
ఐక్యరాజ్యసమితి: ప్రపంచశాంతి పరిరక్షణకు ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అమెరికా, సౌదీ, ఈజిప్ట్, ఇజ్రాయెల్ సహా 81 దేశాలు తమ నిధుల వాటాను చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సభ్య దేశాలన్నీ తమ వాటా నగదును చెల్లించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి నగదు కొరత ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు.
ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే ఐరాసలో నగదు నిల్వలు ఖాళీ అయిపోతాయి’ అని సభ్యదేశాలకు లేఖ రాశారు. ఈ ఏడాది జూలై 26 నాటికి భారత్ సహా 112 దేశాలు ఐరాసకు బడ్జెట్‌కు తమ వాటాను చెల్లించాయి. ఇందులో భాగంగా భారత్ రూ.122.9 కోట్లను ఐరాసకు ఇచ్చింది. ఐరాస బడ్జెట్‌లో 22 శాతాన్ని(రూ.8,157 కోట్లు) అందిస్తున్న అమెరికా.. ప్రపంచశాంతి పరిరక్షక దళాల నిర్వహణకు అందే నిధుల్లో 28.5 శాతం (రూ.15,455 కోట్లు) భరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment