కోవిడ్-19 కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలలో విమానాశ్రయాల అభివృద్ధిపై అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ పునరాలోచలో పడినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, త్రివేండ్రం, జైపూర్, గువాహటి విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఇప్పటికే గెలుచుకుంది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతలను స్వీకరించలేమంటూ ప్రభుత్వ అధీకృత సంస్థకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రయివేటీకరణ జరిగిన ఈ మూడు విమానాశ్రయాలకు సంబంధించిన ఆస్తుల బదిలీ ఫీజు చెల్లింపు గడువును వాయిదా వేయమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)ని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. రూ. 1,000 కోట్లకుపైగా ఫీజును ఆగస్టులో చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో
ఈ ఏడాది ఫిబ్రవరి 14న మూడు విమానాశ్రయాలపై ఏఏఐతో అదానీ గ్రూప్ కన్‌సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వీటి నిర్వహణ, అభివృద్ధి తదితరాలను చేపట్టవలసి ఉంటుంది. 2018లో అదానీ గ్రూప్ ఆరు విమానాశ్రయ ప్రాజెక్టులను గెలుచుకుంది. వీటిలో త్రివేండ్రం, జైపూర్, గువాహటి ఉన్నప్పటికీ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు మాత్రమే కన్‌సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరు ఎయిర్‌పోర్టులకుగాను మొత్తం రూ. 2,000 కోట్లకుపైగా అసెట్ ట్రాన్స్‌ఫర్ ఫీజును చెల్లించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కాగా.. కోవిడ్-19తో తలెత్తిన సమస్యల నేపథ్యంలో నవీముంబై ప్రాజెక్టుపై జీవీకే గ్రూప్ సైతం కొంతమేర వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 16,000 కోట్ల నవీముంబై ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆలస్యంగా ప్రారంభించేందుకు అనుమతించమంటూ సిడ్కోను అభ్యర్ధించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశాలపై అటు అదానీ గ్రూప్, ఇటు జీవీకే గ్రూప్ స్పందించలేదని నిపుణులు పేర్కొన్నారు.
చిన్న ఎయిర్‌పోర్టులకు కోవిడ్-19 షాక్
Published Thu, Jun 4 2020 10:14 AM | Last Updated on Thu, Jun 4 2020 10:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment