రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు 16న శంకుస్థాపనలు | Foundation stone laying and inaugurthe 16th for projects | Sakshi
Sakshi News home page

రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు 16న శంకుస్థాపనలు

Published Sun, Oct 4 2020 5:10 AM | Last Updated on Sun, Oct 4 2020 10:45 AM

Foundation stone laying and inauguration on the 16th for projects worth Rs 15591 crore - Sakshi

కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర నారాయణ శనివారం  తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత నెల 18వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. 

► ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. మొత్తం 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. 
► శంకుస్థాపనలు జరిగే 16 ప్రాజెక్టుల్లో.. రూ.2,225 కోట్లతో చేపట్టనున్న రేణిగుంట– నాయుడుపేట ఆరులేన్ల రహదారి, రూ.1,225 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బైపాస్, రూ.1,600 కోట్లతో నిర్మించనున్న గొల్లపూడి–చినకాకాని ఆరు లేన్ల రహదారితోపాటు కృష్ణా నదిపై మేజర్‌ బ్రిడ్జి ముఖ్యమైనవి.
► జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల్లో.. రూ.2,075 కోట్లతో నిర్మించిన కడప–మైదుకూరు–కర్నూలు నాలుగు లేన్ల రహదారి (ఎన్‌హెచ్‌–40), రూ.1,470 కోట్లతో చేపట్టిన విజయవాడ–మచిలీపట్నం నాలుగు లేన్లు (బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌తో కలిపి), రూ.1,100 కోట్లతో చేపట్టిన నలగంపల్లి–ఏపీ/కర్ణాటక సరిహద్దు నాలుగు లేన్లు, రూ.1,470 కోట్లతో నిర్మించిన రణస్థలం–ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు, రూ.501 కోట్లతో చేపట్టిన కనకదుర్గ గుడి ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌ ముఖ్యమైనవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement