KG-basin
-
జీఎస్పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు
⇒ ఓఎన్జీసీ బోర్డు ఓకే ⇒ డీల్ విలువ దాదాపు రూ. 8,000 కోట్లు న్యూఢిల్లీ: కేజీ–బేసిన్‌లోని గ్యాస్ బ్లాక్‌లో జీఎస్పీసీకి ఉన్న మొత్తం 80 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,000 కోట్లు). 2014 ఆగస్టు నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తున్న కేజీ–ఓఎస్ఎన్–2001/3 బ్లాక్‌లోని మూడు అన్వేషణ క్షేత్రాలకు 995.26 మిలియన్ డాలర్లు ఓఎన్జీసీ చెల్లించనుంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు డిస్కవరీలకు 200 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈ ఆరు క్షేత్రాల అభివృద్ధికయ్యే వ్యయాలు కూడా ఓఎన్జీసీనే భరించాల్సి ఉంటుంది. ఈ వ్యయాలు కనీసం మరికొన్ని బిలియన్ డాలర్ల మేర ఉంటాయని అంచనా. రుణభారంతో కుంగుతున్న గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ)కి కేజీ–బేసిన్ బ్లాక్‌లో ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ గతేడాది డిసెంబర్ 23న అంగీకరించింది. 2015 మార్చి 31 నాటికి జీఎస్పీసీ రుణభారం దాదాపు రూ. 19,716.27 కోట్ల మేర ఉంది. జీఎస్పీసీ ఇప్పటిదాకా బంగాళాఖాతంలో 9 గ్యాస్ క్షేత్రాలను కనుగొంది. వీటిలో మూడింటి (దీన్‌దయాళ్ వెస్ట్–డీడీడబ్ల్యూ) అభివృద్ధికి అనుమతులు లభించాయి. ప్రభుత్వానికి సమర్పించిన క్షేత్రాల అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్డీపీ) ప్రకారం 2.75 బిలియన్ డాలర్ల వ్యయానికి అనుమతులు ఉన్నప్పటికీ .. వాస్తవంగా వ్యయాలు 2.83 బిలియన్ డాలర్లు దాటాయి. అన్వేషణకు సంబంధించి మరో 585 మిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యింది. దీంతో 2015 మార్చి ఆఖరు నాటికి మొత్తం వ్యయం 3.41 బిలియన్ డాలర్లకు చేరింది. ఎఫ్డీపీ ప్రకారం మరో 12 బావుల తవ్వకం పూర్తి చేయాలి. దీంతో ప్రాజెక్టు వ్యయం మరింతగా పెరగనుంది. 2014 ఆగస్టులో డీడీడబ్ల్యూలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించారు. -
గౌతమి పవర్ ప్రాజెక్టులో హెచ్ఎస్డీకి అనుమతించండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేజీ బేసిన్ నుంచి తమకు గ్యాస్ సరఫరా ఆగిపోయిన నేపథ్యంలో గౌతమి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తికి హై స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)ని ఉపయోగించేందుకు అనుమతించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను జీవీకే గ్రూప్ కోరింది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, హెచ్‌ఎస్‌డీని భారీగా వినియోగించడం పర్యావరణానికి మంచిది కాదని భావించిన పర్యావరణ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ .. దీనిపై చమురు శాఖ అభిప్రాయాలు తెలుసుకోవాలని కంపెనీకి సూచించింది. గౌతమి పవర్ ప్రాజెక్టు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉంది. కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో రోజుకు దాదాపు 1.96 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) పరిమాణాన్ని కేంద్రం గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. 2009 నుంచి 2011 దాకా ప్లాంటు పూర్తి స్థాయిలో పనిచేసింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి నానాటికి తగ్గిపోతుండటంతో.. గతేడాది మార్చ్ నుంచి విద్యుత్ కంపెనీలకు గ్యాస్ సరఫరా నిల్చిపోయింది. దీంతో జీవీకే సహా పలు పవర్ ప్రాజెక్టులు నిరుపయోగంగా పడి ఉన్నాయి.