సాక్షి, అనంతపురం : జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిల భారం ఎక్కువైపోయింది. ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 12 ప్రభుత్వ శాఖలు, మునిసిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీల నుంచి మే 30వ తేదీ 2014 నాటికి రూ.95.07 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తేల్చారు.
ఇందులో సింహభాగం మేజర్, మైనర్ పంచాయతీల నుంచే రావాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మైనర్ పంచాయతీల నుంచి రూ.52.86 కోట్లు, మేజర్ పంచాయతీల నుంచి 25.86 కోట్లు బకాయిలు పేరుకుపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో చేసేది లేక అప్పుడప్పుడు విద్యుత్తు శాఖ పంచాయతీలకు ఝలక్ ఇస్తోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి విద్యుత్ వాడకం బిల్లు చెల్లించలేదని సోమందేపల్లి, పెనుకొండ
పంచాయతీల వీధి దీపాలకు సరఫరా నిలిపివేసింది. పంచాయతీలు కూడా చేసేది లేక ఎంతో కొంత కట్టి మళ్లీ సర్వీసును పునర్దురించుకుంటున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో మేజర్ పంచాయతీల వీధి దీపాల విద్యుత్ వాడకం, రక్షిత నీటి సరఫరా విద్యుత్ వాడకం బిల్లు సుమారు రూ.25.86 కోట్లు పేరుకుపోయింది. మైనర్ పంచాయతీల్లో కూడా విద్యుత్తు వాడకం, రక్షిత నీటి సరఫరా వాడకం బిల్లు రూ.52.86 కోట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. రెండేళ్లుగా ఈ లెక్కలు తగ్గడం లేదని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ శాఖల పరంగా చూస్తే..పశుసంవర్ధశాఖ రూ.3.19 లక్షలు, ఉన్నత విద్యాశాఖ రూ.4.86 లక్షలు, వైద్య ఆరోగ్యశాఖ రూ.82.04 లక్షలు, పోలీసుశాఖ రూ.37.19 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ రూ.1.02 కోట్లు, నీటి సరఫరా విభాగం రూ.2.51 కోట్లు, రెవిన్యూ రూ.16.21 లక్షలు, సోషల్ వెల్‌ఫేర్ రూ. 11.77లక్షలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.37 వేల బకాయిలు ఉన్నాయి. 8,97,512 గృహ కనెక్షన్ల ద్వారా 41.52 కోట్లు, 1,93,859 వ్యవసాయ కనెక్షన్ల నుంచి రూ.20.66 కోట్లు.. 79,464 వాణిజ్య కనెక్షన్ల నుంచి 4.64 కోట్లు, భారీ తరహా పరిశ్రమలు 2.51 కోట్లు, చిన్నతరహా పరిశ్రమల నుంచి 26 లక్షలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, ప్రభుత్వ పాఠశాలల నుంచి రూ.92 లక్షలు, ఎగ్జిబిషన్లు తదితర తాత్కాలిక కనెక్షన్ల ద్వారా రూ.66 వేలు బకాయిలు విద్యుత్తు పంపిణీ సంస్థకు రావాల్సి ఉంది.
అధికారులు ఏమంటున్నారంటే..?
జిల్లా అంతటా వాడుకున్న విద్యుత్తుకు బకాయిలు పేరుకుపోయాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. మేజర్ పంచాయతీల వారికి విద్యుత్తు బిల్లుల్లో ఎటువంటి రాయితీలు ఉండవు. వారే సొంతంగా బిల్లులు చెల్లించాలి. మైనర్ పంచాయతీలకై తే ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుంది. ఈ దశలో ఫిబ్రవరి నెలలో ఆయా పంచాయతీలకు ట్రాన్స్‌కో అధికారులు బిల్లులు అందజేసి కొంతైనా కట్టకపోతే ఫీజులు తొలగిస్తాం అని సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నారు. అయినా అతి తక్కువ మంది మాత్రమే స్పందించారని అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉన్నతాధికారుల సూచనల మేరకు గత ఫిబ్రవరిలో కొన్ని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు చెప్పారు.
పస్తుతం తిరిగి బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వ శాఖలతో పాటు గృహ, వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు సైతం నోటీసులు అందజేస్తున్నామని చెబుతున్నారు. రక్షిత నీటి పథకాలకు వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుతం మేజర్, మైనర్ పంచాయతీల్లో కనెక్షన్లు తొలగించడం లేదని, అయితే పరిస్థితి అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని కోరుతూ ముందస్తు సూచనగా నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. పంచాయతీలకు మంజూరవుతున్న 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ నిధుల నుంచి కొంతైనా బకాయిలు తీర్చాలని వారంటున్నారు. నోటీసులకు స్పందించి బిల్లులు చెల్లించకపోతే వ్యవసాయ, గృహ వినియోగదారులపై ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వమే భరించాలి
అసలే అంతంత మాత్రం ఆర్థిక వనరులతో పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ సమయంలో పంచాయతీ నిధుల నుంచి బిల్లుల చెల్లింపు తలకు మించిన భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు అంటున్నారు. వస్తున్న కొద్దిపాటి నిధులు వీటికే సరిపోతుంటే ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులెలా చేయాలని అంటున్నారు.
మైనర్ పంచాయతీలకు ఇస్తున్నట్లే మేజర్ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను భరించాలని ఆయా గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్‌తో పాలన ఎలా సాగించాలని కాబోయే సీఎం చంద్రబాబునాయుడు తల పట్టుకుంటుండగా, ఇప్పుడు ఈ పంచాయతీలకు బిల్లులు ఎక్కడ మంజూరు చేస్తారని మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బకాయిల షాక్
Published Sat, May 31 2014 2:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement