
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నేడు మాస్టర్ కార్డ్‌కు భారీ షాక్ ఇచ్చింది. కొత్త దేశీయ డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ ఖాతాదారులను మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లోకి ఆన్ బోర్డింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్స్ డేటా నిల్వకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మాస్టర్ కార్డ్‌పై ఈ చర్య తీసుకుంది. కొత్త మాస్టర్ కార్డ్ కార్డులను జారీ చేయకుండా నిషేధం అనేది జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది. "తగినంత సమయం, ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికి వినియోగదారుల పేమెంట్స్ డేటా నిల్వ విషయంలో ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదని" సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నిబందన వల్ల ఇప్పటికే మాస్టర్ కార్డ్ ఉన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదు. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న మాస్టర్ కార్డ్‌కు ఆర్‌బీఐ ఆదేశించింది. అప్పటి నుంచి డేటా నిల్వ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 17 కింద చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మాస్టర్ కార్డ్‌కు పీఎస్ఎస్ చట్టం కింద దేశంలో కార్డు నెట్ వర్క్ ఆపరేట్ చేయడానికి అధికారం ఇచ్చారు. గతంలో డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజమాన్యంలోని అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment