శాసనసభలో వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు
శాసనసభలో వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు
అశ్వారావుపేట: గిరిజన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే...
‘‘ప్రజాసమస్యలను శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశాను. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించాను. రైతాంగానికి పగటి వేళ ఏడు గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశాను. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తారంగా ఉన్నాయని చెప్పాను.
గిరిజన యూనివర్సిటీని సత్వరమే మంజూరు చేయూలని కోరాను. నియోజకవర్గంలోని పెదవాగు, అబ్బుగూడెం, మూకమామిడి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి ఆయకట్టును పటిష్టపరచాలని కోరాను. నియోజకవర్గంలోని రహదారులను మెరుగుపరచాలని, రైతులకు డ్రిప్ పరికరాలు సరఫరా చేయాలని, గతంలో జరిగిన కుంభకోణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాను. ఎన్నికలకు ముందు నిర్మించుకున్న కాలనీ ఇళ్లకు బిల్లులు నిలిచిపోయాయని చెప్పాను. వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశాను. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయక సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచాలని కోరాను’’ అని చెప్పారు.