పర్సంటేజీ ఇచ్చుకో..పని చేసుకో!
మంత్రాలయం: ఇది నా ఏరియా.. ఎవరిని అడిగి టెండర్ వేశావు.. తమాషాగా ఉందా.. వెంటనే వచ్చి కలువు. పర్సెంజెటీ ఇచ్చుకో లేదంటే.. బిల్లులు రాకుండా చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సంఘటన మంత్రాలయం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు పార్టీని ప్రజలు ఆదరించి అధికారం కట్టబెడితే.. నెల రోజులు నిండక ముందే వసూళ్లకు పాల్పడుతున్నారు. పర్సెంటేజీ ఇస్తావా.. పని ఆపేస్తావా.. ఇచ్చుకుంటే బిల్లు.. లేదంటే చెల్లు అన్న విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. అలాగే డీలర్‌షిప్‌లు, మధ్యాహ్న ఏజెన్సీలను వదలడం లేదు.
బెంబేలెత్తుతున్న కాంట్రాక్టర్లు..:నియోజకవర్గంలోని కల్లుదే వకుంట-మాధవరం గ్రామాల మధ్య రూ.5.30 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మాధవరంకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు 10 శాతం పర్సెంటేజీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రూ.50.30 లక్షలు ఇచ్చుకుంటే తనకు ఎంత మిగులుతుందని కాంట్రాక్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంత ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ చెప్పినా వినిపించుకోలేదు. ఇలా చాలా మంది కాంట్రాక్టర్లను ఆయన డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి ఇలాంటి డిమాండ్లు ఏంటని కాంట్రాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. తెరవెనుక ఉండి అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను పోలీసు అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
మనోడే డీడీ కట్టించుకో..: అదే చోటా నాయకుడు అతో డీలర్‌షిప్‌ల్లోనూ తన ధికార దర్పం చూపుతున్నాడు. తమ్ముడు వస్తాడు.. ఈ నెల నుంచి డీడీ కట్టించుకో అంటూ రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. మండలంలో నలుగురు టీడీపీ నాయకులు ఇలా అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో షాపుకు నలుగురు అనుచరులను పంపి డీలర్‌షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో డీడీలు కట్టించుకోవాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.