
ఆమోదించిన ఎన్‌సీఎల్‌ఏటీ
చెల్లింపుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యం
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్‌ఎల్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కాపిటల్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఉపసంహరించుకుంది. పూర్తిగా చెల్లింపులు జరిపి ఇందుకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసినందున, ఐఐహెచ్‌ఎల్‌పై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అపీలేట్ ట్రిబ్యునల్‌కు ఆర్‌క్యాప్ సీఓసీ తెలిపింది.
సీఓసీ పిటిషన్‌ను జస్టిస్ యోగేష్ ఖన్నా, జస్టిస్ అజయ్ దాస్ మెహ్‌రోత్రాలతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య థర్మాసనం ఆమోదించింది. కేసు వివరాల్లోకి వెళితే, దివాలా కోడ్ చట్టం కింద ఐఐహెచ్‌ఎల్ ఆర్థిక సేవల సంస్థ– రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు 2023 ఏప్రిల్‌లో రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్‌ను నమోదుచేసింది. దీని ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికను ఐఐహెచ్‌ఎల్ 2924 మే 27 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు తర్వాత ఈ కాల పరిమితిని 2024 ఆగస్టు 10 వరకూ పొడిగించడం జరిగింది.