సాక్షి, హైదరాబాద్: గ్యాస్‌లేదు... మేం విద్యుత్ సరఫరా చేయలేం! ఐనా మీరు మాత్రం మాకు బిల్లు చెల్లించాల్సిందేనని జీవీకే పట్టుబడుతోంది. కరెంటు ఇవ్వకున్నా తమకు మాత్రం ఠంచనుగా ప్రతి నెలా 10 కోట్లు బిల్లు ఇవ్వాల్సిందేనని ట్రాన్స్‌కోను సతాయిస్తోంది. ఇందుకోసం బ్యాంకులకు ట్రాన్స్‌కో సమర్పించిన లెటర్ ఆఫ్ క్రెడిట్‌లు (ఎల్‌ఓసీ) చూపిస్తూ బ్యాంకుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటోంది.ఇప్పటికే ఇలా 90 కోట్లు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. జీవీకే వైఖరిపై ట్రాన్స్‌కో న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే... గ్యాసు ఆధారిత జీవీకే విద్యుత్ ప్లాంటుతో 1999లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ట్రాన్స్‌కో కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం మేరకు....85 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) మేరకు స్థిర చార్జీలను (ఫిక్స్‌డ్ చార్జీలు) ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 85 శాతానికి తగ్గినా, పెరిగినా... ఆ లెక్కలను ఏడాది చివరన సర్దుబాటు చేసుకోవాలని ఒప్పందం కుదిరింది. ఈ మేరకు స్థిర చార్జీలను బ్యాంకు ద్వారా ప్రతీ నెలా చెల్లించే విధంగా ఎల్‌సీలను జీవీకేకు ట్రాన్స్‌కో జారీచేసింది. జీవీకేకు ప్రతీ నెలా 10 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, గత ఏడాది నుంచి రోజురోజుకీ గ్యాసు సరఫరా తగ్గిపోతోంది. మార్చి 1 నుంచి గ్యాసు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశమే లేదు. అయినప్పటికీ స్థిరచార్జీల రూపంలో తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని జీవీకే పట్టుబడుతోంది. ఎల్‌సీలను చూపిస్తూ... తమకు డబ్బు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిపై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు తెస్తోంది.
మొదట తమకు డబ్బులు చెల్లించాల్సిందేనని... ఆర్థిక సంవత్సరం చివర్లో లెక్కలు చూసుకుందామని జీవీకే అంటున్నట్టు సమాచారం. అయితే, విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినప్పటికీ, ఇప్పటికే ఎల్‌సీల పేరుతో బ్యాంకు నుంచి జీవీకే 90 కోట్ల మేర నగదు డ్రా చేసినట్లు తెలిసింది. మొత్తం 210 కోట్లు రావాల్సి ఉందని అంటున్నట్టు తెలిసింది. విద్యుత్ ఉత్పత్తి జరిగితే బిల్లుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉండేదని ట్రాన్స్‌కో వర్గాలు అంటున్నాయి. గ్యాస్ లేక విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంతో ఈ మొత్తాన్ని జీవీకే నుంచి వసూలు చేయడం పెద్ద సమస్యగా మారిందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా నగదు వసూలు చేసుకునేందుకు జీవీకే యత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ట్రాన్స్‌కోను జీవీకే తీరు మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జీవీకేపై న్యాయపోరాటానికి ట్రాన్స్‌కో సిద్ధమవుతుండగా, అలాంటి చర్యలు వద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రజాధనం జీవీకే పరం
Published Thu, Oct 17 2013 2:35 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement