కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) పేమెంట్ టెక్నాలజీ సంస్థలైన మాస్టర్ కార్డ్ ( Mastercard ), వీసా ( Visa ) లను కోరింది. ఫిబ్రవరి 8న జారీ చేసిన లేఖ ప్రకారం.. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ( BPSP ) లావాదేవీలను నిలిపివేయాలని ఈ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది.
వాణిజ్య, వ్యాపార చెల్లింపులలో బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై పరిశ్రమ నుంచి సమాచారం కోరుతూ ఫిబ్రవరి 8న ఆర్బీఐ నుంచి ఒక కమ్యూనికేషన్ అందినట్లు వీసా ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. అన్ని బీపీఎస్‌పీ లావాదేవీలను నిలిపివేయాలన్న ఆదేశాలు ఆర్బీఐ నుంచి వచ్చిన ఆ కమ్యూనికేషన్‌లో ఉన్నట్లు వీసా పేర్కొంది. పీఏ పీజీ (పేమెంట్ అగ్రిగేటర్/పేమెంట్ గేట్‌వే) మార్గదర్శకాల ప్రకారం బీపీఎస్‌పీలు ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయని, వాటికి సెంట్రల్ బ్యాంకే లైసెన్సులు జారీ చేస్తుందని వీసా తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐతోపాటు వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తున్నట్లు కార్డ్ పేమెంట్ సంస్థ పేర్కొంది.
కాగా కార్పొరేట్ కార్డ్-టు-బిజినెస్ అకౌంట్ నగదు బదిలీ లావాదేవీల విషయంలో అనుసరించాల్సిన వ్యాపార నమూనాకు సంబంధించి కొంతమంది బ్యాంకర్లతో సహా మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు ఫిబ్రవరి 14న ఆర్బీఐని సంప్రదించి స్పష్టత ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి.
కంపెనీలు సాధారణంగా నెట్ బ్యాంకింగ్ లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. కానీ ఎన్‌కాష్, కార్బన్, పేమేట్ వంటి కొన్ని ఫిన్‌టెక్‌లు మాత్రం సప్లయర్స్, వెండర్లకు కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నాయి. అటువంటి చెల్లింపుల మొత్తం నెలవారీ లావాదేవీ పరిమాణం రూ. 20,000 కోట్లకు మించి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్బీఐ ఆదేశాల విషయమై ఎన్‌కాష్, మాస్టర్‌కార్డ్ సంస్థలు స్పందించలేదు. సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేమేట్ వెల్లడించింది. ఈ చర్యలకు గల కారణాన్ని ఆర్బీఐ వెల్లడించనప్పటికీ, నాన్ కేవైసీ వ్యాపారులకు కార్డుల ద్వారా అధిక మొత్తంలో నగదు ప్రవాహం కేంద్ర బ్యాంక్‌కు చికాకు కలిగించి ఉండొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment