ఉత్తరాంధ్రలో కుండపోత | 421 centers recorded high rainfall Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో కుండపోత

Published Tue, Sep 28 2021 2:14 AM | Last Updated on Tue, Sep 28 2021 2:19 AM

421 centers recorded high rainfall Andhra Pradesh - Sakshi

శ్రీకాకుళం జిల్లాలో నేలకూలిన వృక్షాలను తొలగిస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానికులు

బలహీనపడిన తుపాను 
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిన తుపాను సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ ఒడిశా వైపు కదులుతూ అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.  గులాబ్‌ తుపాను వల్ల గాలులు 95 కిలోమీటర్ల వేగానికి పరిమితమవగా వర్షాలు మాత్రం విపరీతంగా కురిశాయి. అది కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలపైనా ప్రభావం ఉండటంతో అక్కడా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం వర్షం బాగా తెరిపి ఇవ్వొచ్చని వాతావరణ శాఖ పేర్కొనడం ఊరట కలిగిస్తోంది.

సాక్షి, అమరావతి /సాక్షి నెట్‌వర్క్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లాలో అనూహ్యంగా 11.8 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 సెం.మీ., విజయనగరం జిల్లాలో 8.9 సెం.మీ. సగటు వర్షం కురిసింది. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. నగర శివారులోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు 33.3 సెం.మీ. వర్షం కురిసింది.

పెందుర్తిలో 28.8, గాజువాకలో 23.7, పరవాడలో 22.9 సెం.మీ. వర్షం పడింది. అడవివరంలో 31.9, న్యూ రైల్వే కాలనీలో 31.4, అప్పన్నపాలెం, ధారపాలెం ప్రాంతాల్లో 31.2 సెం.మీ. వర్షం పడింది. రైతుబజార్, కొత్తపాలెం, సింహాచలం ప్రాంతాల్లో 30 సెం.మీ. వర్షం పడింది. విశాఖ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 24.2, గంగవరంలో 22.4, నెల్లిమర్లలో 22.1, పూసపాటిరేగలో 20.7, సబ్బవరంలో 20.2 సెం.మీ. వర్షం పడింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 451 కేంద్రాల్లో 6సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. హుద్‌హుద్, తిత్లీ తర్వాత మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుపాను గులాబ్‌ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది.  ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అందులో 99 శాతం మంది విశాఖ జిల్లా నుంచే ఉన్నారు. వీరికోసం 105 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

62 మండలాలపై తీవ్ర ప్రభావం
వర్షాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 62 మండలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. విశాఖ జిల్లాలో 32, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 15 మండలాలు వర్షాల ధాటికి విలవిల్లాడాయి. వీటి పరిధిలో మొత్తం 375 గ్రామాల్లో ఎడతెగని వర్షాలు కురిసినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,800కు పైగా ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా విద్యుత్‌ శాఖ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది.  


విశాఖ విమానాశ్రయంలోకి నీరు
భారీ వర్షానికి తోడు, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు విశాఖ విమానాశ్రయంలోకి చేరింది. పాత, కొత్త టెర్మినళ్లలో మోకాలి లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఊపిరి పీల్చుకున్న తూర్పుగోదావరి
తూర్పు గోదావరి జిల్లాలో కుండపోత వర్షం పడినా పెద్దగా నష్టం కలిగించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కడియంలో 14 సెం.మీ, తాళ్లరేవులో 12.1, కరప, కాకినాడ అర్బన్, యు.కొత్తపల్లి, పెదపూడి, రాజమహేంద్రవరం రూరల్, ఆత్రేయపురం, అమలాపురాల్లో 10 సెం.మీ మించి వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలోని చావడికోట పంచాయతీ బొడ్లంక సమీపంలోని పెళ్లిరేవు వాగు ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో లలిత అనే మహిళను ప్రసవానికి తరలించాల్సి రావడంతో ఇబ్బందులెదురయ్యాయి. రహదారి ఇవతలి వైపు అంబులెన్స్‌ ఉంచి స్థానికులు ఆమెను స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. అవతల వైపు మరో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మారేడుమిల్లి పీహెచ్‌సీకి సకాలంలో తరలించారు.

‘పశ్చిమ’లో పొంగిన వాగులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెరిపిలేకుండా భారీవర్షాలు కురిశాయి. దెందులూరు–సానిగూడెం రహదారిలో సైఫన్‌ వద్ద గుండేరు వాగుకు గండి పడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దోసపాడు–కొవ్వలి గ్రామాల పరిధిలోని డ్రెయిన్లు పొంగాయి.  

కృష్ణాలో భారీ వర్షం
కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం, జిల్లాలోనూ రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలోని చిట్టినగర్‌ వద్ద కొండచరియలు విరిగి పడటంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. జిల్లాలో అత్యధికంగా రెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

తాడేపల్లిలో 33.25 సెం.మీ. వర్షపాతం
గుంటూరు జిల్లాలో సోమవారం వేకువజామునుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. డెల్టా ప్రాంతంలో లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం 8 నుంచి తాడేపల్లిలో 33.25 సెం.మీ, మంగళగిరిలో 29.75, పెదకూరపాడులో 28.75, తాడికొండలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

విజయనగరంలో సీఎస్‌ సమీక్ష
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో 40,876.7 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగావళి, సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి, గోముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టాలపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ కలెక్టరేట్‌లో సమీక్షించారు. గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను ఆయన పరిశీలించారు. మరోవైపు తుపాను పశ్చిమంగా ప్రయాణించి బలహీన పడింది. ఇది వాయవ్య దిశగా పయనించి మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది.  మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. 
విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న సువర్ణముఖి  

ఐదుగురి మృతి.. ఇద్దరు గల్లంతు
తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు ఐదుగురు మరణించారు. ఒక బాలుడి సహా ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన రైతు విజనగిరి శ్రీను నువ్వుల బుట్టలు తెచ్చుకునేందుకు పొలం వెళ్తూ గెడ్డలో పడిపోయాడు. గ్రామస్తులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. విశాఖ జిల్లా వేపగుంట నాయుడుతోట సమీపంలోని సీపీఐ కాలనీలో ఇంటిగోడ కూలడంతో దులసి భావన(31) మృతి చెందింది. కొండవాలు నుంచి వచ్చిన భారీ రాళ్లు ఇంటి ప్రహరీపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని చినముషిడివాడ సమీపంలోగల గిరిప్రసాద్‌నగర్‌–3లో కుశ్వంత్‌కుమార్‌ (7) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ విద్యుదాఘాతానికి గురై మరణించాడు.


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీ పేటకు చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్‌ కొత్తూరి నాగేశ్వరరావు(50) పొలం వెళుతూ పర్రెడ్డిగూడెం సమీపంలో వర్షపు నీటిలో కాలు జారి కొట్టుకుపోయారు. వర్షం తగ్గిన తర్వాత తూరలో ఇరుక్కున్న ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. గోపాలపురంలో ఇంటివద్ద నీట మునిగిన మోటర్‌ను ఆన్‌ చేస్తూ ముల్లంగి విజయభారతి (52) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా  సీతానగరానికి చెందిన కోరాడ కృష్ణవంశీరెడ్డి (16) స్నేహితులతో కలిసి చేపల కోసం వెళ్లి స్టీల్‌ప్లాంట్‌ రైల్వేగేటు సమీపంలో ఉన్న కాలువలో పడిపోయాడు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో ధర్మపురి వద్దనున్న గెడ్డలో చేపలు పట్టడానికి వెళ్లిన గేదెల రామారావు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. రాత్రి వరకు గాలించినా అతడి ఆచూకీ దొరకలేదు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట దిగువన ఉన్న మెట్టపైకి సోమవారం గొర్రెలను మేతకు తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్యన చిక్కుకున్నాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement