
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) చెప్పారు. నాబార్డు నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కృష్ణా జిల్లాలో ఏటిమొగ–ఎదురుమొండి ఐల్యాండ్‌ను అనుసంధానించే వంతెన, జగ్గయ్యపేట–సత్తెనపల్లి మధ్య మరో వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపే ఫైళ్లపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాబార్డు నిధులు రూ.1,158 కోట్లతో తొలి దశ పనులు చేపట్టామని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్లను ఎన్నికల తాయిలాల కోసం టీడీపీ ప్రభుత్వం మళ్లించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోందన్నారు. నిర్ణీత కాలంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.