
నిధులు మూరెడు.. పనులు బారెడు
ఆర్‌అండ్‌బీ శాఖ జాబితాలో కొత్త పనులు
ఇంకా అంచనాల తయారీలోనే అధికారులు
పుష్కరాలు తరుముకొస్తున్నా కొలిక్కి రాని ప్రక్రియ
రాజమండ్రి : వరద వేళ గోదావరి ప్రవాహంలా.. కాలం పరుగు పెడుతూ మహాపర్వం.. పుష్కరాలను చేరువ చేస్తోంది. అయినా ఈ బృహ్ఘట్టానికి సంబంధించి.. నిధులు మూరెడు, పనులు బారెడు అన్న చందాన తయారైంది ఆర్‌అండ్‌బీ శాఖ పరిస్థితి. ఈ శాఖ పుష్కరాలకు రూ.180 కోట్లు వ్యయమయ్యే పనులను ప్రతిపాదించగా ఇందులో జిల్లాకు రూ.87 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాగా ప్రజా ప్రతినిధులు ప్రతిపాదిస్తున్న పనులు మరో రూ.వంద కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు శాఖ అధికారులు. గతంలో వేసిన అంచనాలు కూడా పాత స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ (ఎస్‌ఎస్‌ఆర్)ల ప్రకారం రూపొందించారు. ఇప్పుడు వాటిని కూడా సవరించాల్సి రావడంతో ఈ శాఖ పనులన్నీ గందరగోళంగా మారాయి. పుష్కరాలకు ఐదు నెలల కాలం ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి కొత్త, పాత పనులకు తుది ఆమోదం రావాలి. దీంతో అధికారులు ఒత్తిడికి గురవ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాగా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి మాత్రం పనులన్నీ సకాలంలో చేస్తామని చెబుతున్నారు.
ప్రతిపాదనలు పెరిగినా..నిధులు పెరగవు..
గత ఆగస్టులో జరిగిన పుష్కరాల కేబినెట్ కమిటీ తొలి సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ రూ.180 కోట్ల మేర అంచనాలు ఇవ్వగా కేవలం రూ.87 కోట్లే మంజూరయ్యాయి. ఈ ప నులు చేపట్టే సమయంలో కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం మా త్రమే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు పనులను బహిష్కరించడం తో మళ్లీ పనుల ప్రతిపాదనలను సవరించారు. మరో పక్క కొత్తగా పనులు పుట్టుకొస్తున్నాయి. రాజ మండ్రి నుంచి గోదావరిపై నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన క్రాసింగ్ వరకూ కోరుకొండ రోడ్డు ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ముందుగా ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఇటీవల రాజమండ్రిలో పుష్కర పనుల్ని సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ రోడ్డును మధురపూడి వరకూ విస్తరించాలని సూచించారు. అంటే కొత్తగా మరో ఏడు కిలోమీటర్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇందుకు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆర్‌అండ్‌బీ అధికారులు. మరో వంక రాజమండ్రి నుంచి నాలుగు లేన్ల వంతెన అప్రోచ్ రోడ్డు వరకూ సీతానగరం వైపు కూడా నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వాటిని కూడా చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇంకా కోనసీమలో కూడా పలు రోడ్డు పనులను చేపట్టాలని ఆయా ప్రాంతాల నేతలు కొత్తగా అధికారులకు సూచించారు. ఇలా అధికారుల వద్ద పనుల జాబితా పెరుగుతోంది. కానీ నిధులు మాత్రం కొత్తగా వచ్చి చేరడం లేదు.
మంజూరైన పనుల్లోనూ మార్పులు..
ఆర్‌అండ్‌బీ అధికారులు సుమారు రూ.25 కోట్లకు పైగా కొత్త పనులు ప్రతిపాదించగా వాటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఫిబ్రవరి 3న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కరాల సాధికారిత కమిటీ రెండో విడత సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పనులు ప్రారంభించడం, ముగించడం వంటి అంశాలపై చర్చిస్తామని కమిటీ కన్వీనర్ జె.మురళి చెప్పారు. అంటే ఆ పాటికల్లా పనులకు పరిపాలనా పరమైన ఆమోదాలు లభించాలి. మరో వంక సాధికారిత కమిటీ మంజూరైన పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తోంది. కొన్ని పనులను రద్దుచేసి మరి కొన్ని పనులకు కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ ఉన్న నిధుల్లోనే పనులు సర్దుబాటు చేసేందుకు కమిటీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాత వాటి సవరింపులు, కొత్త పనులపై మళ్లీ అంచనాలు, జీఓలు.. ఇలా అన్నీ మళ్లీ మొదటికి వస్తాయి. ఆర్‌అండ్‌బీ శాఖలో కూడా ఇలా పనుల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం.