‘ల్యాంకో’ దివాలా..!
♦ ఈ నెల్లోనే ‘కంపెనీ లా ట్రైబ్యునల్’ చర్యలు
♦ సబ్‌కాంట్రాక్టర్ల బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకున్న తీరు
♦ దీనిపై కోర్టుకెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు
సాక్షి, అమరావతి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభంకానున్నాయి. భారీగా అప్పులున్న 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ల్యాంకో ఇన్‌ఫ్రాకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ల్యాంకో ఇన్‌ఫ్రా మొత్తం అప్పుల విలువ రూ.44,365 కోట్లు ఉండగా, అందులో ఐడీబీఐ బ్యాంక్‌కే రూ.11,367 కోట్లు బాకీపడింది.
దేశీయ దివాలా చట్టం ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ల్యాంక్‌ఇన్‌ఫ్రాపై దివాలా పిటీషన్‌ను దాఖలు చేయాలని ఈ కన్సార్షియం నిర్ణయించింది. ఈ కేసును ఈ నెలాఖరులోగా ట్రైబ్యునల్ విచారణకు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6–9 నెలల్లో కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలు రాబట్టుకునే అవకాశం ఉంది. 2015లో కంపెనీ విలువ రూ. 25,000 కోట్లుగా ఉన్నట్లు ల్యాంకో ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది.
కోర్టుకు వెళ్లనున్న సబ్‌కాంట్రాక్టర్లు
ల్యాంక్ ఇన్‌ఫ్రా నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు కంపెనీపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఒకవంక పనులు చేపట్టడానికి అడ్వాన్స్‌లు మంజూరు చేయకుండా... మరోవంక పనులు ఆలస్యమయ్యాయనే సాకుతో తామిచ్చిన బ్యాంక్ గ్యారెంటీలను నగదుగా మార్చేసుకుని తమను మోసం చేసిందంటూ ల్యాంకోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాంక్ ఇన్‌ఫ్రా అడ్వాన్స్‌లు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో పనులు ఆలస్యమయ్యాయని, కానీ దీనికి భిన్నంగా కంపెనీ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం పని పూర్తి కాలేదంటూ బ్యాంక్ గ్యారెంటీలను వాడేసుకుందని వీరు చెబుతున్నారు.
ఈ విషయంపై కెల్వియన్ ఇండియా, పెంటైర్ వాల్వ్స్ అండ్ కంట్రోల్స్, వాస్ ఆటోమేషన్, ఎమర్సెన్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఇండియా వంటి సబ్ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరోవంక హిందుస్థాన్ పవర్ ప్రాజెక్ట్స్ సంస్థ 2,520 మెగావాట్ల అనప్పుర్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయనందుకు ల్యాంకో ఇన్‌ఫ్రా ఇచ్చిన రూ.500 కోట్లను నగదుగా మార్చేసుకుంది. దీనిపై ల్యాంకో ఇన్‌ఫ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.