బకాయిల భారం | district in Rs. 114 cror's Arrears | Sakshi
Sakshi News home page

బకాయిల భారం

Published Tue, Dec 16 2014 3:43 AM | Last Updated on Wed, Sep 5 2018 4:12 PM

బకాయిల భారం - Sakshi

బకాయిల భారం

కడప అగ్రికల్చర్: వివిధ ప్రభుత్వ శాఖలు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ నష్టాల షాక్‌కు గురవుతోంది. అధిక ధరలకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థ తీవ్ర రుణ భారంలో చిక్కుకు పోయింది. ఈ ఊబి నుంచి బయట పడేందుకు సంస్థ సాధారణ వినియోగదారుడిపై భారాల బండమోపుతోంది. పదులు, వందల్లో ఉన్న బిల్లులు చెల్లించడం ఆలస్యమైతేనే సామాన్యులను నానా విధాలుగా వేధించే విద్యుత్ అధికారులు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, చిన్న, పెద్ద పరిశ్రమల బకాయిలపై ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
జిల్లాలో రూ.114 కోట్ల బకాయిలు..

14 విద్యుత్ రెవెన్యూ ఆఫీసుల పరిధిలో శాఖకు రావాల్సిన బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.1.08 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.6.36 కోట్లు ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి వీధి దీపాలు, తాగునీటి పంపింగ్ స్కీములు, పంచాయతీ కార్యాలయాల నుంచి రూ.51.44 కోట్లు, కోర్టుల్లో వివిధ కేసులు ఉండటం వల్ల రూ.12.53 లక్షలు, ఆర్‌ఆర్ యాక్టు ఉపసంహరించుకోవడం వల్ల రూ.83 వేలు, సర్వీసుల తొలగింపు బకాయి రూ.18.40 కోట్లు, లైవ్ సర్వీసుతో ఆగిన బకాయి రూ.4.16కోట్లు, బిల్లులు నిలిపి వేయడంతో ఆగిన బకాయి రూ.13.48 కోట్లు విద్యుత్ సంస్థకు రావాల్సి ఉంది. అలాగే హెచ్‌టీ సర్వీసుల నుంచి మరో రూ.10.26 కోట్లు బకాయి అందాల్సి ఉంది. ఈ మొండి బకాయిలను రాబట్టేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు.

ఇటీవల సీఎండీ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ప్రతి రోజు అధికారులు బకాయి ఎంత రాబట్టింది పక్కాగా ఒక నివేదికను జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్‌లో అందిస్తున్నారు. ఆ నివేదికను తిరుపతిలోని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్‌పీడీసీఎల్) కార్యాలయానికి పంపుతున్నారు.

నిన్న మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన అధికారులు ఏకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బకాయిల వసూలుకు దిగారు. ఇటీవల జిల్లా పరిషత్  కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఆగమేఘాల మీద పెండింగ్ బకాయిలో కొంత మొత్తాన్ని చెల్లించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మిగిలిన శాఖల కార్యాలయాలకు కూడా వర్తింప చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పెషల్ డ్రైవ్ అధికారి ఒకరు తెలిపారు.
 
ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న అధికారులు..
ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గ్రాంటు నిధులు విడుదల చేసినప్పుడు అందులో కొంత మొత్తాన్ని విద్యుత్ బకాయిల కింద తమ శాఖకు కొంత మొత్తాన్ని బదలాయించి ఉంటే సంస్థకు ఇబ్బంది వచ్చేది కాదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల నుంచి దాదాపు రూ.55 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఆయా సంస్థల ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఇది వరకే నోటీసులు పంపినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
భీష్మించిన స్థానిక సంస్థల అధ్యక్షులు....

జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికైన అధ్యక్షులు విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే 13 ఫైనాన్స్ గ్రాంటు నుంచి విడుదలైందని ఆ నిధులన్నీ రూ. 51.44 కోట్లు విద్యుత్ పాత బకాయిలకు చెల్లిస్తే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలోని అధ్యక్షులు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement