న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ ఈ మేరకు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వేర్వేరుగా తెలియజేశాయి. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది.
అయితే, అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం బదిలీ కానుంది, ఈక్విటీ కింద మార్చుకోవడానికి సంబంధించిన షరతులు మొదలైన వివరాలు వెల్లడి కాలేదు. ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50.50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా(ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5% వాటాలనూ (మొత్తం 74%) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణలో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. అదానీ గ్రూప్ ఇటీవలే ఆరు నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
కరోనా ప్రభావం ..
ఓవైపు కరోనా వైరస్ దెబ్బతో ఏవియేషన్ రంగం కుదేలవడం, మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘విమానయాన రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లయింది. ఎంఐఏఎల్ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం పడింది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఇన్వెస్టరును తీసుకురావడం తప్పనిసరైంది‘ అని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. మరోవైపు, ‘ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన మెట్రోపోలిస్‌లలో ఒకటైన ముంబై విమానాశ్రయం ద్వారా విమాన ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టం‘ అని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
అదానీ స్టాక్స్ డౌన్..: సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ దాదాపు 5.3% దాకా నష్టాల్లో ముగిశాయి. జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రా షేరు 4.89% పెరిగి రూ.3.35 అప్పర్ సర్క్యూట్ తాకింది.
ఏడీఐఏతో ఒప్పందం రద్దు..
తాజా డీల్ నేపథ్యంలో గతంలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జీవీకే తెలిపింది. జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఈ సంస్థలతో జీవీకే గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 7,614 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment