Airport Developers
-
GMR: నాగ్‌పూర్ విమానాశ్రయం ఆధునీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. ‘వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్‌పూర్‌తో (మిహా న్) జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్ట్‌కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది. -
చిన్న ఎయిర్‌పోర్టులకు కోవిడ్-19 షాక్
కోవిడ్-19 కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలలో విమానాశ్రయాల అభివృద్ధిపై అదానీ గ్రూప్, జీవీకే గ్రూప్ పునరాలోచలో పడినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, త్రివేండ్రం, జైపూర్, గువాహటి విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఇప్పటికే గెలుచుకుంది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతలను స్వీకరించలేమంటూ ప్రభుత్వ అధీకృత సంస్థకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రయివేటీకరణ జరిగిన ఈ మూడు విమానాశ్రయాలకు సంబంధించిన ఆస్తుల బదిలీ ఫీజు చెల్లింపు గడువును వాయిదా వేయమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)ని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. రూ. 1,000 కోట్లకుపైగా ఫీజును ఆగస్టులో చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మూడు విమానాశ్రయాలపై ఏఏఐతో అదానీ గ్రూప్ కన్సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వీటి నిర్వహణ, అభివృద్ధి తదితరాలను చేపట్టవలసి ఉంటుంది. 2018లో అదానీ గ్రూప్ ఆరు విమానాశ్రయ ప్రాజెక్టులను గెలుచుకుంది. వీటిలో త్రివేండ్రం, జైపూర్, గువాహటి ఉన్నప్పటికీ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు మాత్రమే కన్సెషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరు ఎయిర్‌పోర్టులకుగాను మొత్తం రూ. 2,000 కోట్లకుపైగా అసెట్ ట్రాన్స్ఫర్ ఫీజును చెల్లించవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కాగా.. కోవిడ్-19తో తలెత్తిన సమస్యల నేపథ్యంలో నవీముంబై ప్రాజెక్టుపై జీవీకే గ్రూప్ సైతం కొంతమేర వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 16,000 కోట్ల నవీముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆలస్యంగా ప్రారంభించేందుకు అనుమతించమంటూ సిడ్కోను అభ్యర్ధించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశాలపై అటు అదానీ గ్రూప్, ఇటు జీవీకే గ్రూప్ స్పందించలేదని నిపుణులు పేర్కొన్నారు. -
ఐపీవోకి జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్
ముంబై: ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగమైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సన్నద్ధమవుతోంది. సుమారు 250 మిలియన్ డాలర్లు సమీకరించేందుకు త్వరలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు సమాచారం. ఇష్యూ బాధ్యతలను సిటీగ్రూప్, యాక్సిస్ క్యాపిటల్ తదితర సంస్థలకు అప్పగించినట్లు తెలిసింది. ఇదే జరిగితే దేశీయంగా లిస్టయిన తొలి విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీవీకే ఎయిర్‌పోర్టే కానుంది. ఐపీవో నిధుల్లో కొంత భాగాన్ని కంపెనీ రుణభారం తగ్గించుకునేందుకు, విస్తరణ కార్యకలాపాలకు ఉపయోగించుకోనుంది. జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.