పార్లమెంటు ప్రతిష్టంభనపై కదిలిన కార్పొరేట్లు
కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుతూ ఆన్లైన్ పిటీషన్
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొనడంపై కార్పొరేట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరుతూ భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఆన్లైన్ పిటీషన్ రూపొందించింది. రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, కిరణ్ మజుందార్-షా తదితర పారిశ్రామిక దిగ్గజాలు సహా 17,000 మంది దీనిపై సంతకాలు చేశారు. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, హీరో గ్రూప్‌నకు చెందిన సునీల్ కాంత్ ముంజల్ .. పవన్ ముంజల్, పుంజ్ లాయిడ్ చైర్మన్ అతుల్ పుంజ్ మొదలైన వారు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
పార్లమెంటు సక్రమంగా నడవకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుందని సీఐఐ పేర్కొంది. ఇటీవలి పరిణామాలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయని, పార్లమెంటుపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండూ కూడా కీలకమైనవేనని, రాజకీయాంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండింటిపైనా ఉందని తెలిపింది.