సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులకు కటకట ఏర్పడింది. పలు రకాల బిల్లుల చెల్లింపునకు జాప్యం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఖజానా శాఖలో బిల్లులు ఆమోదం కాకపోవడంతో పలువురు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బిల్లులు సమర్పించిన వివిధ శాఖలు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు రావాల్సిన ఇతరులు కూడా ట్రెజరీకి వచ్చి వెళ్తున్నారు. జిల్లాలోని 5 ట్రెజరీల పరిధిలో సుమారు రూ.7కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తున్నారని, అత్యవసర సేవలకు అధికారులు ముందస్తు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లిలో సబ్ ట్రెజరీలతోపాటు వైరాలో డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ఉంది. వీటి ద్వారా అటు ఉద్యోగులతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన బిల్లులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంటే మంజూరు చేస్తారు. సహజంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు, ఇతరులు తమకు రావాల్సిన నగదుకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో అందిస్తే.. నాలుగైదు రోజుల్లో ఆ బిల్లులకు సంబంధించిన నగదును చెల్లిస్తారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పలు బిల్లులు ట్రెజరీ కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 20 రోజులుగా పలు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సంబంధిత ఉద్యోగులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.7కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే..
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవులు, వాహనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో ట్రాక్టర్లకు సంబంధించి సబ్సిడీలు సుమారు రూ.5కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13వేల మంది ఉద్యోగులు ఉండగా.. పెన్షనర్లు 6వేల మంది వరకు ఉన్నారు. వీరికి సంబంధించిన పలు బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.
సర్వర్ బిజీ అంటూ..
బిల్లులు రావాల్సిన పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ప్రతిరోజు ట్రెజరీకి వచ్చి తమ బిల్లుల పరిస్థితి ఏమిటంటూ ఆరా తీస్తుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఆయా బిల్లుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వర్ బిజీ బిజీ అంటూ వస్తోంది. దీంతో ట్రెజరీ పనులన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరోసారి పాస్ అయిన బిల్లులకు కూడా సకాలంలో నగదు పడడం లేదు. అయితే ఆర్థిక శాఖ వద్ద అవసరానికి తగినన్ని నిధులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నింటికీ నగదు మంజూరు చేసే వెసులుబాటు లేకపోవడం కారణంగానే బిల్లులు పాస్ కావడం లేదని సమాచారం.
అత్యవసర సేవలకే ప్రాధాన్యం..
అత్యవసరమైన బిల్లులకు మాత్రమే త్వరగా నిధులు మంజూరవుతున్నాయి. హాస్టల్ బిల్లులు, మధ్యాహ్న భోజనం, పెన్షన్లు వంటి వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. వాటిని వెనువెంటనే పరిష్కరిస్తున్నారు. వీటికి నిధులు విడుదల చేసే సమయంలో మిగిలిన అంశాలకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే బిల్లులు అత్యవసరంగా విడుదల కావాల్సిన పరిస్థితులు ఉంటే ట్రెజరీ శాఖ అధికారులు.. ఉన్నతాధికారులను సందర్శించి.. స్థానిక సమస్యలను విన్నవించి వారి బిల్లులను పాస్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
సమస్యలు పరిష్కరిస్తున్నాం..
పెండింగ్ బిల్లుల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నాం. ఒక్కోసారి ఆన్‌లైన్ సమస్య వచ్చినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు ఇచ్చిన సూచనల మేరకు బిల్లులను త్వరితగతిన అందేలా చూస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఖజానా శాఖ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment