Lanco
-
పెండింగ్ డీల్స్‌కు మోక్షం.. ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్‌కు ఆమోదం తెలిపింది. కీమెడ్‌లో 20 శాతం వాటాను ప్రైమ్ టైమా లాజిస్టిక్స్ టెక్నాలజీస్ ద్వారా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్ (ఎల్ఏపీఎల్)ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. కీమెడ్ ప్రధానంగా ఔషధాల హోల్‌సేల్ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్మాన్ ఇంటర్నేషనల్‌ను ఆర్చ్‌రోమా ఆపరేషన్స్ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్ పోర్ట్స్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్ 3 వరకు పెండింగ్‌లో ఉన్న డీల్స్‌ను సీసీఐ క్లియర్ చేసినట్లయింది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్ 25న చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్ పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది. -
లాక్డౌన్: ల్యాంకో ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
తిరుపతి : లాక్డౌన్ కారణంగా కనీస వసతులు లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని లాంక్యో ఫ్యాక్టరీ కార్మికులు ధర్నాకు దిగారు. దాదాపు రెండు వేల మంది వలస కార్మికులు శనివారం సాయంత్రం ఫ్యాక్టరీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమను స్వంత రాష్టాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేదని వలస కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బొజ్జల అనుచరులు తమను వేధిస్తున్నారని, వారే యూనియన్ నాయకులుగా వుంటూ అరాచకం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించని తమను స్వరాష్ట్రం పంపిచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లాక్డౌన్లో కనీస సదుపాయాలు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. (డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!) -
‘లగడపాటి’ కంపెనీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.313.1 కోట్ల అప్పును చెల్లించే పరిస్థితిలో సంస్థ లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ–హైదరాబాద్) తేల్చింది. దాంతో దివాలా ప్రక్రియను (ఐసీపీఆర్) ప్రారంభిస్తున్నట్లు పేర్కొం ది. హుజేఫా సితాబ్ఖాన్ను దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించింది. ‘‘ల్యాంకో తీస్థా తన ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు వం టివి చేయరాదు. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ఐఆర్పీ ప్రకటన ఇవ్వాలి. ఇన్సాల్వెన్సీ, బ్యాం క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్సైట్లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా ప్రకటనలివ్వాలి. రుణదాతలతో కమిటీ వేసి సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి’’ అని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యుడు విత్తనాల రాజేశ్వరరావు ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సిక్కింలో తీస్థా నదిపై 500 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలో పలు బ్యాంకుల నుంచి 2007లో ల్యాంకో రూ.400 కోట్ల రుణం తీసుకుంది. రుణం చెల్లించకపోవడంతో ల్యాంకో రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ ఐసీఐసీఐ నేతృత్వంలోని బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) నోటీసు జారీ చేసింది. 2017 నవంబర్ 30 నాటికి రుణ బకాయి రూ.313.1 కోట్లకు చేరింది. హైడ్రో ఎలక్ట్రికల్, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాల పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లడంతో తమకు తీరని నష్టం కలిగిందన్న ల్యాంకో తీస్థా న్యాయవాది రవికుమార్ వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. -
అప్పుల కుప్పలు... ఈ పవర్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. వీటిలో ల్యాంకోకి చెందిన ప్రాజెక్టులు 4, జీఎంఆర్ ఎనర్జీకి చెందినవి మూడు, జీవీకే ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్టాండింగ్ కమిటీ (విద్యుత్ రంగం) ఈ విషయాలు పొందుపర్చింది. 2017 జూన్ నాటికి ఆర్బీఐ గణాంకాల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 1.74 లక్షల కోట్లుగా ఉంది. అదానీ, ఎస్సార్, జేపీ ప్రాజెక్టులు కూడా వీటిలో ఉన్నాయి. నివేదిక ప్రకారం ల్యాంకోకి చెందిన అమర్ కంటక్ ప్రాజెక్టు రుణ బకాయి రూ.8,782 కోట్లు, అన్పారా (రూ. 3,071 కోట్లు), విదర్భ (రూ. 4,762 కోట్లు), బాబంధ్ రుణాలు రూ. 6,976 కోట్లు మేర ఉన్నాయి. అటు జీఎంఆర్ ఎనర్జీ వరోరా ప్రాజెక్టు రుణభారం రూ. 2,905 కోట్లు, రాయ్ఖేడా (రూ. 8,174 కోట్లు), కమలాంగా ప్రాజెక్టు రుణం రూ. 4,100 కోట్లుగా ఉంది. జీవీకే ఇండస్ట్రీస్‌కి చెందిన గోయింద్వాల్ సాహెబ్ ప్రాజెక్టు బకాయిలు రూ. 3,523 కోట్ల మేర ఉన్నాయి. కేఎస్కే మహానది పవర్ కంపెనీకి చెందిన అకల్తారా ప్రాజెక్టు రుణభారం ఏకంగా రూ. 17,194 కోట్లు ఉంది. అదానీ గ్రూప్, జేపీ గ్రూప్‌కి చెందిన కొన్ని ప్రాజెక్టుల రుణ బాకీలు రూ. 11,000 కోట్ల పైగా ఉన్నాయి. -
‘ల్యాంకో’ దివాలా..!
♦ ఈ నెల్లోనే ‘కంపెనీ లా ట్రైబ్యునల్’ చర్యలు ♦ సబ్‌కాంట్రాక్టర్ల బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకున్న తీరు ♦ దీనిపై కోర్టుకెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభంకానున్నాయి. భారీగా అప్పులున్న 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ల్యాంకో ఇన్ఫ్రాకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ల్యాంకో ఇన్ఫ్రా మొత్తం అప్పుల విలువ రూ.44,365 కోట్లు ఉండగా, అందులో ఐడీబీఐ బ్యాంక్‌కే రూ.11,367 కోట్లు బాకీపడింది. దేశీయ దివాలా చట్టం ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ల్యాంక్ఇన్ఫ్రాపై దివాలా పిటీషన్‌ను దాఖలు చేయాలని ఈ కన్సార్షియం నిర్ణయించింది. ఈ కేసును ఈ నెలాఖరులోగా ట్రైబ్యునల్ విచారణకు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6–9 నెలల్లో కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలు రాబట్టుకునే అవకాశం ఉంది. 2015లో కంపెనీ విలువ రూ. 25,000 కోట్లుగా ఉన్నట్లు ల్యాంకో ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. కోర్టుకు వెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు ల్యాంక్ ఇన్ఫ్రా నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు కంపెనీపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఒకవంక పనులు చేపట్టడానికి అడ్వాన్స్‌లు మంజూరు చేయకుండా... మరోవంక పనులు ఆలస్యమయ్యాయనే సాకుతో తామిచ్చిన బ్యాంక్ గ్యారెంటీలను నగదుగా మార్చేసుకుని తమను మోసం చేసిందంటూ ల్యాంకోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాంక్ ఇన్ఫ్రా అడ్వాన్స్‌లు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో పనులు ఆలస్యమయ్యాయని, కానీ దీనికి భిన్నంగా కంపెనీ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం పని పూర్తి కాలేదంటూ బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకుందని వీరు చెబుతున్నారు. ఈ విషయంపై కెల్వియన్ ఇండియా, పెంటైర్ వాల్వ్స్ అండ్ కంట్రోల్స్, వాస్ ఆటోమేషన్, ఎమర్సెన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇండియా వంటి సబ్ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరోవంక హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్ సంస్థ 2,520 మెగావాట్ల అనప్పుర్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయనందుకు ల్యాంకో ఇన్ఫ్రా ఇచ్చిన రూ.500 కోట్లను నగదుగా మార్చేసుకుంది. దీనిపై ల్యాంకో ఇన్ఫ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. -
వేలంలో ల్యాంకో, దబోల్ ప్రాజెక్టులకు గ్యాస్
న్యూఢిల్లీ: ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు తాజా వేలంలో గణనీయ స్థాయిలో గ్యాస్‌ను దక్కించుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ గ్యాస్‌ను ఈ వేలానికి పెట్టగా 3.11 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ల్యాంకో సంస్థకు దక్కింది. దబోల్ ప్రాజెక్ట్ 2.43 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ 9.93 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఆరు నెలల పాటు మార్చి వరకు సరఫరా చేసేందుకు వీలుగా శనివారం వేలం నిర్వహించింది. 9 ప్లాంట్లు తక్కువ బిడ్డర్లుగా జాబితాలో నిలిచి గ్యాస్ కేటాయింపులను దక్కించుకున్నాయి. పయోనీర్ గ్యాస్ పవర్‌కు 1.08, జీఎంఆర్ వేమగిరి పవర్ జనరేషన్‌కు 1.03 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ లభించింది. జీవీకే ఇండస్ట్రీస్‌కు కూడా 0.63 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్, పాండురంగ ఎనర్జీ సిస్టమ్స్‌కు 0.32 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ కోటా లభించింది. ఆరు నెలల కాలంలో ఈ తొమ్మిది విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 881 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేయడంతోపాటు యూనిట్‌ను రూ.4.70 అంతకంటే తక్కువ ధరకు సరఫరా చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
బ్యాంకుల చేతికి ల్యాంకో..?
♦ ఐవీఆర్సీఎల్ మాదిరే అడుగులేస్తున్న బ్యాంకులు ♦ రుణాలకు బదులుగా వాటాలు పొందే యత్నాలు ♦ తొలుత విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టే యోచన ♦ చర్చలు జరుగుతున్నాయని ధ్రువీకరించిన ల్యాంకో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రానికి చెందిన మరో కంపెనీ చేజారిపోనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా సంస్థ బ్యాంకుల చేతుల్లోకి వెళ్లగా... తాజాగా మరో కంపెనీ ల్యాంకో ఇన్ఫ్రా కూడా అదే దార్లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రాలో బ్యాంకులు మెజారిటీ వాటా తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం ప్రత్యేకంగా సమావేశమై, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వినవస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ వ్యాపార విభాగాన్ని విడగొట్టి, బయటి నుంచి వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని కంపెనీకి బ్యాంకులు వివరించాయి కూడా. పెరిగిపోతున్న మొండి బకాయిలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో రుణాలు రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కంపెనీలకిచ్చిన రుణాలు సత్వరం వసూలయ్యే అవకాశాలు కనిపించకపోతే రుణాలను వాటాలుగా మార్చుకుంటూ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు దిగుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూప్ రుణ భారం రూ.39,980 కోట్ల మేర ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని తొమ్మిది బ్యాంకులు (ఎస్డీఆర్) దీన్ని వాటాగా మార్చుకునే ప్రయత్నాలు ఆరంభించాయి. ఇప్పుడిప్పుడే లాభాల్లోకి... భారీ అప్పుల్లో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రాకు చెందిన రూ.7,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించడంపై అప్పట్లో పెద్ద దుమారం రేగటం తెలిసిందే. అలా చేసినా, ఆస్తులు సైతం విక్రయించినా రుణ భారం తగ్గకపోవటంతో ఎస్‌డీఆర్‌కు తెరలేపాయి. ప్రస్తుతం ల్యాంకో గ్రూప్‌లో 50కి పైగా అనుబంధ సంస్థలున్నాయి. వీటిలో ప్రమోటర్లకు 70.55 శాతం వాటాలుండగా, సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు 29 శాతం మేర వాటాలున్నాయి. పనితీరు క్రమంగా మెరుగుపర్చుకుంటూ ల్యాంకో ఇన్ఫ్రా ఇటీవలే మూడో త్రైమాసికంలో రూ. 2,282 కోట్ల స్థూల ఆదాయంపై రూ.136 కోట్ల లాభం ఆర్జించింది. 2014 డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం రూ.62 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత నాలుగేళ్లలో ఆస్తుల విక్రయం ద్వారా సంస్థ రూ.6,950 కోట్లు సమీకరించింది. ఇందులో సింహభాగం .. సుమారు రూ. 6,300 కోట్లు ఉడిపి పవర్ ప్రాజెక్టును అదానీ పవర్‌కి విక్రయించడం ద్వారా వచ్చినవే. చర్చలు జరుగుతున్నాయి.. మార్కెట్ ప్రచారంపై కంపెనీ స్పందించింది. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) స్కీము కింద, గతంలో రుణదాతలు ఆమోదించిన ఇతరత్రా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఆస్తుల్ని విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ వివరణిచ్చింది. సుమారు 8,000 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్ధ్యం గల విద్యుత్ విభాగం పోర్ట్‌ఫోలియోకి సంబంధించి హోల్డింగ్ స్థాయిలో గానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. తాజా పరిణామాలతోమంగళవారం బీఎస్ఈలో ల్యాంకో ఇన్ఫ్రా షేరు సుమారు 4% పెరిగి రూ. 5.06 వద్ద ముగిసింది. -
ఆ 10 కంపెనీల అప్పు .. రూ. 6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజాల రుణభారం నానాటికీ పెరిగిపోతోంది. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) సహా జీఎంఆర్, జీవీకే, ల్యాంకో వంటి మొత్తం పది కంపెనీల అప్పుల భారం గత ఆర్థిక సంవత్సరం 15 శాతం పెరిగి రూ. 6 లక్షల కోట్లు మించిపోయింది. లాభదాయకత అంతంత మాత్రంగా ఉండటం కంపెనీలను కుదేలు చేస్తోంది. క్రెడిట్ సూసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి పది గ్రూప్స్ మొత్తం రుణ భారం రూ. 6,31,025 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 5,47,361 కోట్లు. ఈ జాబితాలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ (అడాగ్), వేదాంత, ఎస్సార్, అదానీ, వీడియోకాన్, జేపీ అసోసియేట్స్, జేఎస్‌డబ్ల్యూ కూడా ఉన్నాయి. చాలా మటుకు కంపెనీల రుణభారం..వాటి పెట్టుబడి వ్యయాలను మించిపోయిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇప్పటికే ల్యాంకో, జేపీ అసోసియేట్స్, అడాగ్ కంపెనీలు రుణ పునర్వ్యవస్థీకరణ బాట పట్టడం వాటిపై ఉన్న వత్తిడిని తెలియజేస్తుందని తెలిపింది. రూపాయి క్షీణతతో మరింత పైకి.. జీవీకే, ల్యాంకో, అడా సంస్థల రుణభారం అత్యధికంగా దాదాపు 24 శాతం దాకా పెరిగిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీన్ని తగ్గించుకోవడానికి ఆయా కంపెనీలు వివిధ ఆస్తుల విక్రయాన్ని చేపట్టినప్పటికీ.. పూర్తి స్థాయిలో సాకారం కావడం లేదని వివరించింది. జీఎంఆర్, వీడియోకాన్ మాత్రమే ఈ ప్రయత్నాల్లో కాస్త సఫలమైనట్లు తెలిపింది. రూపాయి క్షీణత, ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు మొదలైన అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీల రుణభారం మరింతగా పెరిగే అవకాశముందని క్రెడిట్ సూసీ తెలిపింది. దీంతో అటు బ్యాంకుల అసెట్ క్వాలిటీపైనా మరింత భారం పడగలదని హెచ్చరించింది. చాలా కార్పొరేట్ల రుణాలు 40-70 శాతం మేర విదేశీ కరెన్సీ రూపంలోనే ఉన్న నేపథ్యంలో రూపాయి మరింత క్షీణిస్తే.. అప్పుల భారమూ పెరుగుతుందని క్రెడిట్ సూసీ పేర్కొంది. అత్యధిక విదేశీ రుణాలు ఉన్న సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అయితే, జీఎంఆర్ ఇన్ఫ్రా, అదానీ పవర్, రిలయన్స్ పవర్ ప్రాజెక్టులు గానీ అమల్లోకి వస్తే వాటి ఆపరేటింగ్ సామర్ధ్యం రెట్టింపై, కొంత ఊరట లభించగలదని క్రెడిట్ సూసీ తెలిపింది.