అనిశ్చితిలో 108
* బకాయిలు పేరుకుపోవడంతో చేతులెత్తేస్తున్న జీవీకే
* ప్రభుత్వం నిధులిస్తేనే నిర్వహణ సాధ్యమంటున్న సంస్థ
* జీవీకే తీరుపై టీ సర్కారు అసంతృప్తి
* ఒప్పందం నుంచి తప్పించే యోచన.. స్వయంగా నిర్వహించేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అపర సంజీవనిగా గుర్తింపు పొందిన 108 అంబులెన్సుల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. డీజిల్, ఇతరత్రా సమస్యల వల్ల కొన్నిచోట్ల సర్వీసులు నిలిచిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, మూడు నెలల బకాయిలు పేరుకుపోవడంతో రాష్ర్టంలో 108ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని జీవీకే సంస్థ చేతులెత్తేస్తోంది.
మరోవైపు చిన్నచిన్న ఆర్థిక కారణాలు చూపించి అత్యవసర వ్యవస్థను నడిపించకపోవడంపై రాష్ర్ట ప్రభుత్వం గుర్రుగా ఉంది. దీంతో జీవీకేకు, ప్రభుత్వానికి మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతను జీవీకే సంస్థకు గతంలో ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఈ మేరకు రెండింటి మధ్య 2016 వరకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జీవీకేకు పూర్తిస్థాయి నిధులను ప్రభుత్వమే అందజేస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 316 వాహనాలు ఉండగా.. ఒక్కో వాహనానికి రూ. 1.22 లక్షల చొప్పున నెలకు రూ. 3.80 కోట్ల మేర నిధులను జీవీకేకు విడుదల చేస్తుంది. ఇందులో డీజిల్ కోసమే రూ. 1.50 కోట్ల వరకు ఖర్చవుతోంది. అయితే విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో విడివిడిగా జీవీకే ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మళ్లీ కాంట్రాక్టు కుదిరినా.. తెలంగాణలో మాత్రం ఇంకా ఒప్పందం జరగలేదు. ఇటీవలి కాలంలో జీవీకే సర్వీసుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. దాదాపు 70 వాహనాల వరకు నడవడం లేదని అనధికారిక సమాచారం.
జీవీకే మాత్రం మంగళవారం నాటికి 305 వాహనాలు నడుస్తున్నాయని, 11 వాహనాలు మాత్రమే రోడ్డెక్కలేదని చెబుతోంది. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా అందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ సంస్థ వర్గాలు అంటున్నాయి. నవంబర్ నెలకు సంబంధించి ఒక్క పైసా విడుదల చేయలేదని, అంతకుముందు బకాయిలతో కలుపుకొని రూ. 7 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నాయి.
మరోవైపు మొన్నటివరకు బడ్జెట్ లేకపోవడంతో నిధులు విడుదల చేయనిమాట వాస్తవమేనని, అయితే అత్యవసర సర్వీసును చిన్నపాటి ఆర్థిక కారణాలతో అస్తవ్యస్తం చేయడం జీవీకే వంటి ప్రముఖ సంస్థకు తగదని అధికారవర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆ మేరకు కూడా భరించే స్థితి జీవీకేకు లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వమే ఈ సర్వీసులను నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. అయితే ఇప్పటికిప్పుడు తన చేతుల్లోకి తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.