న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల్లో అవకతవకల వ్యవహారంలో జీవీకే గ్రూప్, ఎంఐఏఎల్ (ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్)లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ ధనార్జన కేసులు నమోదుచేసింది. రూ.705 కోట్ల ఈ అవకతవకలకు సంబంధించి అక్రమ ధనార్జన నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (పోలీస్ ఫస్ట్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్‌కు సమానం) దాఖలయినట్లు మంగళవారం ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇదే సంస్థలపై ఇటీవలి సీబీఐ ఎఫ్‌ఐఆర్ అధ్యయనం అనంతరం ఈడీ కేసులు దాఖలయ్యాయి.
నోటీస్ అందుకోలేదు: జీవీకే
ఇదిలావుండగా, ఈ కేసు విషయంలో తాము ఈడీ నుంచి ఎటువంటి నోటీసులూ అందుకోలేదని జీవీకే ప్రతినిధి ప్రకటించారు. ఈ కేసులో ఆయా కంపెనీల అధికారులకు ఈడీ నోటీసులు పంపి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తుం దని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. విచారణలో కొన్ని దశలు పూర్తయిన తర్వాత పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం ఈడీ ఈ కేసులో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల ఆస్తుల జప్తు చర్యలు తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.
సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఏమిటి?
సీబీఐ, ముంబై విభాగం ఈ నెల మొదట్లో నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు కలిసి ఎంఐఏఎల్‌కు చెందిన రూ.705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్రానికి నష్టం చేశారు. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, జీవీకే చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంఐఏఎల్ ఎండీ జీవీ సంజయ్ రెడ్డి, ఐశ్వర్యగిరి కన్‌స్ట్రక్షన్స్, కోటా ఎంటర్‌ప్రైజెస్ మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ వంటి అభియోగాలు దాఖలయ్యాయి. 2006 ఏప్రిల్ 4న ఎంఐఏఎల్‌తో ఏఏఐ ఒప్పందం పెట్టుకుంది. ముంబై ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణ, కార్యకలాపాలు, నిర్వహణ ఈ ఒప్పందం ఉద్దేశ్యం. అయితే దీని అమల్లో సంబంధిత భాగస్వాములు అందరూ కలిసి భారీ ఆర్థిక అవకతకలకు పాల్పడినట్లు ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment