ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: తాము ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని, జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీకి జిల్లాలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని శక్తులు, పత్రికలు కావాలనే ఊహాజనిత కథనాలతో గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని పెద్ద పార్టీగా నిలవడంతో జీర్ణించుకోలేని శక్తులు ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని, తాము టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నామంటూ ప్రచురించిన అసత్య కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. తమకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదన్నారు.
తాము విజయం సాధించిన తరువాత నియోజకవర్గ ప్రజలను కలువకముందే, కొన్ని గంటల్లోనే ఇలాంటి దుష్ర్పచారం చేయడం దిగజారుడుతనమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులమైన తమను కించపరిచేలా, కనీస మర్యాద లేకుండా అగౌరవంగా వ్యవహరించడం సరికాదన్నారు. మైండ్‌గేమ్ ఆడే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచరించే సంస్కృతిని మానుకోవాలన్నారు.
కష్టకాలంలో జగన్‌తో ఉన్న తాము ఎప్పటికీ జగన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నవ తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు. సమావేశంలో ఖమ్మం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు కూరాకుల నాగభూషణం, రవిబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, ఆకుల మూర్తి, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొండల్‌రావు, దుర్గాప్రసాద్, ఎస్.వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, ఎంఏ.సమద్ పాల్గొన్నారు.