హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేజీ బేసిన్ నుంచి తమకు గ్యాస్ సరఫరా ఆగిపోయిన నేపథ్యంలో గౌతమి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తికి హై స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ)ని ఉపయోగించేందుకు అనుమతించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను జీవీకే గ్రూప్ కోరింది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, హెచ్‌ఎస్‌డీని భారీగా వినియోగించడం పర్యావరణానికి మంచిది కాదని భావించిన పర్యావరణ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ .. దీనిపై చమురు శాఖ అభిప్రాయాలు తెలుసుకోవాలని కంపెనీకి సూచించింది. గౌతమి పవర్ ప్రాజెక్టు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉంది. కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో రోజుకు దాదాపు 1.96 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) పరిమాణాన్ని కేంద్రం గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. 2009 నుంచి 2011 దాకా ప్లాంటు పూర్తి స్థాయిలో పనిచేసింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి నానాటికి తగ్గిపోతుండటంతో.. గతేడాది మార్చ్ నుంచి విద్యుత్ కంపెనీలకు గ్యాస్ సరఫరా నిల్చిపోయింది. దీంతో జీవీకే సహా పలు పవర్ ప్రాజెక్టులు నిరుపయోగంగా పడి ఉన్నాయి.