ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం! | CBI Filed Case On GVK Group | Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!

Published Fri, Jul 3 2020 2:25 AM | Last Updated on Fri, Jul 3 2020 8:13 AM

CBI Filed Case On GVK Group - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)కు చెందిన రూ. 705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముంబై విభాగం కేసులు నమోదు చేసింది. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసి నట్లు అధికారులు తెలిపారు.

జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్, ముంబై ఎయిర్‌పోర్టు లిమి టెడ్, జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ జీవీ కృష్ణారెడ్డి, ఎంఐ ఏఎల్‌ ఎండీ జీవీ సంజయ్‌రెడ్డి, ఐశ్వర్యగిరి కన్‌స్ట్ర క్షన్స్, కోటా ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్, మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అభియోగాలతోపాటు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471, పీసీ యాక్ట్‌ 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్‌లలోని జీవీకే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిపారు.

ఏం జరిగింది?
దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్‌ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) పేరిట జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి.

2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్‌ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి.

అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్‌ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్‌స్టక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్‌ ఇన్‌ఫ్రా ఇంజనీర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్‌ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement