GVK Group
-
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ ఈ మేరకు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వేర్వేరుగా తెలియజేశాయి. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. అయితే, అదానీ గ్రూప్‌నకు ఎంత రుణం బదిలీ కానుంది, ఈక్విటీ కింద మార్చుకోవడానికి సంబంధించిన షరతులు మొదలైన వివరాలు వెల్లడి కాలేదు. ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50.50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా(ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5% వాటాలనూ (మొత్తం 74%) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణలో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. అదానీ గ్రూప్ ఇటీవలే ఆరు నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం .. ఓవైపు కరోనా వైరస్ దెబ్బతో ఏవియేషన్ రంగం కుదేలవడం, మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘విమానయాన రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లయింది. ఎంఐఏఎల్ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం పడింది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఇన్వెస్టరును తీసుకురావడం తప్పనిసరైంది‘ అని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. మరోవైపు, ‘ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన మెట్రోపోలిస్‌లలో ఒకటైన ముంబై విమానాశ్రయం ద్వారా విమాన ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టం‘ అని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. అదానీ స్టాక్స్ డౌన్..: సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ దాదాపు 5.3% దాకా నష్టాల్లో ముగిశాయి. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా షేరు 4.89% పెరిగి రూ.3.35 అప్పర్ సర్క్యూట్ తాకింది. ఏడీఐఏతో ఒప్పందం రద్దు.. తాజా డీల్ నేపథ్యంలో గతంలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జీవీకే తెలిపింది. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఈ సంస్థలతో జీవీకే గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 7,614 కోట్లు. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ‘అదానీ’ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో సతమతమవుతున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే గ్రూప్ తాజాగా ప్రతిష్టాత్మక ముంబై విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎంఐఏఎల్)లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు ఉన్న 50.5 శాతం వాటాలతో పాటు మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి జీవీకే, అదానీ గ్రూప్‌ల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు, అంతిమంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి జీవీకే నిష్క్రమించే అవకాశాలే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌పై పలు టీమ్‌లు కసరత్తు చేస్తున్నాయని, మరికొద్ది వారాల వ్యవధిలోనే ప్రాథమిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సుమారు రూ. 705 కోట్లు నిధులు పక్కదారి పట్టించిందన్న ఆరోపణల మీద జీవీకే గ్రూప్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది నుంచే అదానీ కసరత్తు .. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, బిడ్ సర్వీసెస్ డివిజన్ మారిషస్ (బిడ్వెస్ట్)కు 13.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికాకు 10 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ)కు 26 శాతం వాటాలు ఉన్నాయి. బిడ్వెస్ట్ వాటాలను అదానీ గ్రూప్ గతేడాది మార్చిలో రూ. 1,248 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. అయితే, ఈ విషయంలో ముందుగా తమకే అధికారం ఉంటుందంటూ జీవీకే గ్రూప్ ఈ డీల్‌ను అడ్డుకుంది. కానీ, బిడ్వెస్ట్ వాటా కొనుగోలు చేసేంత స్థాయిలో నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ప్రస్తుతం జీవీకే గ్రూప్ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా దిగజారడంతో అదానీ గ్రూప్‌నకు తన వాటా కూడా అమ్మేసి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టుల నుంచి ఎయిర్‌పోర్టుల వరకూ.. నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాల దాకా అదానీ గ్రూప్ భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. లక్నో, జైపూర్, గువాహటి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించిన 6 నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇక ఎంఐఏఎల్‌ను కూడా దక్కించుకుంటే ప్రభుత్వ రంగ ఏఏఐ మినహా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అదానీ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాతో విమానశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ డెవలపర్‌గా ఎదగాలని భారీ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ ఇటీవలే తన వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా డీల్ ఆ లక్ష్య సాధనకు తోడ్పడనుంది. గట్టెక్కేందుకు జీవీకే ప్రయత్నాలు.. రుణభారంతో సతమతమవుతున్న జీవీకే గ్రూప్ తమ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ (పీఎస్పీ) ఇన్వెస్ట్మెంట్స్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,614 కోట్లు. ఈ నిధులను హోల్డింగ్ కంపెనీల రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలని జీవీకే గ్రూప్ భావించింది. అయితే, ఈ డీల్ పూర్తయిందా లేదా అనేది ఇప్పటికీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం మాత్రం ఎంఐఏఎల్‌లో వాటాలను అమ్ముకునేందుకు జీవీకే ప్రమోటర్లకు కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్ అంగీకరించినట్లు సమాచారం. ఎంఐఏఎల్ ఖాతాల ఆడిట్ .. జీవీకే హోల్డింగ్స్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఎంఏఐఎల్‌కు చెందిన గడిచిన 10 సంవత్సరాల ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిర్ణయించింది. ఇందుకోసం డెలాయిట్ సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తోంది. చట్టప్రకారం మోసం ఆరోపణలపై ఎస్బీఐ కూడా విచారణ జరపాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్?
సాక్షి, ముంబై: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) త్వరలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) లో భారీ వాటాను సొంతం చేసుకోనుంది. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ లీజును సొంతం చేసుకున్నఅదానీ తాజాగా మియాల్ లో 74 శాతం వాటాను దక్కించుకోనుంది. దీంతో దేశంలో జీఎంఆర్ గ్రూప్ తరువాత అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అవతరిస్తుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్‌నకు చెందిన 50.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈ వారాంతంలో అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. అలాగే 23.5 శాతం ఇతర వాటాలను కూడా కొనుగోలు చేయనుంది. బిడ్వెస్ట్ కు చెందిన 13.5 శాతం వాటా, ఏసీఎస్ఏ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో ఎంఐఏఎల్‌లో అదానీ వాటా 74 శాతానికి చేరుతుంది. ఇందుకోసం అదానీ గ్రూప్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను చెల్లించనుంది. తద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, బ్రాండింగ్ అదానీ గ్రూప్ చేతిలోనే ఉండనుంది. కాగా 50 సంవత్సరాల లీజుకు ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అదానీ గ్రూప్ ఈ 6 విమానాశ్రయాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో నిర్వహించడానికి, అభివృద్ధికి హక్కులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
జీవీకే గ్రూప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా
-
జీవీకే స్కాం.. ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ముంబై ఎయిర్‌పోర్టు స్కాం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మంగళవారం ముంబై, హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిధుల అవకతవకలకు పాల్పడినట్లు జీవీకే గ్రూప్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఈ నెల 2న జీవీకే గ్రూప్ ప్రమోటర్లు జీవీరెడ్డి, సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. బోగస్ బిల్లులు, షెల్ కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే జీవీకే పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. (జీవీకే గ్రూప్‌పై ఈడీ కొరడా) దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్టక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. -
జీవీకే గ్రూప్‌పై ఈడీ కొరడా
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్పోర్ట్ కార్యకలాపాల్లో అవకతవకల వ్యవహారంలో జీవీకే గ్రూప్, ఎంఐఏఎల్ (ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్)లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ ధనార్జన కేసులు నమోదుచేసింది. రూ.705 కోట్ల ఈ అవకతవకలకు సంబంధించి అక్రమ ధనార్జన నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (పోలీస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌కు సమానం) దాఖలయినట్లు మంగళవారం ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇదే సంస్థలపై ఇటీవలి సీబీఐ ఎఫ్ఐఆర్ అధ్యయనం అనంతరం ఈడీ కేసులు దాఖలయ్యాయి. నోటీస్ అందుకోలేదు: జీవీకే ఇదిలావుండగా, ఈ కేసు విషయంలో తాము ఈడీ నుంచి ఎటువంటి నోటీసులూ అందుకోలేదని జీవీకే ప్రతినిధి ప్రకటించారు. ఈ కేసులో ఆయా కంపెనీల అధికారులకు ఈడీ నోటీసులు పంపి, వారి స్టేట్మెంట్లను రికార్డు చేస్తుం దని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. విచారణలో కొన్ని దశలు పూర్తయిన తర్వాత పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం ఈడీ ఈ కేసులో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల ఆస్తుల జప్తు చర్యలు తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ ఏమిటి? సీబీఐ, ముంబై విభాగం ఈ నెల మొదట్లో నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు కలిసి ఎంఐఏఎల్‌కు చెందిన రూ.705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్రానికి నష్టం చేశారు. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, జీవీకే చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంఐఏఎల్ ఎండీ జీవీ సంజయ్ రెడ్డి, ఐశ్వర్యగిరి కన్స్ట్రక్షన్స్, కోటా ఎంటర్ప్రైజెస్ మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ వంటి అభియోగాలు దాఖలయ్యాయి. 2006 ఏప్రిల్ 4న ఎంఐఏఎల్‌తో ఏఏఐ ఒప్పందం పెట్టుకుంది. ముంబై ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ, కార్యకలాపాలు, నిర్వహణ ఈ ఒప్పందం ఉద్దేశ్యం. అయితే దీని అమల్లో సంబంధిత భాగస్వాములు అందరూ కలిసి భారీ ఆర్థిక అవకతకలకు పాల్పడినట్లు ఆరోపణ. -
ఎయిర్పోర్ట్ స్కాం : జీవీకే గ్రూపు బుక్
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 705 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో జీవీకే గ్రూప్, ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్) అధికారులు, మరికొన్ని సంస్థలపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ చట్టం కింద కేసు ఫైల్ చేసింది. (జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్!) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) సెక్షన్ 3 కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను దాఖలు చేసిందని ఈడీ అధికారులు ధృవీకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా రాబోయే వారాల్లో ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కంపెనీల ఖాతాల పరిశీలన, నిధుల బదిలీని త్వరలోనే ఈడీ ప్రారంభించనుందని అంచనా. అలాగే దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసు రాలేదని జీవీకే ప్రతినిధి వ్యాఖ్యానించారు. (ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!) కాగా గత నెలలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?) -
ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)కు చెందిన రూ. 705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముంబై విభాగం కేసులు నమోదు చేసింది. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నట్లు అధికారులు తెలిపారు. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఎయిర్‌పోర్టు లిమి టెడ్, జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఎంఐ ఏఎల్ ఎండీ జీవీ సంజయ్‌రెడ్డి, ఐశ్వర్యగిరి కన్స్ట్ర క్షన్స్, కోటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అభియోగాలతోపాటు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471, పీసీ యాక్ట్ 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్‌లలోని జీవీకే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిపారు. ఏం జరిగింది? దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్టక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. -
జీవీకే గ్రూప్ చైర్మన్‌కు సీబీఐ షాక్..
-
జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్!
సాక్షి, ముంబై: ఎయిర్ పోర్ట్ స్కాం కేసులో జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్ ఇచ్చింది. జీవీకే గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీ వెంకట కృష్ణారెడ్డి, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్), జీవీకే కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 705 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, 2012-2018 మధ్య కాలంలో అక్రమంగా 705 కోట్లకు పైగా లాభాలను ఆర్జించారనేది ప్రధాన ఆరోపణ. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇతర విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన జాయింట్ వెంచర్ "ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్'' లేదా మియాల్. ఇందులో జీవీకే వాటా 50.5 శాతం కాగా, 26 శాతం వాటా ఏఏఐ సొంతం. 2006 లో ఏఏఐ, మియాల్ ఒప్పందం ప్రకారం ముంబై విమానాశ్రయ నిర్వహణ మియాల్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ ఆదాయంలో 38.7 శాతం వార్షిక రుసుముగా ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన నిధులు విమానాశ్రయం ఆధునీకరణ, ఆపరేషన్, నిర్వహణ కోసం ఉద్దేశించింది. అయితే తొమ్మిది ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి బోగస్ వర్క్ కాంట్రాక్టులు చూపించి 310 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిలో ఎక్కువ భాగం 2017-18 మధ్య ముంబై విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగించినట్టు పేర్కొంది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని , తద్వారా జాయింట్ వెంచర్ కంపెనీకి 100 కోట్ల రూపాలయకు పైగా నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. అదే కాలంలో నిందితులు మియాల్ ఆదాయాన్ని తక్కువగా నివేదించారని దర్యాప్తులో తేలిందనీ, దీంతో కలిపి ప్రభుత్వ ఖజానాకు మొత్తం నష్టం రూ .1,000 కోట్లకు పైగా ఉంటుందని సీబీఐ వర్గాల వాదన. -
చిన్న ఎయిర్‌పోర్టులకు కోవిడ్-19 షాక్
కోవిడ్-19 కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలలో విమానాశ్రయాల అభివృద్ధిపై అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ పునరాలోచలో పడినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, త్రివేండ్రం, జైపూర్, గువాహటి విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఇప్పటికే గెలుచుకుంది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతలను స్వీకరించలేమంటూ ప్రభుత్వ అధీకృత సంస్థకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రయివేటీకరణ జరిగిన ఈ మూడు విమానాశ్రయాలకు సంబంధించిన ఆస్తుల బదిలీ ఫీజు చెల్లింపు గడువును వాయిదా వేయమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)ని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. రూ. 1,000 కోట్లకుపైగా ఫీజును ఆగస్టులో చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మూడు విమానాశ్రయాలపై ఏఏఐతో అదానీ గ్రూప్ కన్సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వీటి నిర్వహణ, అభివృద్ధి తదితరాలను చేపట్టవలసి ఉంటుంది. 2018లో అదానీ గ్రూప్ ఆరు విమానాశ్రయ ప్రాజెక్టులను గెలుచుకుంది. వీటిలో త్రివేండ్రం, జైపూర్, గువాహటి ఉన్నప్పటికీ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు మాత్రమే కన్సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరు ఎయిర్‌పోర్టులకుగాను మొత్తం రూ. 2,000 కోట్లకుపైగా అసెట్ ట్రాన్స్ఫర్ ఫీజును చెల్లించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కాగా.. కోవిడ్-19తో తలెత్తిన సమస్యల నేపథ్యంలో నవీముంబై ప్రాజెక్టుపై జీవీకే గ్రూప్ సైతం కొంతమేర వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 16,000 కోట్ల నవీముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆలస్యంగా ప్రారంభించేందుకు అనుమతించమంటూ సిడ్కోను అభ్యర్ధించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశాలపై అటు అదానీ గ్రూప్, ఇటు జీవీకే గ్రూప్ స్పందించలేదని నిపుణులు పేర్కొన్నారు. -
7,614 కోట్లు సమీకరించిన జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో (ఎన్ఐఐఎఫ్) ఈ మేరకు జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీలైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది. డీల్ తదనంతరం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఐఐఎఫ్ వాటాదారులుగా ఉంటాయి. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే గ్రూప్ వాటా 20.9 శాతానికి పరిమితం అవుతుంది. డీల్‌లో భాగంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రూ.9,608 కోట్లుగా విలువ కట్టారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో.. డీల్ ద్వారా వచ్చిన నిధులను ప్రాథమికంగా హోల్డింగ్ కంపెనీల్లో సుమారు రూ.5,500 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ తన వాటాను పెంచుకోనుంది. ఇందుకోసం ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికా సంస్థలు అయిన బిడ్వెస్ట్, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలకు (ఏసీఎస్ఏ) ఉన్న వాటాను కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం, ఏసీఎస్ఏకు 10 శాతం వాటా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే గ్రూప్ కంపెనీ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇక కొత్తగా నిర్మితమవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఐఏఎల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎన్ఎంఐఏ) ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. నిష్క్రమణ కోసం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) వాటాదారులైన బిడ్వెస్ట్, ఏసీఎస్ఏ ఎప్పటి నుంచో తప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఉన్న 23.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయాలని భావించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడ్డట్టే. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. బిడ్వెస్ట్, ఏసీఎస్ఏల నుంచి 23.5 శాతం వాటా దక్కించుకోవడం ద్వారా.. జీవీకే గ్రూప్ వాటా 74 శాతానికి చేరనుంది. అయితే రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ కింద ఈ ఏడాది ప్రారంభంలో బిడ్వెస్ట్ తన 13.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు జీవీకేకు తెలిపింది. అందుకు జీవీకే అంగీకరించింది. వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,248 కోట్ల చెల్లింపు ఆలస్యం కావడంతో ఢిల్లీ హైకోర్టును బిడ్వెస్ట్ ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను బిడ్వెస్ట్ ఆశ్రయించింది. అక్టోబరు 31లోగా ఈ చెల్లింపు పూర్తి చేయాలని జీవీకేను ట్రిబ్యునల్ ఆదేశించింది. జీవీకే నిర్వహణలోనే.. వాటా విక్రయం తర్వాత ఎయిర్పోర్ట్ వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్ అంతా జీవీకే గ్రూప్ కిందనే ఉంటాయని సంస్థ తెలిపింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్లు వెనుక ఉండడం ఎంఐఏఎల్, ఎన్ఎంఐఏ విస్తరణకు కలిసి వస్తుందని వివరించింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారం మరింత బలంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపింది. ఎంఐఏఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి, ఎండీగా జీవీ సంజయ్ రెడ్డి కొనసాగనున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49 శాతం వాటాను ఏడీఐఏ, ఎన్ఐఐఎఫ్లకు విక్రయించాలన్న ప్రతిపాదనపై ఏప్రిల్‌లో సంతకాలు జరిగాయి. -
వేలానికి జీవీకే గ్రూప్ ‘సెజ్’
► సిద్ధమైన సిండికేట్ బ్యాంకు ► రూ.175 కోట్లు బాకీపడ్డ కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ షాకిచ్చింది. రుణ రికవరీలో భాగంగా తమిళనాడులో 2,500 ఎకరాల్లో విస్తరించిన జీవీకే పెరంబలూరు సెజ్ స్థలాన్ని వేలానికి పెట్టింది. సిండికేట్ బ్యాంకుకు గ్రూప్ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.175.08 కోట్లు బాకీ పడింది. సర్ఫేసీ యాక్ట్–2002 కింద రికవరీ కోసం బ్యాంకు ఈ మేరకు గురువారం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. రిజర్వ్ ప్రైస్ రూ.257 కోట్లుగా ఉంది. జనవరి 6న తొలిసారి నిర్వహించిన వేలానికి స్పందన రాలేదు. దీంతో మరోసారి మార్చి 27న ఈ–వేలానికి బ్యాంకు సిద్ధమైంది. 2015 డిసెంబరులో రూ.156.76 కోట్ల బాకీ చెల్లించాలంటూ నోటీసు ఇచ్చిన తర్వాత 2016 సెప్టెంబరు నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.8.9 కోట్లు మాత్రమే సిండికేట్ బ్యాంకుకు చెల్లించింది. మరో రెండు బ్యాంకులు సైతం.. సిండికేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు సైతం ఇదే సెజ్ స్థలంపై జీవీకే గ్రూప్ కంపెనీలకు రుణాలను మంజూరు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు రూ.1,078 కోట్లు అప్పు ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.205 కోట్లు రుణం అందించింది. కాగా, 2016 మార్చి నాటికి జీవీకే గ్రూప్ రుణ భారం రూ.32,290 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీ 2015–16లో కన్సాలిడేటెడ్ నిర్వహణ ఆదాయం రూ.4,164 కోట్లపై రూ.1,212 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వాటాల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ చర్య ఇబ్బందికర పరిణామమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చెల్లిస్తామంటున్నారే తప్ప.. బాకీ విషయమై బ్యాంకుతో చర్చిస్తున్నామని జీవీకే అంటోంది. మొత్తం బాకీని కొన్ని వారాల్లో చెల్లిస్తామని మరీ చెబుతోంది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు తోసిపుచ్చారు. కంపెనీ ప్రతినిధులు బ్యాంకుతో చర్చిస్తున్నట్టు తనకు సమాచారం లేదని సిండికేట్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. బాకీ చెల్లించే ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించారు. మొదటిసారి వేలం నోటీసు ఇచ్చినప్పుడు కూడా బాకీ తిరిగి చెల్లిస్తామని కంపెనీ చెప్పిందేగానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లేవీ చేయలేదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సెజ్ స్థలాన్ని ఒకే యూనిట్‌గా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుకు రావాల్సిన మొత్తాన్ని స్వీకరిస్తాం. ఇతర రుణదాతలకు చెల్లించేందుకు వీలుగా మిగిలిన వేలం సొమ్మును కంపెనీకి ఇస్తాం అని ఆయన వివరించారు. -
20లోగా కౌంటర్ దాఖలు చేయండి- హైకోర్టు ఆదేశం
-108 ఉద్యోగులకు సెప్టెంబర్ వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు హైదరాబాద్ :108 అంబులెన్సులు నిర్వహణ దక్కించుకున్న యుకెఎస్‌ఎఎస్-బీవీజీ కన్సార్టియంపై జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. దీంతో సర్కారుకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థల కన్సార్టియంకు అర్హత లేదని జీవీకే సంస్థ కోర్టుకు పత్రాలను దాఖలు చేసింది. దీంతో 108 అంబులెన్సులను తక్షణమే ఆ సంస్థలకు ఇవ్వకుండా ఉపసంహరించుకోవాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థలకు అర్హత ఉందని ఎలా నిరూపించాలో కసరత్తు చేస్తోంది. కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయడంలో భాగంగా టెండరు దక్కించుకున్న సంస్థల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కాల్ సెంటర్‌గానీ, అంబులెన్సులు నిర్వహించిన అనుభవం గానీ ఈ సంస్థలకు లేదని జీవీకే హైకోర్టుకు చెప్పింది. సెప్టెంబర్ జీతాలు ఇప్పటికీ లేవు అక్టోబర్ నెల ముగుస్తున్నా 108 ఉద్యోగుల నిర్వహణకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగులకు తామే సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని, సర్కారు నుంచి తమకు రావాల్సిన వేతనాలు ఇంకా రాలేదని జీవీకే సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయని, నిధులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 6 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాలన్నీ మరమ్మతులతో ఆగిపోతున్నాయని, దీంతో ఎమర్జెన్సీ కాల్స్‌కు సకాలంలో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 108 అంబులెన్సుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుగుతోంది. -
108కి టెండర్
జీవీకే నుంచి బీవీకేకు మారనున్న బాధ్యతలు నెలాఖరు వరకే ఉద్యోగుల గడువు ఇప్పటికే అందిన నోటీసులు భవిష్యత్తుపై సిబ్బంది ఆందోళన ఒంగోలు సెంట్రల్ : 108 వాహన ఉద్యోగులకు మళ్లీ కష్టాలొచ్చాయి. వాహనాల నిర్వహణ బాధ్యతను జీవీకే గ్రూపు నుంచి భారత్ వికాస్ గ్రూప్‌నకు అప్పగిస్తున్నారు. ఉద్యోగులకు నెలాఖరుతో ఉద్యోగాల కాలపరిమితి ముగుస్తుందని సంస్థ నుంచి ముందస్తు సమాచారం అందింది. దీంతో తమ భవిష్యత్తు ఏమిటని సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 108 వాహనాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆరంభంలో కొద్ది రోజులు బాగానే తిరిగినా.. కానీ ఆ తర్వాత రకరకాల సమస్యలు చుట్టుముట్టారుు. జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. మండలానికి కనీసం ఒకటి చొప్పున 108 వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాకు కేవలం 32 అంబులెన్సులనే కేటాయించారు. వాహనాలను కేటాయించినా అనంతర కాలంలో కొన్ని మరమ్మతులకు గురైతే, వాటని కూడా లెక్కలోనే ఉంచుతున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 3 వాహనాలు మాత్రమే జిల్లాకు కొత్తవి వచ్చాయి. ప్రారంభంలో సత్యం గ్రూపు 108ను నిర్వహించింది. వాహనాల నిర్వహణకు, సిబ్బంది జీత భత్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది. అనంతరం జీవీకే సంస్థకు అప్పగించారు. అయితే ప్రస్తుతం జీవీకే సంస్థకు ఇచ్చిన గడువు తీరిపోవడంతో బీవీకే గ్రూపు టెండర్ దక్కించుకుంది. దీంతో 108 సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నూతన సంస్థ వస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిని తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించుకునే అవకాశం ఉంది. 108 వాహనాల్లో సమస్యలు: ఒక్కో 108 వాహనంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, ముగ్గురు పెలైట్లు ఉండాలి. ఇదే విధంగా ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున 24 గంటలు ముగ్గురు పని చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి 108 వాహనానికి ఇద్దరు చొప్పున మాత్రమే సిబ్బందిని నియమించారు. దీంతో ఒక్కో షిఫ్టులో సిబ్బంది 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. పైగా 108 వాహనాల్లో ఆక్సిజన్ సౌకర్యం కూడా సరిపోయేలా ఉండటం లేదు. సరిగా లేని వాహనాల నిర్వహణ: 108 వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సాంకేతిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కనీసం తలుపులు కూడా తెరుచుకోని వాహనాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతి వాహనానికి ఇంజిన్ సమస్యలు తలెత్తి మధ్యలోనే ఆగిపోతున్నాయి. టైర్లు అరిగిపోయి ఎక్కడికక్కడ పంక్చర్ అవుతున్నాయి. ఉన్న వాహనాల్లో చాలా వరకూ 11 ఏళ్ల కిందటివే ఉన్నాయి. వాటి స్థానంలో కొన్నిటిని మాత్రమే ఇచ్చారు. మిగిలినవి పాత వాహనాలే. అన్నింటికీ మించి పది మండలాలకు వాహన సౌకర్యం లేదు. 108 సేవల పేరుతో ప్రజాధనం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ వికాస్ గ్రూపుకు 108 సేవలకు గానూ ఒక్కో వాహనానికి నెలకు రూ.1.13 లక్షలు చెల్లించేది. అయితే నూతనంగా టెండర్‌ను దక్కించుకున్న సంస్థకు రూ.1.30 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ వాహనాలు ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు. -
ఎయిర్పోర్ట్ వ్యాపారానికి నిధుల సమీకరణలో జీవీకే
న్యూఢిల్లీ : ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం రుణభారాన్ని తగ్గించుకునే దిశగా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు మౌలిక రంగ సంస్థ జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి తెలిపారు. అయితే, సంస్థను లిస్టింగ్ చేసే ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. లిస్టింగ్ ద్వారా జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించనున్న వార్తలపై స్పందిస్తూ సంజయ్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు. సుమారు రూ. 20,000 కోట్ల రుణభారం గల జీవీకే గ్రూప్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. మరోవైపు విదేశాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇండొనేషియా, ఆఫ్రికాలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సంజయ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండొనేషియాలో జీవీకే ఇప్పటికే రెండు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తోంది. -
అనిశ్చితిలో 108
* బకాయిలు పేరుకుపోవడంతో చేతులెత్తేస్తున్న జీవీకే * ప్రభుత్వం నిధులిస్తేనే నిర్వహణ సాధ్యమంటున్న సంస్థ * జీవీకే తీరుపై టీ సర్కారు అసంతృప్తి * ఒప్పందం నుంచి తప్పించే యోచన.. స్వయంగా నిర్వహించేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: అపర సంజీవనిగా గుర్తింపు పొందిన 108 అంబులెన్సుల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. డీజిల్, ఇతరత్రా సమస్యల వల్ల కొన్నిచోట్ల సర్వీసులు నిలిచిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, మూడు నెలల బకాయిలు పేరుకుపోవడంతో రాష్ర్టంలో 108ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని జీవీకే సంస్థ చేతులెత్తేస్తోంది. మరోవైపు చిన్నచిన్న ఆర్థిక కారణాలు చూపించి అత్యవసర వ్యవస్థను నడిపించకపోవడంపై రాష్ర్ట ప్రభుత్వం గుర్రుగా ఉంది. దీంతో జీవీకేకు, ప్రభుత్వానికి మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతను జీవీకే సంస్థకు గతంలో ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఈ మేరకు రెండింటి మధ్య 2016 వరకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జీవీకేకు పూర్తిస్థాయి నిధులను ప్రభుత్వమే అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 316 వాహనాలు ఉండగా.. ఒక్కో వాహనానికి రూ. 1.22 లక్షల చొప్పున నెలకు రూ. 3.80 కోట్ల మేర నిధులను జీవీకేకు విడుదల చేస్తుంది. ఇందులో డీజిల్ కోసమే రూ. 1.50 కోట్ల వరకు ఖర్చవుతోంది. అయితే విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో విడివిడిగా జీవీకే ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మళ్లీ కాంట్రాక్టు కుదిరినా.. తెలంగాణలో మాత్రం ఇంకా ఒప్పందం జరగలేదు. ఇటీవలి కాలంలో జీవీకే సర్వీసుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. దాదాపు 70 వాహనాల వరకు నడవడం లేదని అనధికారిక సమాచారం. జీవీకే మాత్రం మంగళవారం నాటికి 305 వాహనాలు నడుస్తున్నాయని, 11 వాహనాలు మాత్రమే రోడ్డెక్కలేదని చెబుతోంది. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా అందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ సంస్థ వర్గాలు అంటున్నాయి. నవంబర్ నెలకు సంబంధించి ఒక్క పైసా విడుదల చేయలేదని, అంతకుముందు బకాయిలతో కలుపుకొని రూ. 7 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నాయి. మరోవైపు మొన్నటివరకు బడ్జెట్ లేకపోవడంతో నిధులు విడుదల చేయనిమాట వాస్తవమేనని, అయితే అత్యవసర సర్వీసును చిన్నపాటి ఆర్థిక కారణాలతో అస్తవ్యస్తం చేయడం జీవీకే వంటి ప్రముఖ సంస్థకు తగదని అధికారవర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆ మేరకు కూడా భరించే స్థితి జీవీకేకు లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వమే ఈ సర్వీసులను నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. అయితే ఇప్పటికిప్పుడు తన చేతుల్లోకి తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. -
ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు అనుమతి: జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టనున్న ప్రతిపాదిత ఆల్ఫా కోల్ ప్రాజెక్టుకు ఆరేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు పర్యావరణ అనుమతి పొందింది. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు 500 మందికిపైగా కన్సల్టెంట్ నిపుణులు 300పైగా శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టారని కంపెనీ తెలిపింది. క్వీన్స్‌లాండ్‌లోని గెలీలి బేసిన్లో 10 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో అల్ఫా కోల్ ప్రాజెక్టును జీవీకే హాన్కాక్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా గని అభివృద్ధితోపాటు రైల్వే లైన్, నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తి అయితే గెలీలీ బేసిన్ ప్రసిద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని జీవీకే ఫౌండర్ చైర్మన్ జీవీకే రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గనిలో 2016 నాటికి తొలి లాట్ వస్తుందని అంచనా. కార్యకలాపాలు పూర్తి స్థాయికి చేరుకున్నాక ఏటా 3.2 కోట్ల టన్నుల బొగ్గు వెలికితీస్తారు. మౌలిక వసతుల ఏర్పాటుకై కోల్ రైల్ నిర్వహణ కంపెనీ ఆరిజన్ హోల్డింగ్స్‌తో సంయుక్త భాగస్వామ్య ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. అనుమతుల విషయంలో ఉన్న వ్యాజ్యాలను నియంత్రణ సంస్థలు పరిష్కరిస్తే బొగ్గు విక్రయ ఒప్పందాలను కుదుర్చుకుంటామని జీవీకే తెలిపింది. జీవీకే హాన్కాక్లో జీవీకే 79 శాతం, హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు 21 శాతం వాటా ఉంది. -
గౌతమి పవర్ ప్రాజెక్టులో హెచ్ఎస్డీకి అనుమతించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేజీ బేసిన్ నుంచి తమకు గ్యాస్ సరఫరా ఆగిపోయిన నేపథ్యంలో గౌతమి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తికి హై స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)ని ఉపయోగించేందుకు అనుమతించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను జీవీకే గ్రూప్ కోరింది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, హెచ్‌ఎస్‌డీని భారీగా వినియోగించడం పర్యావరణానికి మంచిది కాదని భావించిన పర్యావరణ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ .. దీనిపై చమురు శాఖ అభిప్రాయాలు తెలుసుకోవాలని కంపెనీకి సూచించింది. గౌతమి పవర్ ప్రాజెక్టు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉంది. కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో రోజుకు దాదాపు 1.96 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) పరిమాణాన్ని కేంద్రం గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. 2009 నుంచి 2011 దాకా ప్లాంటు పూర్తి స్థాయిలో పనిచేసింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి నానాటికి తగ్గిపోతుండటంతో.. గతేడాది మార్చ్ నుంచి విద్యుత్ కంపెనీలకు గ్యాస్ సరఫరా నిల్చిపోయింది. దీంతో జీవీకే సహా పలు పవర్ ప్రాజెక్టులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. -
ఎయిర్‌పోర్టు వ్వాపారంలో లాభాల స్వారీ
‘సాక్షి’ ఇంటర్వ్యూ: జీవీకే గ్రూప్ చైర్మన్, ఎండీ జి.వి. కృష్ణారెడ్డి అప్పు తీర్చడానికి వీలైతే వాటా విక్రయిస్తాం పెద్ద వాటాదారుగా మాత్రం మేమే కొనసాగుతాం దీన్లో విస్తరణకు మరిన్ని బిడ్లు వేస్తాం ఆస్ట్రేలియా బొగ్గు ఉత్పత్తి రెండేళ్లలో మొదలు రాష్ట్రంలో విద్యుత్తుపై ప్రభుత్వ పాలసీ మారాలి ఒప్పందం ప్రకారమే మేం పరిష్కార ఛార్జీలు అడుగుతున్నాం రోడ్డు ప్రాజెక్టులేమీ లాభసాటిగా లేవు అందుకే వాటినుంచి క్రమంగా వైదొలుగుతున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో జీవీకే గ్రూప్ నుంచి ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని విడదీసి కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు జీవీకే గ్రూపు సంస్థల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జి.వి.కృష్ణారెడ్డి తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉన్న పరిస్థితుల వల్ల మొత్తంగా తమ గ్రూపు నష్టాలు కూడగట్టుకుంటున్నప్పటికీ ఎయిర్‌పోర్టుల వ్యాపారం మాత్రం లాభాల్లోనే ఉందని, అందుకే దాన్ని విడదీసే ఆలోచన ఉందని చెప్పారు. ముంబై విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్-2ను శుక్రవారం ప్రధాని జాతికి అంకితం చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధితో కృష్ణారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిర్‌పోర్టుల నుంచి హోటళ్లు, రోడ్లు, పవర్ ప్రాజెక్టుల వరకూ తమ గ్రూపు పరిస్థితిని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ముంబై టెర్మినల్-2ను అత్యుత్తమ నిర్మాణంగా చాలామంది చెబుతున్నారు కదా? మేం ఒకటే అనుకున్నాం. ఒప్పందం ప్రకారం మాకింకా 60 ఏళ్లుంది. బహుశా! మా అబ్బాయి, మనవల తరం వరకూ మా చేతిలో ఉంటుందేమో!. కానీ ఈ కట్టడం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. మా గుర్తుగా. అందుకే దీన్నింత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాం. ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎలా ఉంది? ముంబై, బెంగళూరు విమానాశ్రయాలతో పాటు ఇండోనేషియాలో మరో రెండు విమానాశ్రయాలున్నాయి. అక్కడి బాలి విమానాశ్రయంతో పాటు అంకాశపుర విమానాశ్రయానికి కూడా మేం సలహాదారుగా ఉన్నాం. ఎయిర్‌పోర్టుల వ్యాపారం లాభాల్లోనే ఉంది. దీన్ని మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మరిన్ని విమానాశ్రయాల కోసం బిడ్లు వేస్తారా? తప్పకుండా. నవీ ముంబాయి విమానాశ్రయానికి బిడ్లు పిలుస్తున్నారు. మేం ఈ విమానాశ్రయం చేశాం కనక మేం దానికి సహజంగానే అర్హులం. మిగతా వారైతే అర్హత సాధించాలి. మేం సాధిస్తే రెండూ మా చేతిలో ఉండటం వల్ల అందరికీ మంచిదే. ఇక దేశంలో మరో ఆరు విమానాశ్రయాల్ని ప్రైవేటీకరించడానికి బిడ్లు పిలిచారు. కానీ ఒక కంపెనీ రెండుకన్నా ఎక్కువ చేపట్టకూడదనే నిబంధన పెట్టారు. మేం బిడ్లు వేశాం. వచ్చేనెల్లో అర్హత ప్రతిపాదనలు పిలుస్తారు. అప్పుడు తేలుతుంది. కోల్‌కతా, చెన్నైలమీదే దృష్టిపెట్టాం. ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయిస్తారా? దీన్లో మాకున్న వాటాను 37 నుంచి 51కి పెంచుకున్నాం. అలాగే బెంగళూరు విమానాశ్రయంలో కూడా అతిపెద్ద వాటాదారుగా ఉండాలన్న ఉద్దేశంతో మా వాటాను 47కు పెంచుకున్న సంగతి మీకు తెలుసు. మొత్తమ్మీద ఎయిర్‌పోర్టుల వ్యాపారానికి 2,500 కోట్ల అప్పుంది. దీన్ని తగ్గించుకోవటానికి వాటా విక్రయించే అంశాన్ని పరిశీలిస్తాం. మే తరవాత మార్కెట్ బాగుంటే ఈ పని చేస్తాం. అయితే విక్రయం తరవాత కూడా మేమే అతిపెద్ద వాటాదారుగా ఉండేలా చూసుకుంటాం. దీన్ని ప్రత్యేక వ్యాపారంగా చేసే ఆలోచన ఉందా? ఎందుకు చేయకూడదు? ఇది లాభాల్లో ఉంది. మేం మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అవకాశాన్ని బట్టి దీన్ని ప్రత్యేక కంపెనీగా చేసే ఆలోచన కూడా ఉంది. ఆస్ట్రేలియా బొగ్గుగనుల ఉత్పత్తి ఎప్పుడు మొదలు కావచ్చు? అది చాలా పెద్ద ప్రాజెక్టు. అంచనా విలువ బాగా పెరిగి 10 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాం. అక్కడి రైల్వే మా భాగస్వామిగా ఉంది. అంతా సానుకూలంగానే ఉన్నారు. మరో రెండేళ్లలో బొగ్గు ఉత్పత్తి మొదలు కావచ్చని భావిస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితో...? ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా చేస్తారన్న ఒప్పందం మేరకే ప్లాంటు పెట్టాం. దాన్ని సప్లయ్ చేయలేని పక్షంలో ప్రత్యామ్నాయ ఇంధనం ద్వారా మేం చేసే ఉత్పత్తికి తగు ఛార్జీలు చెల్లించాలి. మేం అలా చేస్తామన్నా ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావటం లేదు. అందుకే మేం పరిహారం అడుగుతున్నాం. అదింకా పరిష్కారం కావాల్సి ఉంది. ఇతర విద్యుత్ ప్రాజెక్టులో..? జార్ఖండ్‌లో ప్లాంట్ సిద్ధమయింది. 15 లక్షల టన్నుల కార్పెట్ కోల్. రవాణాకు అనుమతులు కూడా వచ్చాయి. కాకపోతే అక్కడ కొన్ని స్థానిక సమస్యలున్నాయి. పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాం. రోడ్డు ప్రాజెక్టులు కూడా లాభసాటిగా లేవు కదా? శివ్‌పురి రోడ్ ప్రాజెక్టును వివిధ కారణాల వల్ల వదులుకునే పరిస్థితులొచ్చాయి. రోడ్డు ప్రాజెక్టులంటే అనుమతులతోనే పెద్ద సమస్య. అందుకే ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని భావిస్తున్నాం. -
ప్రజాధనం జీవీకే పరం
సాక్షి, హైదరాబాద్: గ్యాస్‌లేదు... మేం విద్యుత్ సరఫరా చేయలేం! ఐనా మీరు మాత్రం మాకు బిల్లు చెల్లించాల్సిందేనని జీవీకే పట్టుబడుతోంది. కరెంటు ఇవ్వకున్నా తమకు మాత్రం ఠంచనుగా ప్రతి నెలా 10 కోట్లు బిల్లు ఇవ్వాల్సిందేనని ట్రాన్స్‌కోను సతాయిస్తోంది. ఇందుకోసం బ్యాంకులకు ట్రాన్స్‌కో సమర్పించిన లెటర్ ఆఫ్ క్రెడిట్లు (ఎల్ఓసీ) చూపిస్తూ బ్యాంకుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటోంది.ఇప్పటికే ఇలా 90 కోట్లు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. జీవీకే వైఖరిపై ట్రాన్స్‌కో న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే... గ్యాసు ఆధారిత జీవీకే విద్యుత్ ప్లాంటుతో 1999లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ట్రాన్స్‌కో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు....85 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) మేరకు స్థిర చార్జీలను (ఫిక్స్డ్ చార్జీలు) ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 85 శాతానికి తగ్గినా, పెరిగినా... ఆ లెక్కలను ఏడాది చివరన సర్దుబాటు చేసుకోవాలని ఒప్పందం కుదిరింది. ఈ మేరకు స్థిర చార్జీలను బ్యాంకు ద్వారా ప్రతీ నెలా చెల్లించే విధంగా ఎల్సీలను జీవీకేకు ట్రాన్స్‌కో జారీచేసింది. జీవీకేకు ప్రతీ నెలా 10 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, గత ఏడాది నుంచి రోజురోజుకీ గ్యాసు సరఫరా తగ్గిపోతోంది. మార్చి 1 నుంచి గ్యాసు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశమే లేదు. అయినప్పటికీ స్థిరచార్జీల రూపంలో తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని జీవీకే పట్టుబడుతోంది. ఎల్సీలను చూపిస్తూ... తమకు డబ్బు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు తెస్తోంది. మొదట తమకు డబ్బులు చెల్లించాల్సిందేనని... ఆర్థిక సంవత్సరం చివర్లో లెక్కలు చూసుకుందామని జీవీకే అంటున్నట్టు సమాచారం. అయితే, విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినప్పటికీ, ఇప్పటికే ఎల్సీల పేరుతో బ్యాంకు నుంచి జీవీకే 90 కోట్ల మేర నగదు డ్రా చేసినట్లు తెలిసింది. మొత్తం 210 కోట్లు రావాల్సి ఉందని అంటున్నట్టు తెలిసింది. విద్యుత్ ఉత్పత్తి జరిగితే బిల్లుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉండేదని ట్రాన్స్‌కో వర్గాలు అంటున్నాయి. గ్యాస్ లేక విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంతో ఈ మొత్తాన్ని జీవీకే నుంచి వసూలు చేయడం పెద్ద సమస్యగా మారిందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా నగదు వసూలు చేసుకునేందుకు జీవీకే యత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ట్రాన్స్‌కోను జీవీకే తీరు మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జీవీకేపై న్యాయపోరాటానికి ట్రాన్స్‌కో సిద్ధమవుతుండగా, అలాంటి చర్యలు వద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
ఆ 10 కంపెనీల అప్పు .. రూ. 6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజాల రుణభారం నానాటికీ పెరిగిపోతోంది. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) సహా జీఎంఆర్, జీవీకే, ల్యాంకో వంటి మొత్తం పది కంపెనీల అప్పుల భారం గత ఆర్థిక సంవత్సరం 15 శాతం పెరిగి రూ. 6 లక్షల కోట్లు మించిపోయింది. లాభదాయకత అంతంత మాత్రంగా ఉండటం కంపెనీలను కుదేలు చేస్తోంది. క్రెడిట్ సూసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి పది గ్రూప్స్ మొత్తం రుణ భారం రూ. 6,31,025 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 5,47,361 కోట్లు. ఈ జాబితాలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ (అడాగ్), వేదాంత, ఎస్సార్, అదానీ, వీడియోకాన్, జేపీ అసోసియేట్స్, జేఎస్‌డబ్ల్యూ కూడా ఉన్నాయి. చాలా మటుకు కంపెనీల రుణభారం..వాటి పెట్టుబడి వ్యయాలను మించిపోయిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇప్పటికే ల్యాంకో, జేపీ అసోసియేట్స్, అడాగ్ కంపెనీలు రుణ పునర్వ్యవస్థీకరణ బాట పట్టడం వాటిపై ఉన్న వత్తిడిని తెలియజేస్తుందని తెలిపింది. రూపాయి క్షీణతతో మరింత పైకి.. జీవీకే, ల్యాంకో, అడా సంస్థల రుణభారం అత్యధికంగా దాదాపు 24 శాతం దాకా పెరిగిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీన్ని తగ్గించుకోవడానికి ఆయా కంపెనీలు వివిధ ఆస్తుల విక్రయాన్ని చేపట్టినప్పటికీ.. పూర్తి స్థాయిలో సాకారం కావడం లేదని వివరించింది. జీఎంఆర్, వీడియోకాన్ మాత్రమే ఈ ప్రయత్నాల్లో కాస్త సఫలమైనట్లు తెలిపింది. రూపాయి క్షీణత, ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు మొదలైన అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీల రుణభారం మరింతగా పెరిగే అవకాశముందని క్రెడిట్ సూసీ తెలిపింది. దీంతో అటు బ్యాంకుల అసెట్ క్వాలిటీపైనా మరింత భారం పడగలదని హెచ్చరించింది. చాలా కార్పొరేట్ల రుణాలు 40-70 శాతం మేర విదేశీ కరెన్సీ రూపంలోనే ఉన్న నేపథ్యంలో రూపాయి మరింత క్షీణిస్తే.. అప్పుల భారమూ పెరుగుతుందని క్రెడిట్ సూసీ పేర్కొంది. అత్యధిక విదేశీ రుణాలు ఉన్న సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అయితే, జీఎంఆర్ ఇన్ఫ్రా, అదానీ పవర్, రిలయన్స్ పవర్ ప్రాజెక్టులు గానీ అమల్లోకి వస్తే వాటి ఆపరేటింగ్ సామర్ధ్యం రెట్టింపై, కొంత ఊరట లభించగలదని క్రెడిట్ సూసీ తెలిపింది. -
ఎయిర్‌పోర్టుల్లో వాటాలు విక్రయించనున్న జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే గ్రూప్ నిర్వహిస్తున్న ముంబై, బెంగళూరు అంత ర్జాతీయ విమానాశ్రయాలలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో వ్యూహాత్మక వాటాలను చేజిక్కించుకోవడానికి ఐదు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు జీవీకే ఇన్ఫ్రా డెరైక్టర్ (ఫైనాన్స్) ఇసాక్ జార్జ్ తెలిపారు. కంపెనీ విలువను బట్టి 25 నుంచి 35 శాతంవరకు వాటాలను విక్రయించే యోచనలో ఉన్నామని, దీని ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించవచ్చని తెలిపారు. తగ్గిన నష్టాలు: కాగా తొలి క్వార్టర్లో కంపెనీ రూ.30.59 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.64.30 కోట్ల నష్టాలను ప్రకటించింది. మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ.818 కోట్ల నుంచి రూ.699 కోట్లకు తగ్గింది. విద్యుత్ వ్యాపారం, విమానాశ్రయ ఆదాయం తగ్గడం దీనికి కారణమని పేర్కొంది.