సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు అంతర్గత విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. అయినా పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు నేతలు రగిలిపోతున్నారు.
ఇప్పటి వరకు పలువురు నేతలు పరోక్ష విమర్శలకే పరిమితం కాగా.. తాజాగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ మారుతానని అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే మరికొందరు అసంతృప్తి వెల్లగక్కేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
చదవండి: కేటీఆర్ కంటే నేనే సీనియర్: తాటి
ఆది నుంచీ అదే తీరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ఆది నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది. మొదటి నుంచీ ఉన్న ఉద్యమ నాయకులు.. ఆ తర్వాత చేరిన నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరగా.. అప్పటికే పార్టీలో ఉన్న నేతల నడుమ అంతరం పెరగడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది.
2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. రెండు ఎన్నికల్లోనూ ఒక్కో అసెంబ్లీ స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. 2018 తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ మంచి విజయాలనే నమోదు చేసింది. అయినా నేతల నడుమ విభేదాలు అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ నేతల నడుమ పొరపొచ్చాలు ఉండగా.. పాలేరు, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో వర్గ పోరు తీవ్రమవుతుండడం గమనార్హం.
కేటీఆర్ హితబోధ చేసినా..
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈనెల 11న ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్.. నాయకులతో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఈసారి మంచి ఫలితాలు సాధించేలా సమష్టిగా కృషిచేయాలని నచ్చజెప్పా రు. ఈ అంతర్గత సమావేశం తర్వాత కూడా కొందరు నేతల నడుమ సమన్వయం కుదరకపోగా, టీఆర్‌ఎస్‌లో తమ రాజకీయ భవిష్యత్ ఏమిటనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గళం విప్పుతున్న నేతలు
సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తున్నా సరైన అవకాశాలు రావడం లేదనే భావనలో పలు వురు టీఆర్‌ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని, కనీస గౌరవం కూడా దక్కడం లేదని కొందరు నేతలు తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చిన సమయాన పీకే సర్వే నివేదికలు, పనితీరు ప్రామాణికంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
దీంతో తమను నమ్ముకున్న అనుచరులు, కార్యకర్తలకు న్యాయం చేయడమెలా అని కొందరు చర్చలు చేస్తుండగా.. పార్టీలో గుర్తింపు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఉద్దేశంతో నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తాడో పేడో తేల్చుకునే క్రమంలో పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుండగా.. అదే బాటలో ఇంకొందరు అసంతృప్త నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment