సెల్ఫీతో నగదు చెల్లింపు..!
♦ మాస్టర్ కార్డ్ పేమెంట్ ప్రాజెక్టు
♦ మరింత నూతనంగా లావాదేవీ ప్రక్రియ
♦ కంపెనీ గ్రూప్ హెడ్ రవీందర్ అరోరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జేబు నిండా నగదు, పర్సులో డెబిట్/క్రెడిట్ కార్డులు.. వీటి అవసరం లేకుండా జస్ట్ సెల్ఫీతో నగదు చెల్లిస్తే? అంతకంటేనా అంటూ క్లిక్‌మనిపించరూ..!! క్రెడిట్ కార్డ్స్, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల రంగంలో ఉన్న మాస్టర్ కార్డ్ ఇప్పుడు ఇదే పని చేయబోతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన ఈ సంస్థ... త్వరలో ఈ సౌకర్యాన్ని భారత్‌కూ పరిచయం చేయబోతోంది. అలాగే నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్ ద్వారా చెల్లింపులు చేయటం కూడా కార్యరూపం దాల్చనున్నట్లు మాస్టర్‌కార్డ్ గ్రూప్ హెడ్, గ్లోబల్ పాలసీ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ ఎస్ అరోరా చెప్పారు. గురువారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడుతూ... పిన్‌కు బదులు వేలి ముద్ర, కంటిపాపతో (ఐరిష్) కూడా లావాదేవీలు పూర్తయ్యేలా టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పుణేలోని తమ గ్లోబ ల్ టెక్నాలజీ సెంటర్... వివిధ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు తెలియజేశారు.
సౌలభ్యం కోరుకుంటున్నారు..
‘‘వచ్చే 15 ఏళ్లలో పట్టణ జనాభా ప్రస్తుతమున్న 32 నుంచి 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం గణనీయంగా పెరుగుతోంది. చెల్లింపుల విషయంలో కస్టమర్లు సౌలభ్యం కోరుకుంటున్నారు. కరెన్సీ ముద్రణ, పంపిణీకి ఏటా ప్రభుత్వంపై రూ.22,000 కోట్ల భారం పడుతోంది. దీన్ని తగ్గించడానికి నగదు లావాదేవీలకు బదులు ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రానిక్ విధానం చాలా సురక్షితం కూడా. తస్కరణకు అవకాశం లేదు. దీనికోసం సీఐఐ ట్రేడర్స్‌తో మాస్టర్ కార్డ్ చేతులు కలిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల ప్రయోజనాల్ని ఈ ఏడాది 50 లక్షల మందికిపైగా వర్తకులకు వివరించాలన్నది లక్ష్యం’’ అని రవీందర్ అరోరా వివరించారు.
ఎలక్ట్రానిక్ చెల్లింపులు 3.6 శాతమే..
దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా వర్తకులు 5.8 కోట్ల మంది ఉన్నా... 13 లక్షల మంది వర్తకుల వద్దే ఎలక్ట్రానిక్ లావాదేవీల ఏర్పాట్లున్నాయని అరోరా తెలియజేశారు. సగం మంది వర్తకులకు మాత్రమే కార్డులు ఎలా పనిచేస్తాయో తెలుసన్నారు. ‘‘దేశంలో వ్యక్తిగత వినియోగానికి జరిగే చెల్లింపుల్లో డెబిట్, క్రెడిట్ కార్డు, మొబైల్ వాలెట్, ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న లావాదేవీలు 3.6 శాతం మాత్రమే. ప్రజల వద్ద 70 కోట్ల డెబిట్ కార్డులు, 2.1 కోట్ల క్రెడిట్ కార్డులున్నాయి. 10 కోట్ల మంది తమ స్మార్ట్‌ఫోన్లో డిజిటల్ వాలెట్‌ను వాడుతున్నారు. దేశంలో ఈ-టెయిలింగ్ పరిమాణం రూ.42,000 కోట్లు. 2021 నాటికి ఇది 10 రెట్లు పెరుగుతుందని అంచనా’’ అని అరోరా వివరించారు. అందుకే ఎలక్ట్రానిక్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. దేశంలో ఎలక్ట్రానిక్ మోసాలు 0.06 శాతంగా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.