బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ (Rajnish Kumar) ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా (Mastercard India) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్ కార్డ్ ఇండియా తాజాగా ప్రకటించింది.
కంపెనీలో ఆయన అత్యంత కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలందిస్తారని మాస్టర్ కార్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మాస్టర్ కార్డ్ దక్షిణాసియా , కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్, ఇండియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని సౌత్ ఆసియా ఎగ్జిక్యూటివ్ నాయకత్వ బృందానికి రజనీష్ కుమార్ మార్గనిర్దేశం చేస్తారు. మాస్టర్ కార్డ్ 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రజనీష్ కుమార్‌కు ఎస్‌బీఐలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. భారత్‌తోపాటు యూకే, కెనడా దేశాల్లో బ్యాంక్ కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. తన హయాంలో బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ‘యోనో’ను తీసుకొచ్చి విస్తృత ప్రచారం కల్పించారు. ఎస్‌బీఐ చైర్మన్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని 2020 అక్టోబర్‌లో ముగించారు.
కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్‌లో విశేష నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్, ఎల్‌అండ్‌టీ, బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వంటి కార్పొరేట్ దిగ్గజాల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు. భారత్‌పే బోర్డుకు, గుర్గావ్‌లోని ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఎండీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్‌లకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment