బ్యాంకుల చేతికి ల్యాంకో..? | Lanco Infratech looking for strategic partner in power projects | Sakshi
Sakshi News home page

బ్యాంకుల చేతికి ల్యాంకో..?

Published Wed, Apr 13 2016 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

బ్యాంకుల చేతికి ల్యాంకో..?

బ్యాంకుల చేతికి ల్యాంకో..?

ఐవీఆర్‌సీఎల్ మాదిరే అడుగులేస్తున్న బ్యాంకులు
రుణాలకు బదులుగా వాటాలు పొందే యత్నాలు
తొలుత విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టే యోచన
చర్చలు జరుగుతున్నాయని ధ్రువీకరించిన ల్యాంకో

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రానికి చెందిన మరో కంపెనీ చేజారిపోనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా సంస్థ బ్యాంకుల చేతుల్లోకి వెళ్లగా... తాజాగా మరో కంపెనీ ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా అదే దార్లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాలో బ్యాంకులు మెజారిటీ వాటా తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం ప్రత్యేకంగా సమావేశమై, పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వినవస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ వ్యాపార విభాగాన్ని విడగొట్టి, బయటి నుంచి వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని కంపెనీకి బ్యాంకులు వివరించాయి కూడా. పెరిగిపోతున్న మొండి బకాయిలపై  సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో రుణాలు రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కంపెనీలకిచ్చిన రుణాలు సత్వరం వసూలయ్యే అవకాశాలు కనిపించకపోతే రుణాలను వాటాలుగా మార్చుకుంటూ వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణకు దిగుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూప్ రుణ భారం రూ.39,980 కోట్ల మేర ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని తొమ్మిది బ్యాంకులు (ఎస్‌డీఆర్) దీన్ని వాటాగా మార్చుకునే ప్రయత్నాలు ఆరంభించాయి.

 ఇప్పుడిప్పుడే లాభాల్లోకి...
భారీ అప్పుల్లో ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాకు చెందిన రూ.7,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించడంపై అప్పట్లో పెద్ద దుమారం రేగటం తెలిసిందే. అలా చేసినా, ఆస్తులు సైతం విక్రయించినా రుణ భారం తగ్గకపోవటంతో ఎస్‌డీఆర్‌కు తెరలేపాయి. ప్రస్తుతం ల్యాంకో గ్రూప్‌లో 50కి పైగా అనుబంధ సంస్థలున్నాయి. వీటిలో ప్రమోటర్లకు 70.55 శాతం వాటాలుండగా, సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు 29 శాతం మేర వాటాలున్నాయి. పనితీరు క్రమంగా మెరుగుపర్చుకుంటూ ల్యాంకో ఇన్‌ఫ్రా ఇటీవలే మూడో త్రైమాసికంలో రూ. 2,282 కోట్ల స్థూల ఆదాయంపై రూ.136 కోట్ల లాభం ఆర్జించింది. 2014 డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం రూ.62 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత నాలుగేళ్లలో ఆస్తుల విక్రయం ద్వారా సంస్థ రూ.6,950 కోట్లు సమీకరించింది. ఇందులో సింహభాగం .. సుమారు రూ. 6,300 కోట్లు ఉడిపి పవర్ ప్రాజెక్టును అదానీ పవర్‌కి విక్రయించడం ద్వారా వచ్చినవే.

చర్చలు జరుగుతున్నాయి..
మార్కెట్ ప్రచారంపై కంపెనీ స్పందించింది. కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ (సీడీఆర్) స్కీము కింద, గతంలో రుణదాతలు ఆమోదించిన ఇతరత్రా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఆస్తుల్ని విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ వివరణిచ్చింది. సుమారు 8,000 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్ధ్యం గల విద్యుత్ విభాగం పోర్ట్‌ఫోలియోకి సంబంధించి హోల్డింగ్ స్థాయిలో గానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.

 తాజా పరిణామాలతోమంగళవారం బీఎస్‌ఈలో ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు సుమారు 4% పెరిగి రూ. 5.06 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement