
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా నిధులు కేటాయించి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ చెప్పారు. రూ.2,205 కోట్లతో 8,268 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ కోసం 1,161 పనులు చేపట్టామని తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పనులను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 2010 నుంచి 2019 వరకు కాంగ్రెస్, చంద్రబాబు ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల మరమ్మతుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. దీంతో సీఎం జగన్ సమీక్షించి రోడ్ల పునరుద్ధరణ కోసం దిశానిర్దేశం చేశారని, ఆరు నెలలుగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు.
ఇప్పటికే 118 పనులు పూర్తి
రోడ్ల పునరుద్ధరణ పనుల్లో రూ.158 కోట్ల విలువైన 118 పనులు పూర్తికాగా రూ.697 కోట్ల విలువైన 343 పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు. రూ.260 కోట్ల బిల్లులు చెల్లించామని, ప్లాన్ వర్క్స్ కోసం రూ.1,158.53 కోట్లను నాబార్డ్ నుంచి సమీకరించామని తెలిపారు. వాటిలో 182 పనులు పూర్తికాగా మిగిలిన 51 పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న వంతెనలకు ఎన్‌ఐడీఏ–2 పథకం కింద రూ.570.10 కోట్ల రుణం మంజూరుకు నాబార్డ్ సమ్మతించిందని తెలిపారు. రూ.486 కోట్ల నాబార్డు రుణంతో 14 రైల్, రోడ్ వంతెనల పనుల్ని పూర్తిచేస్తామన్నారు. వాటికి అదనంగా మరో 33 ఆర్వోబీలను నిర్మించాలని గుర్తించినట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.1,980 కోట్లు కేంద్రం వెచ్చించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.440 కోట్ల భూసేకరణ వ్యయాన్ని భరిస్తుందని చెప్పారు. సీఆర్‌ఐఎఫ్ పథకం కింద రూ.2,049 కోట్లతో 1,670 కి.మీ. రోడ్ల రెండులేన్లుగా పేవ్డ్ షోల్డర్స్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్లకోసం తీసుకున్న రుణాన్ని టీడీపీ ప్రభుత్వం మళ్లించింది
2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రచార పథకాల కోసం మళ్లించిందని మంత్రి విమర్శించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే రోడ్ల దుస్థితికి కారణమన్నారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.10,360 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.10,660 కోట్లు తేగలిగితే.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే రూ.11,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ పనులను నాడు–నేడు విధానంలో డాక్యుమెంట్ చేసి రికార్డు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment