Mastercard
-
కార్డుల ద్వారా ఆ పేమెంట్లు వద్దు.. ఆర్బీఐ షాకింగ్ ఆదేశాలు
కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) పేమెంట్ టెక్నాలజీ సంస్థలైన మాస్టర్ కార్డ్ ( Mastercard ), వీసా ( Visa ) లను కోరింది. ఫిబ్రవరి 8న జారీ చేసిన లేఖ ప్రకారం.. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ( BPSP ) లావాదేవీలను నిలిపివేయాలని ఈ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. వాణిజ్య, వ్యాపార చెల్లింపులలో బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై పరిశ్రమ నుంచి సమాచారం కోరుతూ ఫిబ్రవరి 8న ఆర్బీఐ నుంచి ఒక కమ్యూనికేషన్ అందినట్లు వీసా ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. అన్ని బీపీఎస్పీ లావాదేవీలను నిలిపివేయాలన్న ఆదేశాలు ఆర్బీఐ నుంచి వచ్చిన ఆ కమ్యూనికేషన్లో ఉన్నట్లు వీసా పేర్కొంది. పీఏ పీజీ (పేమెంట్ అగ్రిగేటర్/పేమెంట్ గేట్‌వే) మార్గదర్శకాల ప్రకారం బీపీఎస్పీలు ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయని, వాటికి సెంట్రల్ బ్యాంకే లైసెన్సులు జారీ చేస్తుందని వీసా తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐతోపాటు వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తున్నట్లు కార్డ్ పేమెంట్ సంస్థ పేర్కొంది. కాగా కార్పొరేట్ కార్డ్-టు-బిజినెస్ అకౌంట్ నగదు బదిలీ లావాదేవీల విషయంలో అనుసరించాల్సిన వ్యాపార నమూనాకు సంబంధించి కొంతమంది బ్యాంకర్లతో సహా మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు ఫిబ్రవరి 14న ఆర్బీఐని సంప్రదించి స్పష్టత ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. కంపెనీలు సాధారణంగా నెట్ బ్యాంకింగ్ లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. కానీ ఎన్కాష్, కార్బన్, పేమేట్ వంటి కొన్ని ఫిన్‌టెక్‌లు మాత్రం సప్లయర్స్, వెండర్లకు కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నాయి. అటువంటి చెల్లింపుల మొత్తం నెలవారీ లావాదేవీ పరిమాణం రూ. 20,000 కోట్లకు మించి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాల విషయమై ఎన్కాష్, మాస్టర్‌కార్డ్ సంస్థలు స్పందించలేదు. సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేమేట్ వెల్లడించింది. ఈ చర్యలకు గల కారణాన్ని ఆర్బీఐ వెల్లడించనప్పటికీ, నాన్ కేవైసీ వ్యాపారులకు కార్డుల ద్వారా అధిక మొత్తంలో నగదు ప్రవాహం కేంద్ర బ్యాంక్‌కు చికాకు కలిగించి ఉండొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. -
ఎస్బీఐ మాజీ చైర్మన్‌కు అంతర్జాతీయ సంస్థలో కీలక పదవి
బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ (Rajnish Kumar) ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా (Mastercard India) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్ కార్డ్ ఇండియా తాజాగా ప్రకటించింది. కంపెనీలో ఆయన అత్యంత కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలందిస్తారని మాస్టర్ కార్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మాస్టర్ కార్డ్ దక్షిణాసియా , కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్, ఇండియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని సౌత్ ఆసియా ఎగ్జిక్యూటివ్ నాయకత్వ బృందానికి రజనీష్ కుమార్ మార్గనిర్దేశం చేస్తారు. మాస్టర్ కార్డ్ 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రజనీష్ కుమార్‌కు ఎస్బీఐలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. భారత్‌తోపాటు యూకే, కెనడా దేశాల్లో బ్యాంక్ కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. తన హయాంలో బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ‘యోనో’ను తీసుకొచ్చి విస్తృత ప్రచారం కల్పించారు. ఎస్బీఐ చైర్మన్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని 2020 అక్టోబర్‌లో ముగించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్‌లో విశేష నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ హెచ్ఎస్బీసీ ఆసియా పసిఫిక్, ఎల్అండ్టీ, బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ దిగ్గజాల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు. భారత్‌పే బోర్డుకు, గుర్గావ్లోని ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎండీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
నచ్చినప్పుడు నచ్చినంతసేపే పని
ఇష్టమున్నప్పుడే పని చేసే అవకాశం ఉంటే! తోచిన పనిని మాత్రమే చేసే ఆస్కారం ఉంటే! ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పనిచేయాలో నిర్ణయించుకొనే అధికారం మన చేతుల్లోనే ఉంటే! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ ఆలోచనా ధోరణి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇలా నచ్చిన సమయాల్లో నచ్చిన పనిచేసే వారి సంఖ్య రాకెట్ వేగంతో పెరుగుతోంది. తమ సమయానుకూలతను బట్టి పనిచేసే వారిని ముద్దుగా ’గిగ్ వర్కర్స్’ పిలుస్తున్నారు. అవసరం, అవకాశం మేరకు యజమాని, ఉద్యోగి స్వల్పకాలిక ఒప్పందం మేరకు చేసే పనుల ద్వారా సమకూరే ఆదాయాన్ని గిగ్ ఎకానమీగా పిలుస్తున్నారు. దీని పరిమాణమెంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది గిగ్ ఉద్యోగులున్నట్లు అంచనా. ఇక గిగ్ ఆర్థికవ్యవస్థ విలువ ఈ ఏడాది అక్కరాలా లక్షన్నర కోట్ల డాలర్లని మాస్టర్‌కార్డ్ అంచనా. ఇది 2025 కల్లా 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. మారిన కాలం.. అందివచ్చిన అవకాశం టెక్నాలజీలో మార్పులు, స్మార్ట్ఫోన్లు ఈ గిగ్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడుతున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లపైనే నడుస్తోంది. పయనీర్స్ నివేదిక ప్రకారం 70 శాతం గిగ్ వర్కర్లు గిగ్ వెబ్సైట్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో అతి పెద్ద గిగ్ వెబ్సైట్ ’ఆఫ్వర్క్’కు 1.5 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. 53 శాతం యువత స్మార్ట్ఫోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు వెతుక్కుంది. వృత్తి నిపుణులు ఫేస్బుక్ ప్రచారం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో... అమెరికాలో 5.7 కోట్ల గిగ్ వర్కర్లున్నారు. 2027 కల్లా 8.6 కోట్లకు చేరతారని అసోసియేషన్ ఫర్ ఎంటర్ప్రైజ్ అపర్చునిటీస్ నివేదిక పేర్కొంది. ► రెగ్యులర్ ఉద్యోగుల కంటే గిగ్ వర్కర్లు మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నట్టు అంచనా. ► గిగ్‌వర్కర్ల ద్వారా 2020లో దేశ ఆర్థిక వ్యవస్థకు 1.21 లక్షల కోట్ల డాలర్లు సమకూరాయి. ► స్వతంత్ర ఉద్యోగులు అమెరికాలో వారానికి 107 కోట్ల పని గంటలు పనిచేస్తున్నారు. ► ఫ్రీలాన్స్ వర్కర్లలో 51 శాతం ఎంత వేతనమిచ్చినా రెగ్యులర్ జాబ్‌కు నో అంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీరు 78 శాతం ఎక్కువ సంతోషంగా ఉన్నారని ‘ఆఫ్వర్క్’ పేర్కొంది. ► 80 శాతం అమెరికా కంపెనీలు గిగ్ వర్కర్ల ద్వారా వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు మార్చుకుంటున్నాయి. మన దేశంలో ఎలా? బలమైన గిగ్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. కరోనాతో దెబ్బతిన్న గిగ్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ► భారత్‌లో 1.5 కోట్ల మంది గిగ్ వర్కర్లున్నారు. ► మన గిగ్ ఆర్థిక వ్యవస్థకు 9 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు సమానమైన ఉపాధి కల్పించే సామర్థ్యముందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. ► 2025 నాటికి దేశంలో గిగ్ వ్యాపారం 3,000 కోట్ల డాలర్లకు, అంటే రూ.2.3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఏమిటీ గిగ్ వర్కింగ్..? ఓ కంపెనీలో నిర్ధిష్ట పనివేళల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు కాకుండా అవసరం మేరకు తాత్కాలిక పనులు చేస్తూ ఆదాయం పొందుతున్న ఫ్రీలాన్సర్లుగా గిగ్ వర్కర్లను చెప్పవచ్చు. ఆ లెక్కన స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ తెచ్చిచ్చే డెలివరీ బాయ్, ఓలా, ఉబర్ డ్రైవర్ గిగ్ వర్కర్లే. వెబ్ డిజైనర్లు మొదలు ప్రోగ్రామర్ల దాకా వందల వృత్తులవారు ఇలా పని చేస్తూ సరిపడా ఆదాయం పొందుతున్నారు. అమెరికాలోనైతే గిగ్ వర్కర్లు అత్యధిక ఆదాయం పొందుతున్నారు. కొందరు ఏటా లక్ష డాలర్లకుపైగా సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సగటు సంపాదన గంటకు 21 డాలర్లు! వీరిలో 53 శాతం 18–29 ఏళ్ల వారేనని ఓ సర్వేలో తేలింది. – సాక్షి,నేషనల్ డెస్క్ -
క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ వార్త..!
మీరు క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..అయితే మీకో షాకింగ్ వార్త..! త్వరలోనే ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు సామాన్యులకు షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్రెడిట్‌కార్డుల వాడకం మునుపటి కంటే ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. ఫీజులు పెంచేందుకు సిద్దం..! ప్రముఖ క్రెడిట్ కార్డు సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులపై ప్రాసెసింగ్ ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం...గత రెండేళ్లలో క్రెడిట్‌కార్డు వాడకంపై ఫీజుల పెంపు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే, వచ్చే నెల నుంచి ఈ రెండు కంపెనీలు క్రెడిట్ కార్డ్ ఫీజులను పెంచబోతున్నాయి. క్రెడిట్‌కార్డు ఇంటర్చేంజ్ ఫీజులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు కార్డ్ నెట్వర్క్ ద్వారా నిర్ణయించబడే ఛార్జీలను వ్యాపారులు చెల్లిస్తారు. కార్డు జారీ చేసిన బ్యాంకుకు ఈ రుసుము చెల్లించబడుతుంది. దీంతో సదరు వ్యాపారస్తులు క్రెడిట్ కార్డు యూజర్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజలును మోపే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. పలు బ్యాంకులు క్రెడిట్‌కార్డుల వాడకంపై అనేక రివార్డు పాయింట్లను ప్రకటిస్తూ వచ్చాయి. దీంతో ఇటీవలి కాలంలో క్రెడిట్‌కార్డులు భారీగా ప్రజాదరణను పొందాయి. క్రెడిట్ కార్డుల ఇంటర్‌ఛేంజ్ ఫీజులపెంపుతో సాధారణ రిటైల్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపుతో మాస్టర్ కార్డ్ సుమారు 330 మిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం రానుంది. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన ఆర్బీఐ..! -
గట్టి కంపెనీలుగా గూగుల్, టెస్లా
IMD Research On Future Readiness Companies: భవిష్యత్‌లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలతో సన్నద్ధంగా ఉన్న కంపెనీల జాబితాలో టెస్లా, లులులెమన్, మాస్టర్‌కార్డ్, గూగుల్ అగ్రస్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) రూపొందించిన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఫ్యాషన్..రిటైల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ అనే నాలుగు రంగాల్లో అ త్యధికంగా ఆదాయాలు ఆర్జిస్తున్న 86 లిస్టెడ్ కంపెనీలను వాటి పోటీ కంపెనీలతో పోల్చి, భవిష్యత్‌ను ఎదుర్కొనేందుకు అవి ఎంత సంసి ద్ధంగా ఉన్నాయి, వాటి నిలదొక్కుకునే సామర్థ్యా లేమిటి తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం దశాబ్ద కాలం (2010–2021) పైగా డేటాను పరిశీలించారు. ఈ జాబితాలో 40 అమెరికన్ కంపెనీలు, చైనా.. జర్మనీ నుంచి చెరి ఏడు, ఫ్రాన్స్.. జపాన్ నుంచి చెరి ఆరు కంపెనీలకు చోటు దక్కింది. నివేదిక ప్ర కారం ఫ్యాషన్.. రిటైల్‌లో లులులెమన్, నైకీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్ సెగ్మెంట్లో టెస్లా, టయోటా టాప్ 2 స్థానాల్లో నిల్చా యి. ఆర్థిక సేవల విభాగంలో మాస్టర్‌కార్డ్, వీసా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. టెక్నాలజీ లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ టాప్ 3లో నిలిచినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. భారత్ కంపెనీలు ఎందుకు లేవంటే.. ఐఎండీ లిస్టులో భారత కంపెనీలేవీ చోటు దక్కించుకోలేకపోయాయి. ఇందుకు భారత్‌లో మౌలిక సదుపాయాలపరమైన సమస్యలే కారణమని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్ హోవార్డ్ యు తెలిపారు. ‘ఆటోమోటివ్ రంగంలోని టాప్ కంపెనీల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేవు. అలాగని టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలు కొత్తవి ఆవిష్కరించలేవని కాదు. అవి చేయగలవు. కానీ రేపటితరం స్మార్ట్ వాహనాలన్నీ నగరంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానించే సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు పుంజుకోవాలన్నా సూపర్‌చార్జర్ల విస్తృత నెట్వర్క్ అవసరమవుతుంది. చైనాలోని ఎన్ఐవో, బీవైడీ వంటి ఆటోమోటివ్ సంస్థలు తమ సొంత నెట్‌వర్క్‌తో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వల్ల కూడా ప్రయోజనం పొందుతుంటాయి. ప్రభుత్వ స్థాయిలో మద్దతు లేకుండా ఎన్ఐవో సొంతంగా బ్యాటరీ మార్పిడి స్టేషన్లను అభివృద్ధి చేయడం అసాధ్యం. కాబట్టి భారత్‌లోనూ అదే తరహాలో మౌలిక సదుపాయాల కల్పనల సమస్యల పరిష్కారంపై రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలి‘ అని హొవార్డ్ పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారత్‌కి ఇంకా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే, యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్యాపరంగా భారత్, ఈ ఏడాది చైనాను అధిగమించిందని హొవార్డ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఓలా వంటి వంటివి దేశీ స్టార్టప్ వ్యవస్థలో పెను సంచలనాలు సృష్టించాయని పేర్కొన్నారు. చదవండి: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్ -
నేటి నుంచి ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల జారీ బంద్..!
ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్ నేటి నుంచి కొత్త డెబిట్/క్రెడిట్ కార్డులను జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్‌కార్డ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్బీఐ పేర్కొంది. మాస్టర్‌కార్డ్ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్ కార్డ్ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌గా మాస్టర్‌కార్డ్ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్ విషయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ భారత్‌లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్‌కార్డు డెబిట్/ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. -
మాస్టర్ కార్డ్‌కు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేడు మాస్టర్ కార్డ్‌కు భారీ షాక్ ఇచ్చింది. కొత్త దేశీయ డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ ఖాతాదారులను మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లోకి ఆన్ బోర్డింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్స్ డేటా నిల్వకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మాస్టర్ కార్డ్‌పై ఈ చర్య తీసుకుంది. కొత్త మాస్టర్ కార్డ్ కార్డులను జారీ చేయకుండా నిషేధం అనేది జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది. "తగినంత సమయం, ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికి వినియోగదారుల పేమెంట్స్ డేటా నిల్వ విషయంలో ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదని" సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిబందన వల్ల ఇప్పటికే మాస్టర్ కార్డ్ ఉన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదు. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న మాస్టర్ కార్డ్‌కు ఆర్బీఐ ఆదేశించింది. అప్పటి నుంచి డేటా నిల్వ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 17 కింద చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మాస్టర్ కార్డ్‌కు పీఎస్ఎస్ చట్టం కింద దేశంలో కార్డు నెట్ వర్క్ ఆపరేట్ చేయడానికి అధికారం ఇచ్చారు. గతంలో డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజమాన్యంలోని అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్డులపైనా ఆర్బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది. -
ఇక వేలిముద్రే మన సీక్రెట్ పిన్!
వాషింగ్టన్: ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఈ విషయం అందరికి తెలిసిందే. అందుకే వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తే ఎటువంటి అక్రమాలకు తావుండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం పిన్ నంబర్‌తో లావాదేవీలు నిర్వహించే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. పిన్ ఎవరికైనా తెలిస్తే ఇక అంతే సంగతి. ఇటువంటి సమస్యలకు వేలిముద్రలే పరిష్కారమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే వేలిముద్రలతో పనిచేసే బయోమెట్రిక్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. ఈ బయోమెట్రిక్ కార్డులో ఉండే చిప్‌లో వేలిముద్రల డేటాని పొందుపరుస్తామని, ఎక్కడైనా కొనుగోలు జరిపినప్పుడు ఆ కార్డుని స్వైప్ చేసి పిన్‌కి బదులుగా మన వేలిముద్ర వేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చని మాస్టర్ కార్డ్ కంపెనీ గురువారం వెల్లడించింది. ఈ టెక్నాలజీని ఈ మధ్యనే దక్షిణాఫ్రికాలో పరీక్షించారు. విజయవంతం కావడంతోపాటు అక్కడి వినియోగదారులు కూడా ఎంతో సురక్షితమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కంపెనీ అధ్యక్షుడు అజయ్ బళ్ళా తెలిపారు. ఈ కార్డులకు నకిలీలను ఎవరూ తయారు చేయలేరు కాబట్టి మన లావాదేవీలు మరింత సురక్షితంగా జరుగుతాయని, కేవలం బ్యాంకులో ఒకసారి రిజస్టర్ చేసుకుంటే చాలని చెబుతున్నారు. తద్వారా బ్యాంకు నిర్వాహకులు వేలిముద్రల డాటాను కార్డులో పొందుపర్చి, కార్డును జారీ చేస్తారు. అంతేకాక బ్యాంకులు డిజిటల్ టెంప్లెట్‌ని తయారు చేస్తాయి. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ కార్డులు చిప్‌లు కలిగి ఉన్న కార్డుల్లానే పనిచేస్తాయి. దీని వల్ల నిజమైన కార్డు యజమానే దానిని వినియెగించడానికి వీలుంటుంది. అంతేగాక దీని కోసం కొత్త సాప్ట్వేర్, హార్డ్‌వేర్ ఏదీ అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈఎమ్వీలోనే ఇది పనిచేస్తుంది. మరిన్ని సదుపాయాలను ఇందులో పొందుపర్చి, త్వరలోనే వీటిని విడుదల చేస్తామని మాస్టర్ కార్డు కంపెనీ ప్రకటించింది. ముందుగా యూరప్, ఫసిపిక్ ఆసియాలలో వీటిని పరీక్షించనున్నారు. -
మాస్టర్ కార్డ్ కు భారీ షాక్
లండన్ : బ్రిటన్ లో దాదాపు 46 మిలియన్ల పౌరులకు డెబిట్, క్రెడిట్ సేవలు అందిస్తున్న మాస్టర్ కార్డ్ సంస్థకు ఊహించని పరిణామం ఎదురైంది. గత 16 సంవత్సరాలుగా వినియోగదారులనుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై లండన్ లోని కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. బ్రిటన్‌కు చెందిన న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయేల్ ఈ దావా వేసింది. ఖాతాదారులకు అందించే సేవలపై అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ, దాదాపు రూ.1.30 లక్షల కోట్లు (19 బిలియన్ డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ తాజా వివాదంతో మాస్టార్ కార్డ్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. 1992-2007 మధ్య వినియోగదారులనుంచి చట్టవిరుద్ధమైన అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ దాదాపు 600 పేజీల డాక్యుమెంట్ ను కాంపిటీషన్ అప్పీల్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. పెరిగిన రుసుముల భారాన్ని కూడా అంతిమంగా వినియోగదారులపైనే వేసినట్టు ఆరోపిస్తూ క్విన్ ఇమాన్యుయేల్‌కు చెందిన న్యాయవాది, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ స్వతంత్ర న్యాయాధికారి వాల్టర్ మెరిక్స్ బీబీసీ కి తెలిపారు. దుకాణాదారులు యూజర్ల డెబిట్, క్రెబిట్ కార్డులు స్వైప్ చేసినపుడు చట్ట విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది బ్రిటన్ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న ఒక అదృశ్యమైన పన్ను లాంటిదని వ్యాఖ్యానించారు .అయితే ఈ వాదనలను మాస్టర్ కార్డ్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. మరోవైపు బ్రిటన్ చరిత్రలో మాస్టర్‌కార్డ్‌పై ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద దావా అని విశ్లేషకులు చెబుతున్నారు. -
సెల్ఫీతో నగదు చెల్లింపు..!
♦ మాస్టర్ కార్డ్ పేమెంట్ ప్రాజెక్టు ♦ మరింత నూతనంగా లావాదేవీ ప్రక్రియ ♦ కంపెనీ గ్రూప్ హెడ్ రవీందర్ అరోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జేబు నిండా నగదు, పర్సులో డెబిట్/క్రెడిట్ కార్డులు.. వీటి అవసరం లేకుండా జస్ట్ సెల్ఫీతో నగదు చెల్లిస్తే? అంతకంటేనా అంటూ క్లిక్‌మనిపించరూ..!! క్రెడిట్ కార్డ్స్, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల రంగంలో ఉన్న మాస్టర్ కార్డ్ ఇప్పుడు ఇదే పని చేయబోతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన ఈ సంస్థ... త్వరలో ఈ సౌకర్యాన్ని భారత్‌కూ పరిచయం చేయబోతోంది. అలాగే నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్, ఫిట్నెస్ బ్యాండ్ ద్వారా చెల్లింపులు చేయటం కూడా కార్యరూపం దాల్చనున్నట్లు మాస్టర్‌కార్డ్ గ్రూప్ హెడ్, గ్లోబల్ పాలసీ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ ఎస్ అరోరా చెప్పారు. గురువారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడుతూ... పిన్‌కు బదులు వేలి ముద్ర, కంటిపాపతో (ఐరిష్) కూడా లావాదేవీలు పూర్తయ్యేలా టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పుణేలోని తమ గ్లోబ ల్ టెక్నాలజీ సెంటర్... వివిధ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు తెలియజేశారు. సౌలభ్యం కోరుకుంటున్నారు.. ‘‘వచ్చే 15 ఏళ్లలో పట్టణ జనాభా ప్రస్తుతమున్న 32 నుంచి 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్ఫోన్ల వాడకం గణనీయంగా పెరుగుతోంది. చెల్లింపుల విషయంలో కస్టమర్లు సౌలభ్యం కోరుకుంటున్నారు. కరెన్సీ ముద్రణ, పంపిణీకి ఏటా ప్రభుత్వంపై రూ.22,000 కోట్ల భారం పడుతోంది. దీన్ని తగ్గించడానికి నగదు లావాదేవీలకు బదులు ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రానిక్ విధానం చాలా సురక్షితం కూడా. తస్కరణకు అవకాశం లేదు. దీనికోసం సీఐఐ ట్రేడర్స్‌తో మాస్టర్ కార్డ్ చేతులు కలిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల ప్రయోజనాల్ని ఈ ఏడాది 50 లక్షల మందికిపైగా వర్తకులకు వివరించాలన్నది లక్ష్యం’’ అని రవీందర్ అరోరా వివరించారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు 3.6 శాతమే.. దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా వర్తకులు 5.8 కోట్ల మంది ఉన్నా... 13 లక్షల మంది వర్తకుల వద్దే ఎలక్ట్రానిక్ లావాదేవీల ఏర్పాట్లున్నాయని అరోరా తెలియజేశారు. సగం మంది వర్తకులకు మాత్రమే కార్డులు ఎలా పనిచేస్తాయో తెలుసన్నారు. ‘‘దేశంలో వ్యక్తిగత వినియోగానికి జరిగే చెల్లింపుల్లో డెబిట్, క్రెడిట్ కార్డు, మొబైల్ వాలెట్, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న లావాదేవీలు 3.6 శాతం మాత్రమే. ప్రజల వద్ద 70 కోట్ల డెబిట్ కార్డులు, 2.1 కోట్ల క్రెడిట్ కార్డులున్నాయి. 10 కోట్ల మంది తమ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ వాలెట్‌ను వాడుతున్నారు. దేశంలో ఈ-టెయిలింగ్ పరిమాణం రూ.42,000 కోట్లు. 2021 నాటికి ఇది 10 రెట్లు పెరుగుతుందని అంచనా’’ అని అరోరా వివరించారు. అందుకే ఎలక్ట్రానిక్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. దేశంలో ఎలక్ట్రానిక్ మోసాలు 0.06 శాతంగా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.