ఐపీవోకి జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్
ముంబై: ఇన్‌ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో భాగమైన జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సన్నద్ధమవుతోంది. సుమారు 250 మిలియన్ డాలర్లు సమీకరించేందుకు త్వరలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు సమాచారం. ఇష్యూ బాధ్యతలను సిటీగ్రూప్, యాక్సిస్ క్యాపిటల్ తదితర సంస్థలకు అప్పగించినట్లు తెలిసింది. ఇదే జరిగితే దేశీయంగా లిస్టయిన తొలి విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీవీకే ఎయిర్‌పోర్టే కానుంది. ఐపీవో నిధుల్లో కొంత భాగాన్ని కంపెనీ రుణభారం తగ్గించుకునేందుకు, విస్తరణ కార్యకలాపాలకు ఉపయోగించుకోనుంది. జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.