మంత్రి వచ్చి ఏం పొడుస్తాడు: టీడీపీ ఎమ్మెల్యే
సీతంపేట(శ్రీకాకుళం): ప్రతీ దానికి మంత్రి వస్తారు అని చెప్పడం సరికాదు...ఆయన గతంలో వచ్చి ఏం పొడిచాడు, ఇప్పుడేం పొడుస్తాడు..అని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ 70వ పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. వివిధ సమస్యలపై చర్చ జరుగుతుండగా ఈనెల 24న గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెళ్ల కిశోర్ బాబు వస్తున్నారని, ఆయన వచ్చినపుడు సమస్యలు కొన్ని చెప్పవచ్చని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. ఇందుకు స్పందించిన శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా మాట్లాడారు. మంత్రికి పాడేరులో థింసా నృత్యం చేయడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు.
మంత్రి అచ్చెన్న ఆదేశిస్తేనే జీవోలు ఇస్తారా?...
మంత్రి అచ్చెం నాయుడు ఆదేశాలిస్తేనే జీవోలు ఇస్తారా? లేకపోతే ఇవ్వరా అని కలెక్టర్, ఐటీడీఏ అధికారులను శివాజీ ప్రశ్నించారు. ఏ సమావేశమైనా జీవో కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి. గిరిజన ఎమ్మెల్యే, గిరిజనాభివృద్ధి కోసం ఐటీడీఏ ఉంది. మంత్రి ఆదేశాలు ఇస్తేగానీ జీవో కాపీలు ఇవ్వరు ఇదేం న్యాయమని ప్రశ్నించారు. ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యం కాదని ప్రోటోకాల్ పాటించాలని శివాజీ అన్నారు. గిరిజన సమస్యలపై వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కళావతి అనేక ప్రశ్నలు వేస్తుంటే అరోణ్యరోదనగా మిగులుతున్నాయని, పట్టించుకునే వారు లేరని శివాజీ అన్నారు. ఐటీడీఏలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అడ్డంగా వెళ్తోందని ఆరోపించారు.