతో పోరాటం
ఆదివాసీల తరఫున పోరాడడానికి 1937లో ఆదివాసీ మహాసభను స్థాపించారు. స్వాతంత్య్రం ఇవ్వడానికి కొన్ని నెలల ముందు ఏర్పడిన భారత రాజ్యాంగ సభకు ఆయన ఎన్నికయ్యారు. ఆ సభలో చేసిన ప్రసంగం ఆదివాసీల హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడానికి ఎంతో ఉపకరించింది.ఆ ప్రసం గంలోని వాక్యాలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆదివాసీలు ఇంకా తమ మనుగడ కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బిర్సా ముండా నాయకత్వంలో తిరుగుబాటు, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాటాలూ, ప్రస్తుతం నక్సలైట్ పార్టీల నేతృత్వంలో కొనసాగు తున్న ఆదివాసీ సాయుధ పోరాటాలు నేటి పరిస్థితు లకు సాక్షిగా నిలబడుతున్నాయి.
ప్రభుత్వాల ఆలో చనల్లో, ఆచరణలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. పైగా హింసా ఉద్యమాలనే పేరుతో ప్రభు త్వాలు ఆదివాసీలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తు న్నాయి. ఈ అనుభవంతో ఆదివాసీలు ఉద్యమప థంలో తమదైన నూతన ఒరవడిని సృష్టించుకుంటు న్నారు. అందులో బిర్సా ముండా, జైపాల్‌సింగ్‌లు పుట్టిన జార్ఖండ్ గడ్డ మొదటి వరుసలో నిలబడు తోంది. పార్టీల జెండాలు లేకుండా సొంత ఎజెం డాతో జార్ఖండ్‌లో ముండా తెగ ఆదివాసీలు తెగింపు నకు దిగారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ ఉద్యమ మెరుపులు దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి.
తుపాకులు, బాంబులు, మందుపాతరలు లేకుండా కేవలం శిలల మీద రాసిన అక్షరాలతో జార్ఖండ్‌లోని ముండా తెగ ఆదివాసీలు స్వపరిపాలన కోసం పోరాడుతున్నారు. తమపై సాగుతున్న నిర్బం ధాన్ని నిరసిస్తూ, పోలీస్ సెక్యూరిటీ ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆదివాసీల సాహసంతో ఈ ఉద్యమం వెలుగులోకి వచ్చింది. ఈ ఉద్యమాన్ని ఆదివాసీలు ‘పత్థల్‌గఢీ’గా పిలుస్తున్నారు. జార్ఖండ్‌లోని ఖూంటీ, గుమ్లా, సిమ్‌డేగా, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాల్లోని దాదాపు 200 గ్రామాల్లో పత్థల్‌గఢీ ఉద్యమం విస్తరిం చింది. ప్రతి ఆదివాసీ పల్లె మొదట్లో పదిహేను అడు గుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు కలిగిన రాతిపైన 1996లో పార్లమెంటు ఆమోదించిన పంచా యతీ (షెడ్యూల్డ్ ఏరియాల విస్తరణ) చట్టం(పెస) లోని ముఖ్య నిబంధనలను చెక్కుతున్నారు.
దాని కింద ఆదివాసీయేతరులకు మా పల్లెల్లోకి ప్రవేశం లేదనే హెచ్చరికను సైతం శిలాక్షరాలుగా తొలుస్తు న్నారు. పత్థల్‌గఢీ అనేది ముండా ఆదివాసీల సాంప్ర దాయంలో ఒక భాగం. వ్యక్తులు మరణించిన తర్వాత సమాధి చేస్తూ, వాళ్ళ శిరస్సు కింద ఒకరా తిని ఉంచుతారు. ఆ రాతి మీద తలపెట్టి భౌతిక కాయాన్ని పూడ్చిపెడితే రాతి మీద ప్రశాంతంగా నిద్రపోతారని ఆదివాసీల విశ్వాసం. ఈ సాంప్రదా యాన్ని ఉద్యమానికి సంకేతంగా వాడడం ఇప్పుడే కాదు, పెస చట్టం వచ్చిన కొత్తలోనే ప్రముఖ సామా జిక ఉద్యమకారుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీడీ శర్మ, మాజీ ఐపీఎస్ అధికారి బందీ ఒరాన్‌లు ఇలాంటి శిలాశాసనాల ప్రదర్శనకు అంకురార్పణ చేశారు. అప్పట్లో కేవలం పెస చట్టం ప్రచారానికి ఈ ప్రక్రియను వాడేవారు. కానీ ఇప్పుడు మరోసారి తమ హక్కుల రక్షణకు అదే పోరాట రూపాన్ని సరికొత్తగా ఉపయోగిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు.
ఆదివాసీల్లో పెరిగిన అసంతృప్తి
డిసెంబర్ 2014లో జార్ఖండ్‌లో బీజేపీ నాయకత్వాన సంకీర్ణ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆదివాసీల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఆదివాసీ కౌలుదారీ రక్షణ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ చట్టాల్లో తీసుకువచ్చే సవరణల ద్వారా ఆదివాసీ భూములను అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని ఆలోచించారు. దీన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకపక్షంగా అసెంబ్లీ ఆమో దించిన ఈ చట్టాలను ఆదివాసీ ప్రజల తిరుగుబాటు వల్ల ఆ రాష్ట్ర గవర్నర్ ద్రౌపదీ ముర్మూ ఆమో దించకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిం చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని మరో కొత్త చట్టాన్ని గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదింప జేసుకుంది.
ఇది గత చట్టాలకన్నా మరింత ప్రమాదకరమైందని ప్రతి పక్షాలు, ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి. దీనికి ఇంకా గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పనకు ఏమాత్రం ప్రయ త్నించని ప్రభుత్వం తమ భూములను కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తోందని చెబుతూ దీన్ని ప్రతి ఘటించాలని ఆదివాసీలు నిర్ణయించుకున్నారు. అందుకు ‘పెస’ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగిం చుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలైన షెడ్యూల్డ్ ఏరియాలో వనరులు, ఉత్తర్వులు, ఇతర ఏ అంశా ల్లోనైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆదివాసీ గ్రామ సభలకే ఉంటుందనే నిబంధనను అమలుకు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ‘గ్రామసభలకే సర్వాధికారం’ అనే నినాదాన్ని లేవ నెత్తారు.
ప్రధానంగా ఇరవై, పాతికేళ్ల యువతీయువ కులే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆదివాసీ ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఈ యువ కులకు మద్దతుగా నిలబడుతున్నారు. అధ్యాపకులు, న్యాయ వాదులు ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. తమ డిమాండ్లను ఉద్యమకారులు ప్రకటించారు. 2018 జనవరి 16న తమ కోర్కెల పత్రాన్ని ఖూంటీ జిల్లా అధికారులకు అందజేశారు. ఆదివాసీల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించి, గ్రామసభలకు అందించాలనేది మొదటి డిమాండ్. నక్సలైట్ల పేరుతో అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించడం ఆపి వేయాలి. షెడ్యూల్డ్ ఏరియాల నుంచి పోలీసు, మిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలి. ఇలాంటి డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యకలాపాల్లో, చివరకు ఎన్నికల్లో కూడా తాము పాల్గొనబోమని ఆదివాసీలు తేల్చి చెప్పారు.
ఆదివాసీ పోరాటానికి నక్సల్ ముద్ర!
రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ మాత్రం ఈ ఉద్యమాన్ని నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఉద్యమకారులను చర్చలకు పిలిచి, సమస్యలు పరి ష్కరించాలని కోరుతున్నాయి. జార్ఖండ్‌లో జరుగు తున్న పత్థల్‌గఢీ ఉద్యమం నక్సలైట్ల ప్రేరేపిత చర్యగా భావించడం ఆదివాసీల సమస్యలను నిర్లక్ష్యం చేయ డంలో భాగంగానే చూసితీరాలి. అంతేకాదు, ఆ ముద్ర వేయడం ద్వారా ఆదివాసీలను అణచివేయొ చ్చనే కుటిలత్వం అందులో ఇమిడి ఉంది. ఒకవేళ నక్సలైట్లే ఈ డిమాండ్ చేసినా లేక ఇంకెవరైనా చేసినా ఆ సముచిత డిమాండ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ఒకవైపు నక్సలైట్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని ప్రభుత్వాల మద్దతుదారులూ చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. ఆదివా సీలు తమ సమస్యల పరిష్కారానికి సొంత నాయ కత్వంలో పోరాడుతుంటే వారిపై నక్సలైట్లని ముద్ర వేస్తే సమస్య మరింత జటిలమవుతుంది. గతంలో ఎస్టీల ఉద్యమాలకు ఆదివాసీయేతరులు నాయ కత్వం వహించారు. ఈసారి ఆదివాసీల్లో ఎదిగి వచ్చిన విద్యావంతులు, ఉద్యోగులు స్వశక్తితో ఉద్య మిస్తున్నారు. ఇది ఆదివాసీ ఉద్యమాల్లో నూతన శకం. అందువల్లనే పత్థల్‌గఢీ గత ఉద్యమాల నుంచి అనుభవాలను నేర్చుకొని, ప్రజాస్వామ్య పంథాలో పోరాటానికి నడుం కట్టింది. దేశంలో రోజు రోజుకూ ఆదివాసీ తెగలు అందిపుచ్చుకుంటోన్న చైతన్యానికి ఇదో మచ్చుతునక. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సహించ బోమని ఈ ఉద్యమం హెచ్చరిస్తోంది.
మల్లెపల్లి లక్ష్మయ్య ;వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ : 97055 66213
Comments
Please login to add a commentAdd a comment