సాక్షి, అమరావతి: నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాలు కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. తొలుత తాత్కాలిక కార్యాలయాల నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రైవేట్ భవనాల కోసం ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించింది. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని స్థిరాస్తుల సమాచారంతో ఒక నివేదిక రూపొందించింది. ఈ వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపి పరిశీలించాలని సూచించింది. దీన్ని బట్టి కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
చివరి ఆప్షన్‌గా ప్రైవేట్ భవనాలు..
నూతన జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భవనాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అవి లేని పక్షంలో చివరి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ భవనాలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. ఈ భవనాల్లో సివిల్, విద్యుత్ మరమ్మతులు, ఫర్నీచర్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు తయారు చేయాలని పేర్కొంది. ఈ అంశాలన్నింటితో ఈ నెల 18వతేదీలోపు ప్రాథమిక ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించగా వాటిని పరిశీలించి ఏవి బాగుంటాయో నివేదికలో సూచించాలని స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీకల్లా భవనాలకు సంబంధించిన నిర్మిత ప్రదేశం (ఎస్‌ఎఫ్‌టీ), ఇతర వివరాలను సమర్పించాలని నిర్దేశించింది.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కోర్టుల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించింది. కడప, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లున్నాయి. వాటితోపాటు తెలంగాణలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను పరిశీలించారు. తెలంగాణలో 16 ఎకరాల్లో 1.56 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో 18 కార్యాలయాలు పని చేసేలా కలెక్టరేట్లు నిర్మించారు.
కడపలో 30 ఎకరాల్లో 4.71 ఎస్‌ఎఫ్‌టీలో 39 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. శ్రీకాకుళంలో 24 ఎకరాల్లో 3.34 ఎస్‌ఎఫ్‌టీలో 75 కార్యాలయాలు పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఈ మూడింటిని పరిశీలించి ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో 30 కార్యాలయాలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఒక్కో కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటికి సంబంధించి మూడు రకాల ప్రాథమిక డిజైన్లను సబ్ కమిటీ రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లు సిద్ధమయ్యేవరకు తాత్కాలిక కార్యాలయాల్లో కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment