ఎయిర్‌పోర్ట్ వ్యాపారానికి నిధుల సమీకరణలో జీవీకే
న్యూఢిల్లీ : ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం రుణభారాన్ని తగ్గించుకునే దిశగా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు మౌలిక రంగ సంస్థ జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి తెలిపారు. అయితే, సంస్థను లిస్టింగ్ చేసే ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. లిస్టింగ్ ద్వారా జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించనున్న వార్తలపై స్పందిస్తూ సంజయ్ రెడ్డి ఈ వివరాలు తెలిపారు.
సుమారు రూ. 20,000 కోట్ల రుణభారం గల జీవీకే గ్రూప్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. మరోవైపు విదేశాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇండొనేషియా, ఆఫ్రికాలో అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సంజయ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండొనేషియాలో జీవీకే ఇప్పటికే రెండు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తోంది.