Electricity authorities
-
తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే!
సాక్షి, హైదరాబాద్: దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందని చెప్పడానికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని ప్రామాణిక సూచికగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది..’అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం గోల్కొండ కోట సాక్షిగా చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగానూ సీఎం ఇదే ప్రకటన చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నిజంగానే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం స్వయంగా పార్లమెంట్లో ప్రకటించింది. అయితే, తలసరి విద్యుత్ వినియోగంలో మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో లేదు. 2126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో మనరాష్ట్రం జాతీయస్థాయిలో 10వ స్థానంలో ఉంది. గత ఫిబ్రవరి 17న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని 2020–21 వార్షిక విద్యుత్ సరఫరా గణాంకాల ఆధారంగా సీఈఏ తాజా నివేదిక ప్రకటించింది. జాతీయస్థాయిలో ఏటా వార్షిక విద్యుత్ గణాంకాలను సీఈఏ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో ఏడో స్థానంలో ఉందని సీఈఏ నివేదిక పేర్కొంటోంది. తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు..? తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం ప్రసంగం కోసం సీఎంఓ ఎప్పటికప్పుడు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తుండగా, అధికారులు తప్పుడు వివరాలు అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలున్నాయి. వ్యవసాయ విద్యుత్‌లో రాష్ట్రం అగ్రస్థానం ► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ►గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ►వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్ల వినియోగంతో గోవా అగ్రస్థానంలో, 128.81 యూనిట్ల వినియోగంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ►హెచ్‌టీ కేటగిరీలో పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1163.99 యూనిట్ల వినియోగంతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 299.19 యూనిట్ల వినియోగంతో పదోస్థానంలో ఉంది. -
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
నీటి పైపులైన్ల నుంచి విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: భారీ నీటి పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా విద్యుత్ రంగ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఏ మేరకు ఉంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న దిశగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కోదండాపూర్ నుంచి సాహెబ్ నగర్ (గ్రేటర్ శివారు) మార్గంలో 130 కిలోమీటర్ల పొడవునా ఉన్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఎక్కువగా ఉన్నచోట టర్బైన్లను ఏర్పాటు చేయాలని.. వాటి నుంచి సుమారు 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, టర్బైన్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానించాలని హైదరాబాద్ జల మండలి (వాటర్ బోర్డు) నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేలా? జల మండలి ప్రస్తుతం హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నగరం నలుమూలలా సరఫరా కోసం సుమారు 200 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.75కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు నీటి పైపులైన్లలో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికతను వినియోగి స్తున్నారు. సాగునీళ్లు, తాగునీళ్లతోపాటు పలుచోట్ల సీవరేజీ పైపులైన్లలో కూడా డైనమోలు అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ నీటి పైపులైన్లలో ఏర్పాటు చేయాలని జల మండలి భావిస్తోంది. తొలుత కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్ పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. అది సఫలమైతే గోదావరి పైపులైన్లలోనూ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. ఈ టర్బైన్ల వల్ల నీటి సరఫరా వేగం తగ్గడం, పంపులు నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయా, ఎలాంటి చోట్ల ఏర్పాటు చేయవచ్చు, ఇబ్బందులేమైనా వస్తే ఎలా అధిగమించాలన్న దానిపై అధ్యయనం జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉందని అంటున్నాయి. భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన తరహాలోనే.. పైపులైన్ల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టుల వద్ద చాలా ఎత్తులో ఉండే నీళ్లను పవర్ ప్లాంట్‌లోకి పంపుతారు. అలా దూసుకొచ్చే నీళ్లు భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతూ కిందికి వెళ్లిపోతాయి. ఈ క్రమంలో టర్బైన్లకు అమర్చిన భారీ డైనమోలలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో నీళ్లు వేగంగా దూసుకెళ్లే పైపులైన్లలో అమర్చే హైడ్రోడైనమిక్ టర్బైన్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. పైపులైన్లలో మాత్రమే కాకుండా నిరంతరం నీటి ప్రవాహం ఉండే కాల్వల వద్ద కూడా ఇలా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఏమిటీ డైనమో? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలే డైనమోలు. సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఉపయోగించే ఫ్యాన్లు, నీటి మోటార్ల వంటివే. విద్యుత్ సరఫరా చేసినప్పుడు మోటార్‌కు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్) తిరుగుతుంది. డైనమోలు దీనికి ప్రతిగా (రివర్సులో) పనిచేస్తాయి. డైనమోకు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్)ను తిప్పితే.. దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు వేగంగా ప్రవహిస్తున్న నీళ్లు టర్బైన్ను తిప్పుతాయి. దీంతో ఆ టర్బైన్‌కు అనుసంధానం చేసిన డైనమో షాఫ్ట్ కూడా తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డైనమోలో.. రెండు శక్తివంతమైన అయస్కాంతాలను రెండు వైపులా బిగిస్తారు.. మధ్యలో రాగి,అల్యూమినియం వంటి లోహపు తీగలను చుట్టలుగా చుట్టి ఒక కడ్డీ (షాఫ్ట్) ద్వారా వేలాడదీస్తారు. షాఫ్ట్ను తిప్పినప్పుడు లోహపు చుట్టలు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి లోహపు తీగల్లో విద్యుత్‌ను పుట్టిస్తుంది. -
విద్యుత్ బకాయిల కోసం వెళ్తే.. ప్రాణం తీశారు
థానే: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చేపట్టిన విద్యుత్ బకాయిల వసూళ్ల డ్రైవ్ హింసాత్మకంగా మారింది. గ్రామస్తుల మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థ గార్డు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మరమగ్గాల పరిశ్రమ కేంద్రమైన భివాండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ బిల్లుల బకాయిదార్లపై చర్యలు తీసుకునేందుకు ఓ విద్యుత్ సంస్థకు చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ గార్డు తుకారాం పవార్‌తో కలిసి శనివారం భివాండి సమీపంలోని కనేరి గ్రామానికి వెళ్లారు. విద్యుత్ సరఫరా లైన్లను కట్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామంలోని 10 నుంచి 15 మంది కలిసి వారందరినీ కొట్టారు. ఈ దాడిలో గార్డు తుకారాం పవార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు నిజాంపుర స్టేషన్ పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అందాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు. ఇక విద్యుత్ సంస్థే తమ తండ్రి మరణానికి కారణమని తుకారాం కుమారుడు ఆరోపిస్తున్నారు. బకాయిదారులపై చర్యలు సాధారణంగా ఉండేవేనని, అందుకే పోలీసు రక్షణ కోరలేదని సదరు విద్యుత్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. నేరస్థుడి మృతితో దాడి మరో ఘటనలో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన వాళ్లపై దాడి జరిగింది. భివాండిలోని కసాయివాడలో శుక్రవారం ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి జరిగింది. గుజరాత్ పోలీసులు, భివాండి క్రైం బ్రాంచి పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి జమీల్ ఖురేషిని పట్టుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించు కునే క్రమంలో ఖురేషి తను ఉన్న నాలుగో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి కిందికి దూకి, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు పోలీసులే కారణ మంటూ స్థానికులు, మృతుడి కుటుంబీకులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
మూగజీవాలపై యమపాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తీ, రామవరంలోని చిట్టిరామవరం పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, ప్రగతినగర్ కాలనీలో కూడా విద్యుత్ తీగలు భయపెట్టిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. 2020–21 సంవత్సరంలో జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 79 పశువులు, 23 మంది వ్యక్తులు చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు పాడి పశువులు, మూగ జీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్ తీగలు, ఏళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక గాలివానలకు తెగిపడే తీగలు, పడిపోయే స్తంభాలు, ఎర్తింగ్ లోపాలు, నాసిరకం పరికరాల కారణంగా రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తు న్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్/ ఎస్పీడీసీఎల్)ల అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో.. అనగా 2017–21 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 5,400కు పైగా మూగజీవాలు విద్యుత్ ప్రమాదాలకు బలయ్యాయి. ఏటా సగటున 1,300 మూగజీవాలు విద్యుత్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక లెక్కలకు అందని మూగజీవాల మరణాలు మరో రెండు రెట్లు అధికంగా ఉంటాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. రైతన్నల కుడిఎడమ భుజాలైన కాడెద్దులు పంట పొలాల్లో మేతకు వెళ్లినప్పుడో, మరో సందర్భంలోనో కరెంట్ షాక్‌కు గురై మృత్యు వాత పడటం ఆయా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రేమతో పెంచుకునే పాడి పశువులు విద్యుత్ ప్రమాదాల్లో మరణించినప్పుడు ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. లక్షల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 50 శాతం ప్రమాదాలకు శాఖా పరమైన లోపాలే కారణం కావడం విచారకరం. పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. శాఖాపరమైన కారణాలతో మనుషులు, మూగ జీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే డిస్కంలు విచారణ జరిపి పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. మనుషులకు రూ.5 లక్షలు, ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పాడి పశువులకు రూ.40 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. అయితే ఈ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణలు, నివేదికల పేరిట క్షేత్ర స్థాయి అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొం త మంది క్షేత్రస్థాయి అధికారులు నెపాన్ని వినియో గదారులపై నెట్టేసి తప్పుడు నివేదికలు ఇచ్చి పరిహారం రాకుండా చేస్తున్నారనే విమర్శ లు న్నాయి. బాగా పాలిచ్చే ఆవులు, గేదెల మార్కెట్ ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండగా, పరిహారం 50 శాతం కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో గతేడాది (2020–21) సంభవించిన విద్యుత్ ప్రమా దాల్లో 175 మంది మనుషులు మరణించగా, 150 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు. 471 మూగజీవాలు బలి కాగా, 377 జీవాల యజమా నులకు పరిహారం చెల్లించారు. ప్రస్తుత 2021–22 లో గత మే నెల నాటికి 21 మంది మనుషులు,75 మూగజీవాలు మరణించగా 19 మందికి, 40 జీవా లకు పరిహారం లభించింది. చాలా ప్రమాదాలు శాఖాపరమైన కారణాలతోనే.. తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడటం, ఎర్తింగ్ నిర్వహణ లేకపోవడం, విద్యుత్ స్తంభాలు/వైర్లు తెగిపడడం, 11/6.6 కేవీ జంపర్లు విఫలం కావడం, 11 కేవీ ఏబీ స్విచ్ పైప్/కేబుల్ ఇన్సులేటర్ ఫెయిల్ కావడం, హెచ్‌టీ/ఎల్టీ లైన్ స్నాప్ కావడం, విద్యుత్ స్తంభాలకు సపోర్ట్‌గా ఉండే స్టే–వైర్లకు విద్యుత్ సరఫరా కావడం, చాలాచోట్ల రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి శాఖాపర కారణాలతోనే 50 శాతానికి పైగా విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తీగలు వేలాడటం వంటి వాటిపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల అజాగ్రత్తలు, అవగాహన లోపం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణలతో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిస్కంల అధికారవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. ‘పవర్ వీక్’ నిర్వహించినా మారని పరిస్థితి.. చాలా సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే విద్యుదాఘాతాలకు దారితీసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పవర్ వీక్ నిర్వహించాలని గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిస్కంలను ఆదేశించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్ సంస్థ రూ.195 కోట్లు ఖర్చు చేసి తమ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 8,567 గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసినట్టు ప్రకటించుకుంది. వంగిన/తుప్పుపట్టిన/పాడైపోయిన 43,486 స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న 22,483 స్టే వైర్ల మార్పిడి, 1,24,175 చోట్లలో వదులుగా ఉన్న తీగలను సరి చేయడం తదితర పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఎన్పీడీసీఎల్ సైతం ఇదే తరహాలో పవర్ వీక్ నిర్వహించి మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలవుతున్నాయి. -
ఖతార్ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా
న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్ఎల్), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది. -
ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్ వీక్
సాక్షి, వనపర్తి: మా ఊర్లో విద్యుత్ సంభం ఒరిగింది.. వైర్లు వదులుగా అయ్యాయి.. స్థంభాలు దెబ్బతిని కూలిపోయేలా ఉన్నాయి... ఇలా గతంలో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విద్యుత్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేవారు. అంతంతమాత్రంగానే స్పందన ఉండేది. ఎంతకూ గ్రామాలకు రాని విదుత్ శాఖ అధికారులు ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒరిగిన స్థంభాలను సరిచేస్తున్నారు. వదులుగా ఉన్న వైర్లను తీసి కొత్తవైర్లు బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. స్తంభాలు పాతుతున్నారు. కొత్తగా అవసరమైన చోట అడిగిందే తడువుగా తీసుకుని వచ్చేస్తున్నారు. చూస్తుండగానే ఒక్కో గ్రామంలో రెండుమూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు కొలిక్కివస్తున్నాయి. ఏళ్లుగా చీకట్లో ఉండే గడిపిన కాలనీలలో ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 22,284 సమస్యలు గుర్తింపు జిల్లాలోని 225 గ్రామ పంచాయతీల్లో విద్యుత్ శాఖకు సంబంధించి మొత్తం 22,284 సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 24 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యలలో అధికారులు 7,361 సమస్యలను పరిష్కరించారు. రోజువారీగా రిపోర్టులు తయారు చేసి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.8.50 కోట్ల నిధుల ను వనపర్తి జిల్లాకు కేటాయించారు. గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నారు. సరిపోకుంటే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో థర్డ్‌వైర్.. జిల్లాలో థర్డ్‌వైర్ కొన్ని గ్రామాల్లో ఉంటే, మరికొన్ని గ్రామాల్లో లేవు. విద్యుత్ దీపాలను అమర్చేందుకు ఉపయోగించే ఈ థర్డ్వైర్ను ప్రతి జనావాస ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అ«ధికారులు కృషి చేస్తున్నారు. ఏళ్లనాటి సమస్యలు పరిష్కారం పవర్ వీక్ కార్యక్రమం వలన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి పవర్‌వీక్ కార్యక్రమం నిర్వహించాలి. చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్థంభాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వదులుగా.. ఉన్న వైర్లను బిగించారు. – శేఖర్ నాయుడు, రాయినిపల్లి, పానగల్ మండలం ప్రతి సమస్యను పరిష్కరిస్తాం పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో గుర్తించి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. సుమారు 7,400 సమస్యలను పరిష్కరించాం. గ్రామాల్లో మాసిబ్బంది నిత్యం పని చేస్తూనే ఉన్నారు. – లీలావతి, ట్రాన్స్‌కో డీఈఈ -
‘పవర్’ దందాకు చెక్
సాక్షి, అమరావతి: అవినీతిని అడ్డుకునే క్రమంలో ఏపీ విద్యుత్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన అక్రమ పవన విద్యుత్ కొనుగోలును నిలిపివేసింది. తాత్కాలిక కనెక్షన్ల పేరుతో కొనసాగుతున్న 404.4 మెగావాట్ల విండ్ పవర్ కొనుగోలు నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. గత సర్కార్‌లోని పెద్దలు హద్దులు మీరి అనుయాయుల కోసమే ఈ లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవ్వడంతో తక్షణమే ఈ విద్యుత్ తీసుకోవడాన్ని నిలిపివేయాలని సోమవారం అనంతపురం జిల్లా విద్యుత్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ కొనుగోలును నిలిపివేసిన సంస్థల్లో రెనర్జీ డెవలపర్స్ (99.8 మె.వా), ఎకొరాన్ ఎనర్జీ లిమిటెడ్ (99.8 మె.వా), హెలియన్ ఇన్ఫ్రాటెక్ (100.8 మె.వా), వాయుపుత్ర (20 మె.వా), గుట్టసీమ విండ్ పవర్ (80 మె.వా) ఉన్నాయి. దీంతో రోజుకు రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. కాగా, డిస్కమ్‌లు ఈ విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. దీన్నివల్ల థర్మల్ పవర్ ఆపేయడం అనివార్యమవుతుంది. అంతేకాక.. థర్మల్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున స్థిరఛార్జి చెల్లిస్తున్నారు. అంటే విండ్ పవర్ ఖరీదు యూనిట్‌కు రూ.6.04 వరకూ పడుతోంది. సర్కారు నిర్ణయంతో నెలకు కనీసం రూ.36 కోట్ల వరకు విద్యుత్ సంస్థలపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సంప్రదాయేతర ఇంధన, పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లక్ష్యాలను పెట్టింది. గత ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పవన, సౌర విద్యుత్ కనెక్షన్లకు అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్ ధరలు తగ్గుతున్నా అత్యధిక ధరకు 25ఏళ్ల పాటు కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి గ్రీన్ కారిడార్ పరిధిలో 997 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే గ్రిడ్‌కు అనుసంధానం చేసే మౌలిక సదుపాయాలున్నాయి. కానీ, గత ప్రభుత్వంలోని అధికారులు ఏకంగా 1851 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతించడంతో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో వీటిని తాత్కాలిక కనెక్షన్లుగా పరిగణిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. పేరుకు తాత్కాలికమే అయినా, గ్రిడ్‌పై అధిక లోడ్‌తోనే ఇవి విద్యుదుత్పత్తి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిపుణులతో కమిటీ వేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన తాత్కాలిక కనెక్షన్లను తొలగించింది. -
‘కళా’ గారూ.. కాపాడరూ?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో జరిగిన ఇంక్రిమెంట్ల కుంభకోణంలో సూత్రధారులైన అధికారుల్లో కలవరం మొదలైంది. చర్యల నుంచి తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఎలాగైనా కాపాడంటూ విద్యుత్తు శాఖ మంత్రి కళా వెంకట్రావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఈపీడీసీఎల్‌లో ఇంక్రిమెంట్ల స్కాం’ శీర్షికతో ఇటీవల సాక్షి ప్రథాన సంచికలో కథనం ప్రచురించిన సంగతి విధితమే.ఈ వ్యవహారంలో 32 మంది ఉద్యోగులకు అడ్డగోలుగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, దీనిని ట్రాన్స్‌కో కూడా తప్పు పట్టిన నేపథ్యంలో ఈ ఇంక్రిమెంట్ల సొమ్మును వడ్డీతో సహా రికవరీ చేయాలని ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య ఉత్తర్వులిచ్చారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీంతో సూత్రధారుల్లో కలవరం మొదలైంది. ఇదీ పరిస్థితి నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెట్లు పొందిన వారిలో విశాఖపట్నం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 12 మంది, ఇతర సర్కిళ్లలో మరో 20 మంది వెరసి 32 మంది ఉద్యోగులున్నారు. వీరు ఇంక్రిమెంట్లు పొందడంలో కీలక పాత్ర పోషించిన వారిలో సీజీఎంలు, ఎస్‌ఏవో, ఏఏవోలతో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. ఉద్యోగులకు లక్షలాది రూపాయలు లబ్ధి చేకూర్చడానికి వీరు వివిధ రూపాల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తమపై చర్యలు తీసుకోకుండా చూడాలంటూ విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావును ఈ అధికారులు ఆశ్రయించినట్టు తెలిసింది. ఇందులో జోక్యం చేసుకుంటే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో వారికి భరోసా ఇవ్వలేదని సమాచారం. -
కరెంటోళ్ల ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా నెలవారీ విద్యుత్ బిల్లులపై సీఎం చంద్రబాబు ఫొటోను ముద్రించారు. రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం దేనిపైనా ముఖ్యమంత్రి ఫోటోను ప్రచురించకూడదు. కానీ ఈ నెల 17వ తేదీన ఏలూరు 3 పరిధిలో ఇచ్చిన విద్యుత్ బిల్లులు వెనుక వైపు జగజ్జీవన్ జ్యోతి పథకం ప్రచురించారు. ఇందులో ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మను ముద్రించారు. దీనిపై ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్యను వివరణను కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయితే, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం గతంలోనే ముద్రించి సిద్ధం చేసిన బిల్లు పేపర్లపై చంద్రబాబు బొమ్మ ఉందని చెప్పామని, ఆయన పట్టించుకోలేదని చెబుతున్నారు. వాస్తవానికి రాజబాపయ్యను రాత్రికి రాత్రే ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. దీనివెనుక రాజకీయ కారణాలున్నాయని, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే నోటిఫికేషన్ ఇవ్వాలనే నిబంధనలు సైతం పక్కనపెట్టి నియామకం చేశారనే చర్చ విద్యుత్‌వర్గాల్లో జరుగుతోంది. -
తీరం కబ్జా
ఉలవపాడు: సాగర తీరం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. బడాబాబుల చేతుల్లో పడి రొయ్యల చెరువులుగా మారిపోయింది. పొరుగు జిల్లా నుంచి వచ్చి మరీ ఇక్కడి తీరంలో వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. మండల పరిధిలోని కరేడు కొత్త పల్లెపాలెం తీరప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్‌కు, సముద్రానికి మధ్యలోని సుమారు 125 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేసి వ్యాపారం చేస్తున్నారు. సముద్రం ఆనుకుని ఈ చెరువులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆక్రమణ జరిగిందిలా... కరేడు కొత్త పల్లెపాలెం గ్రామస్తులను రొయ్యల వ్యాపారులు మంచి చేసుకున్నారు. తాము ఆ భూమిలో రొయ్యల చెరువులు నిర్మిస్తామని, దానికి ప్రతిఫలంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున గ్రామానికి ఇస్తామని ఆశచూపారు. ప్రభుత్వ పొలాల వలన తమకు ఆదాయం వస్తుందని గ్రామస్తులు సంతోషించారు. నగదు చెల్లించి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకున్న వ్యాపారులు దాదాపు 5 నెలల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల అండతోనే... అధికారుల అండతోనే ఇక్కడ రొయ్యల చెరువులు వేయగలిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వచ్చిన తహశీల్దార్‌తో మాట్లాడి తమ వ్యాపారానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో ఒక పంటను అమ్మారు. వెనామీ రొయ్యలను పెంచి కేజీ 300 రూపాయల చొప్పున అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారులంతా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 80 కి.మీ ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత మేరకు లాభాలు వస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. జనరేటర్లతోనే నిర్వహణ... ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. పట్టా భూములకు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. దీని కోసం చాలా పాట్లు పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. తహశీల్దార్ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చెరువుల నిర్వహణ మాత్రం ఆగలేదు. జనరేటర్లతో బోర్లను ఏర్పాటు చేసి రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. కొంత నీరు సముద్రం నుంచి కూడా పంపింగ్ చేసి చెరువులకు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బకింగ్‌హామ్ కెనాల్, సముద్రం మధ్య భాగాన్ని ఎంతో విలువైనదిగా చూసేవారు. బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా భారీ ఓడలు కూడా వెళ్లేవి. ప్రభుత్వం మళ్లీ ఈ కెనాల్ అభివృద్ధి చేయాలని చూస్తున్న తరుణంలోనూ ఆక్రమణలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ విషయమై తహశీల్దార్ శ్రీశిల్పను సాక్షి వివరణ కోరగా ‘వంద ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందా..అవునా..నేను సోమవారం ఉదయం వచ్చి మాట్లాడతాను’ అని చెప్పారు. -
బకాయిల భారం
కడప అగ్రికల్చర్: వివిధ ప్రభుత్వ శాఖలు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ నష్టాల షాక్‌కు గురవుతోంది. అధిక ధరలకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థ తీవ్ర రుణ భారంలో చిక్కుకు పోయింది. ఈ ఊబి నుంచి బయట పడేందుకు సంస్థ సాధారణ వినియోగదారుడిపై భారాల బండమోపుతోంది. పదులు, వందల్లో ఉన్న బిల్లులు చెల్లించడం ఆలస్యమైతేనే సామాన్యులను నానా విధాలుగా వేధించే విద్యుత్ అధికారులు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, చిన్న, పెద్ద పరిశ్రమల బకాయిలపై ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రూ.114 కోట్ల బకాయిలు.. 14 విద్యుత్ రెవెన్యూ ఆఫీసుల పరిధిలో శాఖకు రావాల్సిన బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.1.08 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.6.36 కోట్లు ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి వీధి దీపాలు, తాగునీటి పంపింగ్ స్కీములు, పంచాయతీ కార్యాలయాల నుంచి రూ.51.44 కోట్లు, కోర్టుల్లో వివిధ కేసులు ఉండటం వల్ల రూ.12.53 లక్షలు, ఆర్ఆర్ యాక్టు ఉపసంహరించుకోవడం వల్ల రూ.83 వేలు, సర్వీసుల తొలగింపు బకాయి రూ.18.40 కోట్లు, లైవ్ సర్వీసుతో ఆగిన బకాయి రూ.4.16కోట్లు, బిల్లులు నిలిపి వేయడంతో ఆగిన బకాయి రూ.13.48 కోట్లు విద్యుత్ సంస్థకు రావాల్సి ఉంది. అలాగే హెచ్‌టీ సర్వీసుల నుంచి మరో రూ.10.26 కోట్లు బకాయి అందాల్సి ఉంది. ఈ మొండి బకాయిలను రాబట్టేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇటీవల సీఎండీ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ప్రతి రోజు అధికారులు బకాయి ఎంత రాబట్టింది పక్కాగా ఒక నివేదికను జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో అందిస్తున్నారు. ఆ నివేదికను తిరుపతిలోని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్యాలయానికి పంపుతున్నారు. నిన్న మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన అధికారులు ఏకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బకాయిల వసూలుకు దిగారు. ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఆగమేఘాల మీద పెండింగ్ బకాయిలో కొంత మొత్తాన్ని చెల్లించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మిగిలిన శాఖల కార్యాలయాలకు కూడా వర్తింప చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పెషల్ డ్రైవ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న అధికారులు.. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గ్రాంటు నిధులు విడుదల చేసినప్పుడు అందులో కొంత మొత్తాన్ని విద్యుత్ బకాయిల కింద తమ శాఖకు కొంత మొత్తాన్ని బదలాయించి ఉంటే సంస్థకు ఇబ్బంది వచ్చేది కాదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల నుంచి దాదాపు రూ.55 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఆయా సంస్థల ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఇది వరకే నోటీసులు పంపినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. భీష్మించిన స్థానిక సంస్థల అధ్యక్షులు.... జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికైన అధ్యక్షులు విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే 13 ఫైనాన్స్ గ్రాంటు నుంచి విడుదలైందని ఆ నిధులన్నీ రూ. 51.44 కోట్లు విద్యుత్ పాత బకాయిలకు చెల్లిస్తే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలోని అధ్యక్షులు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
రైతు నెత్తిన మరో పిడుగు
యాచారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న నెత్తిపై మరో పిడుగు పడనుంది. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ వినియోగానికిగాను కుప్పలుగా పేరుకుపోతున్న సర్వీస్ చార్జీలను చెల్లించని పక్షంలో కనెక్షన్లు కట్ చేయడానికి విద్యుత్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రూ. కోట్లాది బకాయిలు వసూలు చేయడం కోసం ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని వివిధ గ్రామాల్లో 15 వేలకు పైగా వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రూ.5 కోట్లకు పైగా సర్వీస్ చార్జీల బకాయిలు ఉన్నాయి. 2004 నుంచి వినియోగానికి సంబంధించి ఉచిత విద్యుత్ అందుతున్నప్పటికీ సర్వీస్ చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంది. 2004 నుంచి నెలకు రూ. 20 సర్వీస్ చార్జి ఉండగా, 2012 మార్చి నుంచి రూ.10 అదనంగా పెంచి నెలకు రూ.30 చేశారు. వ్యవసాయ బోర్లు నీళ్లు పోసినా, ఎండిపోయినా చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇబ్రహీంపట్నం డివిజన్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎండిపోయిన వేలాది బోరు బావులకు సైతం సర్వీస్ చార్జీలు విధిస్తున్నారు. బిల్లుల పంపిణీకి రంగం సిద్ధం.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం, ఉత్పత్తి లేకపోవడంతో తీవ్ర లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు అత్యంత ఆవశ్యకమైంది. ఇందుకోసం అవసరమైన సొమ్మును రైతుల వద్ద పేరుకుపోయిన బకాయిల నుంచి వసూలు చేయడానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉపక్రమించారు. నాలుగు రోజుల క్రితం డివిజన్లో ఉన్న అన్ని వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు సర్వీస్ చార్జీల బిల్లులను ఆయా మండల విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాల వారీగా వెళ్లి నేరుగా రైతులకు అందజేయనున్నారు. కొంత కాలంపాటు రైతులకు గృహ వినియోగానికి సంబంధించిన బిల్లుల్లోనే సర్వీస్ చార్జీల బిల్లులను కలిపేవారు. అలా రూ. వేలల్లో బిల్లులు రావడంతో గృహ వినియోగ బిల్లులు కూడా చెల్లించే వారు కాదు. బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రస్తుతం వ్యవసాయ బోరుబావులకు ప్రత్యేకంగా సర్వీస్ చార్జీల బిల్లులను అందించడానికి సిద్ధమయ్యారు. 2004 నుంచి సర్వీస్ చార్జీలు చెల్లించని రైతులకు మొత్తం బిల్లు రూ.4,852 వచ్చింది. అప్పుడప్పుడు కొంత చెల్లించిన రైతులకు సైతం రూ. 2వేల నుంచి రూ.3 వేలకు పైనే వచ్చింది. డివిజన్లో తీవ్ర కరువు పరిస్థితులతో రైతుల వ్యవసాయ బోరుబావులు ఎండిపోయాయి. ఆయా మండలాలకు వచ్చిన బిల్లుల్లో అత్యధికంగా అలాంటి రైతులకు రూ. 4,852 బిల్లులు వచ్చాయి. వచ్చిన బిల్లులు చూస్తే రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా చెల్లించాల్సిందే.. వ్యవసాయ బోరుబావుల సర్వీస్ చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందే. నెలకు రూ. 30 చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు. బిల్లుల పంపిణీ తర్వాత కొంత గడువు ఇస్తాం. ఆలోపు చెల్లించని పక్షంలో కనెక్షన్లు తొలగించక తప్పదు. ఇప్పటికే చాలాసార్లు అవకాశం కల్పించాం. ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన ఆదేశాలున్న దృష్ట్యా ఇక చెల్లించక తప్పదు. - చక్రవర్తి, విద్యుత్ ఏడీఈ, ఇబ్రహీంపట్నం -
చీకట్లు
జిల్లాలో అప్రకటిత కరెంట్‌కోత అన్నివర్గాల ప్రజలకు గుదిబండగా మారింది. చీకటిపడితే చాలు పట్టణాల్లో అంధకారం అలుముకుంటోంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చిరువ్యాపారులు, పారిశ్రామికవర్గాల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు వరుణుడు కరుణించకపోవడం.. విద్యుత్ కోతలు మొదలు కావడంతో ఖరీఫ్ వరిసాగు ముందుకు సాగడం లేదు. రైతన్న రోడ్డెక్కి గగ్గోలుపెడుతున్నా.. గోడు వినేవారు లేరు. - జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు - అవసరం 15 మి.యూ.. - సరఫరా 10 మి.యూ - సంకటస్థితిలో రైతన్నల ఖరీఫ్ సాగు - ఇబ్బందుల్లో వ్యాపారులు, పరిశ్రమలు సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో విద్యుత్ వాడకం పెరగడం.. సరఫరా తగ్గిపోవడంతో కోతలు మరింత ఉధృతమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గం టల కోతలు అమలవుతున్నాయి. తద్వారా తాగునీటికి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణవాసులు దోమలతో కుస్తీపడుతూ కునుకులేకుండా గడుపుతున్నారు. వ్యవసాయరంగానికి ఆరుగంటల విద్యుత్ అందిస్తున్నామని అధికారు లు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. కనీసం మూడుగంటలు కూడా కరెంట్ సరఫరా కావడం లేదు. అధికారులు రెండు గ్రూపులుగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. గ్రూప్-‘ఏ’ ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 దాకా తిరిగి రాత్రి 10.00 నుంచి తెల్లవారుజామున 1.00 వ రకు, గ్రూప్-‘బీ’ ప్రకారం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 4.00 దాకా, మళ్లీ తెల్లవారుజామున 1.00 నుంచి 4.00 వరకు సరఫరా చేయాలని చార్ట్ తయారుచేశారు. ఇదిలాఉండగా, సంబంధిత సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా ఉంటేనే రైతులకు అందుతోంది.. లేదంటే అంతే సంగతులు. కోతలు.. వాతలు కరెంట్ సరఫరా లేకపోవడం వల్లే కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్ అధికారులు తేల్చేస్తున్నారు. జిల్లా అవసరాలకు 15 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, ప్రస్తుతం 10.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్, సరఫరాకు అంతరాయం ఉండటంతో కోతలే అనివార్యమని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు విద్యుత్‌ను నిలిపేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కోత విధిస్తున్నారు. అలాగే మునిసిపాలిటీల్లో ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4.00 వరకు పవర్‌కట్ ఉంటుంది. మండలకేంద్రాల్లో ఉదయం 8.00 నుంచి 12.00 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2.00నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విద్యుత్‌కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజు మొత్తం పవర్‌హాలిడే ప్రకటించారు. అదే అదనుగా భావించిన విద్యుత్‌శాఖ అధికారులు లోటును పూడ్చుకోవడానికి ఉచిత క రెంట్‌కు కోత విధిస్తున్నారు. తద్వారా వ్యవసాయానికి రెండుగంటలు కూడా సక్రమంగా అందకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోతల కారణంగా చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. అడ్డూఅదుపులేని కోతల కారణంగా చేతినిండా పనిలేక కార్మికులు అల్లాడుతున్నారు. దీంతో వెల్డింగ్, జిరాక్స్ మిషన్లు, రిపేరింగ్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కరెంట్ లేక వచ్చినా ఆర్డర్లను సమయానికి ఇవ్వలేకపోతున్నామని చిన్న పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. జనరేటర్లు పెట్టి నడిపిస్తే లాభం రాకపోగా.. తీవ్రం గా నష్టపోవాల్సి వస్తోందని దిగులుచెందుతున్నారు. -
బకాయిల షాక్
సాక్షి, అనంతపురం : జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిల భారం ఎక్కువైపోయింది. ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 12 ప్రభుత్వ శాఖలు, మునిసిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీల నుంచి మే 30వ తేదీ 2014 నాటికి రూ.95.07 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తేల్చారు. ఇందులో సింహభాగం మేజర్, మైనర్ పంచాయతీల నుంచే రావాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మైనర్ పంచాయతీల నుంచి రూ.52.86 కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి 25.86 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో చేసేది లేక అప్పుడప్పుడు విద్యుత్తు శాఖ పంచాయతీలకు ఝలక్ ఇస్తోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి విద్యుత్ వాడకం బిల్లు చెల్లించలేదని సోమందేపల్లి, పెనుకొండ పంచాయతీల వీధి దీపాలకు సరఫరా నిలిపివేసింది. పంచాయతీలు కూడా చేసేది లేక ఎంతో కొంత కట్టి మళ్లీ సర్వీసును పునర్దురించుకుంటున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో మేజర్ పంచాయతీల వీధి దీపాల విద్యుత్ వాడకం, రక్షిత నీటి సరఫరా విద్యుత్ వాడకం బిల్లు సుమారు రూ.25.86 కోట్లు పేరుకుపోయింది. మైనర్ పంచాయతీల్లో కూడా విద్యుత్తు వాడకం, రక్షిత నీటి సరఫరా వాడకం బిల్లు రూ.52.86 కోట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రెండేళ్లుగా ఈ లెక్కలు తగ్గడం లేదని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల పరంగా చూస్తే..పశుసంవర్ధశాఖ రూ.3.19 లక్షలు, ఉన్నత విద్యాశాఖ రూ.4.86 లక్షలు, వైద్య ఆరోగ్యశాఖ రూ.82.04 లక్షలు, పోలీసుశాఖ రూ.37.19 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ రూ.1.02 కోట్లు, నీటి సరఫరా విభాగం రూ.2.51 కోట్లు, రెవిన్యూ రూ.16.21 లక్షలు, సోషల్ వెల్ఫేర్ రూ. 11.77లక్షలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.37 వేల బకాయిలు ఉన్నాయి. 8,97,512 గృహ కనెక్షన్ల ద్వారా 41.52 కోట్లు, 1,93,859 వ్యవసాయ కనెక్షన్ల నుంచి రూ.20.66 కోట్లు.. 79,464 వాణిజ్య కనెక్షన్ల నుంచి 4.64 కోట్లు, భారీ తరహా పరిశ్రమలు 2.51 కోట్లు, చిన్నతరహా పరిశ్రమల నుంచి 26 లక్షలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, ప్రభుత్వ పాఠశాలల నుంచి రూ.92 లక్షలు, ఎగ్జిబిషన్లు తదితర తాత్కాలిక కనెక్షన్ల ద్వారా రూ.66 వేలు బకాయిలు విద్యుత్తు పంపిణీ సంస్థకు రావాల్సి ఉంది. అధికారులు ఏమంటున్నారంటే..? జిల్లా అంతటా వాడుకున్న విద్యుత్తుకు బకాయిలు పేరుకుపోయాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. మేజర్ పంచాయతీల వారికి విద్యుత్తు బిల్లుల్లో ఎటువంటి రాయితీలు ఉండవు. వారే సొంతంగా బిల్లులు చెల్లించాలి. మైనర్ పంచాయతీలకై తే ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుంది. ఈ దశలో ఫిబ్రవరి నెలలో ఆయా పంచాయతీలకు ట్రాన్స్‌కో అధికారులు బిల్లులు అందజేసి కొంతైనా కట్టకపోతే ఫీజులు తొలగిస్తాం అని సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నారు. అయినా అతి తక్కువ మంది మాత్రమే స్పందించారని అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉన్నతాధికారుల సూచనల మేరకు గత ఫిబ్రవరిలో కొన్ని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు చెప్పారు. పస్తుతం తిరిగి బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వ శాఖలతో పాటు గృహ, వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు సైతం నోటీసులు అందజేస్తున్నామని చెబుతున్నారు. రక్షిత నీటి పథకాలకు వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుతం మేజర్, మైనర్ పంచాయతీల్లో కనెక్షన్లు తొలగించడం లేదని, అయితే పరిస్థితి అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని కోరుతూ ముందస్తు సూచనగా నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. పంచాయతీలకు మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ నిధుల నుంచి కొంతైనా బకాయిలు తీర్చాలని వారంటున్నారు. నోటీసులకు స్పందించి బిల్లులు చెల్లించకపోతే వ్యవసాయ, గృహ వినియోగదారులపై ఆర్ఆర్ యాక్టు ప్రయోగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వమే భరించాలి అసలే అంతంత మాత్రం ఆర్థిక వనరులతో పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ సమయంలో పంచాయతీ నిధుల నుంచి బిల్లుల చెల్లింపు తలకు మించిన భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు అంటున్నారు. వస్తున్న కొద్దిపాటి నిధులు వీటికే సరిపోతుంటే ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులెలా చేయాలని అంటున్నారు. మైనర్ పంచాయతీలకు ఇస్తున్నట్లే మేజర్ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను భరించాలని ఆయా గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్‌తో పాలన ఎలా సాగించాలని కాబోయే సీఎం చంద్రబాబునాయుడు తల పట్టుకుంటుండగా, ఇప్పుడు ఈ పంచాయతీలకు బిల్లులు ఎక్కడ మంజూరు చేస్తారని మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
కరెంట్ షాక్...
- విభజన తర్వాత వడ్డింపు - కొత్త టారిఫ్ సిద్ధం చేస్తున్న విద్యుత్ అధికారులు - వినియోగదారులకు గుండె గు‘భిల్లే’ - దాదాపుగా రెట్టింపు కానున్న చార్జీలు - జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.360 కోట్ల భారం వచ్చే నెల నుంచి కరెంటు చార్జీలు మోతమోగనున్నాయి. నూతనంగా రూపొందించిన టారిఫ్ ప్రకారం ఇకపై మీరు కట్టే బిల్లు దాదాపుగా రెట్టింపు కానుంది. మీ జేబుకు చిల్లుపడనుంది. బిల్లు చూసి మీ గుండె గుభిల్లు మనడం ఖాయం. వినియోగదారుల నడ్డివిరిచేలా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలు అమలైతే జిల్లాలో వినియోగదారులపై రూ.360 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. గుంటూరు, సాక్షి: అపాయింటెడ్ డే జూన్ 2 తర్వాత కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వినియోగదారుల నడ్డి విరిచే విధంగా జేబుకు చిల్లు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు డిస్కం ఈఆర్సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేదు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబు దాటితే ముక్కు పిండి రూ.300కు పైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారిఫ్‌లపై విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు గాను ఇకపై రూ.611.50 చెల్లించాలి. పొరపాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్టు పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు రానుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్టు ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున ఉంటాయి. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్టు పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం కూడా పొందడంతో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లు మోత మోగనుంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించనున్నారు. ఈ బాదుడు అమలైతే జిల్లాలో వినియోగదారులపై ఏడాదికి రూ.360 కోట్ల భారం పడనుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్తు బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ డిస్కంకు సెంట్రల్ డిస్కం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. -
విద్యుత్ కోతలు మరింత తీవ్రం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కారణంగా జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. శుక్రవారం నుంచే కోతల వాతలు పెరగనున్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లాకు విద్యుత్ కోటాను తగ్గించడమే ఇందుకు కారణం. రోజుకు జిల్లాకు 34 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా గతంలో 32 లక్షల యూనిట్లు సరఫరా అయ్యేది. డిమాండ్, సరఫరాల మధ్య తేడా 2 లక్షల యూనిట్లు మేర ఉండడంతో జిల్లా ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తూ వస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట కూడా కోతలు విధించేవారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకు విద్యుత్ కోటాను 28 లక్షల యూనిట్లకు తగ్గించారు. దీంతో డిమాండ్, సరఫరాల మధ్య ఏకంగా 6 లక్షల యూనిట్ల మేర తేడా ఏర్పడింది. ఈ కారణంగా విద్యుత్ కోతలు ఇబ్బడిముబ్బడి కానున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు కూడా కోత విధించనున్నారు. 10 జిల్లాల తెలంగాణకు విద్యుత్‌ను ఎక్కువగా కేటాయించిన అధికారులు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు తగ్గించటంతో ఆ మేరకు జిల్లాలకు కోటా తగ్గించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన వల్ల జిల్లాలకు విద్యుత్ కోటా పెరగవచ్చునని అధికారులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది. జిల్లాలో 70 శాతం మందికిపైగా జనం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగా ఉండగా, ఇప్పుడు కోటా తగ్గడం వల్ల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూన్ 2 తర్వాత పరిస్థితి మారవచ్చునని విద్యుత్ శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితిలో సానుకూల మార్పేమీ ఉండదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన పెరగటం లేదా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు.