పురోగమనంలో యస్‌ బ్యాంకు | SBI Almost Had To Rescue Yes Bank On Its Own | Sakshi
Sakshi News home page

పురోగమనంలో యస్‌ బ్యాంకు

Published Thu, Oct 21 2021 6:21 AM | Last Updated on Thu, Oct 21 2021 6:21 AM

SBI Almost Had To Rescue Yes Bank On Its Own - Sakshi

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్‌బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్‌ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్‌బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్‌ ఉన్న విషయం గమనార్హం. యస్‌ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్‌ తాజాగా మాట్లాడారు. ‘‘యస్‌ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్‌బీఐ ఆదుకున్న సమయంలో యస్‌ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్‌ కుమార్‌ వివరించారు.

‘ద కస్టోడియన్‌ ఆఫ్‌ ట్రస్ట్‌’ పేరుతో రజనీష్‌కుమార్‌ తాను రచించిన పుస్తకంలోనూ యస్‌ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్‌ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్‌బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్‌బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్‌బీఐకి రాదనుకున్నాను. ఎస్‌బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్‌ సేత్‌ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్‌ తెలిపారు.  

ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది..  
‘‘యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్‌బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్‌ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్‌ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్‌బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు.

ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్‌ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్‌ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్‌ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్‌ బ్యాంకు ఘోష్‌కు కాల్‌ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్‌బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement