సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.30కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసన మండలికి 13వ సమావేశాలు. ఈ సమావేశాలకు ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ హాజరవుతుందా, లేదా అన్నది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంపై ఆధారపడి ఉంది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకూ అసెంబ్లీకి హాజరు కాబోమని వైఎస్సార్‌సీపీ గతంలోనే ప్రకటించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు శాసనసభ, మండలి గత సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, శాసన మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలసి వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడినందున, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనను అనర్హుడిగా ప్రకటించాల్సి ఉన్నా స్పీకర్ ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. ఈ అంశాన్ని కూడా వైఎస్సార్‌సీపీ నేతలు స్పీకర్ వద్ద ప్రస్తావించారు. దెందులూరు స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించాలని కోరారు. ఫిరాయింపుదార్లపై చర్యలు చేపడితే తమ సభ్యులంతా మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే రాష్ట్ర శాసనసభ, శాసన మండలి చరిత్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. ఈ పరిణామం పట్ల రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ప్రతిపక్షం లేకపోతే సభలో అధికార పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment