ఆ 10 కంపెనీల అప్పు .. రూ. 6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజాల రుణభారం నానాటికీ పెరిగిపోతోంది. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) సహా జీఎంఆర్, జీవీకే, ల్యాంకో వంటి మొత్తం పది కంపెనీల అప్పుల భారం గత ఆర్థిక సంవత్సరం 15 శాతం పెరిగి రూ. 6 లక్షల కోట్లు మించిపోయింది. లాభదాయకత అంతంత మాత్రంగా ఉండటం కంపెనీలను కుదేలు చేస్తోంది. క్రెడిట్ సూసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి పది గ్రూప్స్ మొత్తం రుణ భారం రూ. 6,31,025 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 5,47,361 కోట్లు. ఈ జాబితాలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ (అడాగ్), వేదాంత, ఎస్సార్, అదానీ, వీడియోకాన్, జేపీ అసోసియేట్స్, జేఎస్‌డబ్ల్యూ కూడా ఉన్నాయి. చాలా మటుకు కంపెనీల రుణభారం..వాటి పెట్టుబడి వ్యయాలను మించిపోయిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇప్పటికే ల్యాంకో, జేపీ అసోసియేట్స్, అడాగ్ కంపెనీలు రుణ పునర్‌వ్యవస్థీకరణ బాట పట్టడం వాటిపై ఉన్న వత్తిడిని తెలియజేస్తుందని తెలిపింది.
రూపాయి క్షీణతతో మరింత పైకి..
జీవీకే, ల్యాంకో, అడా సంస్థల రుణభారం అత్యధికంగా దాదాపు 24 శాతం దాకా పెరిగిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీన్ని తగ్గించుకోవడానికి ఆయా కంపెనీలు వివిధ ఆస్తుల విక్రయాన్ని చేపట్టినప్పటికీ.. పూర్తి స్థాయిలో సాకారం కావడం లేదని వివరించింది. జీఎంఆర్, వీడియోకాన్ మాత్రమే ఈ ప్రయత్నాల్లో కాస్త సఫలమైనట్లు తెలిపింది. రూపాయి క్షీణత, ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు మొదలైన అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీల రుణభారం మరింతగా పెరిగే అవకాశముందని క్రెడిట్ సూసీ తెలిపింది. దీంతో అటు బ్యాంకుల అసెట్ క్వాలిటీపైనా మరింత భారం పడగలదని హెచ్చరించింది. చాలా కార్పొరేట్ల రుణాలు 40-70 శాతం మేర విదేశీ కరెన్సీ రూపంలోనే ఉన్న నేపథ్యంలో రూపాయి మరింత క్షీణిస్తే.. అప్పుల భారమూ పెరుగుతుందని క్రెడిట్ సూసీ పేర్కొంది. అత్యధిక విదేశీ రుణాలు ఉన్న సంస్థల్లో అదానీ ఎంటర్‌ప్రైజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అయితే, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, అదానీ పవర్, రిలయన్స్ పవర్ ప్రాజెక్టులు గానీ అమల్లోకి వస్తే వాటి ఆపరేటింగ్ సామర్ధ్యం రెట్టింపై, కొంత ఊరట లభించగలదని క్రెడిట్ సూసీ తెలిపింది.