చీకట్‌లు
జిల్లాలో అప్రకటిత కరెంట్‌కోత అన్నివర్గాల ప్రజలకు గుదిబండగా మారింది. చీకటిపడితే చాలు పట్టణాల్లో అంధకారం అలుముకుంటోంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చిరువ్యాపారులు, పారిశ్రామికవర్గాల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు వరుణుడు కరుణించకపోవడం.. విద్యుత్ కోతలు మొదలు కావడంతో ఖరీఫ్ వరిసాగు ముందుకు సాగడం లేదు. రైతన్న రోడ్డెక్కి గగ్గోలుపెడుతున్నా.. గోడు వినేవారు లేరు.
- జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు
- అవసరం 15 మి.యూ..
- సరఫరా 10 మి.యూ
- సంకటస్థితిలో రైతన్నల ఖరీఫ్ సాగు
- ఇబ్బందుల్లో వ్యాపారులు, పరిశ్రమలు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో విద్యుత్ వాడకం పెరగడం.. సరఫరా తగ్గిపోవడంతో కోతలు మరింత ఉధృతమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గం టల కోతలు అమలవుతున్నాయి. తద్వారా తాగునీటికి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణవాసులు దోమలతో కుస్తీపడుతూ కునుకులేకుండా గడుపుతున్నారు. వ్యవసాయరంగానికి ఆరుగంటల విద్యుత్ అందిస్తున్నామని అధికారు లు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది.
కనీసం మూడుగంటలు కూడా కరెంట్ సరఫరా కావడం లేదు. అధికారులు రెండు గ్రూపులుగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. గ్రూప్-‘ఏ’ ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 దాకా తిరిగి రాత్రి 10.00 నుంచి తెల్లవారుజామున 1.00 వ రకు, గ్రూప్-‘బీ’ ప్రకారం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 4.00 దాకా, మళ్లీ తెల్లవారుజామున 1.00 నుంచి 4.00 వరకు సరఫరా చేయాలని చార్ట్ తయారుచేశారు. ఇదిలాఉండగా, సంబంధిత సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా ఉంటేనే రైతులకు అందుతోంది.. లేదంటే అంతే సంగతులు.
కోతలు.. వాతలు
కరెంట్ సరఫరా లేకపోవడం వల్లే కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్ అధికారులు తేల్చేస్తున్నారు. జిల్లా అవసరాలకు 15 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, ప్రస్తుతం 10.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్, సరఫరాకు అంతరాయం ఉండటంతో కోతలే అనివార్యమని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు విద్యుత్‌ను నిలిపేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కోత విధిస్తున్నారు.
అలాగే మునిసిపాలిటీల్లో ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4.00 వరకు పవర్‌కట్ ఉంటుంది. మండలకేంద్రాల్లో ఉదయం 8.00 నుంచి 12.00 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2.00నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విద్యుత్‌కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజు మొత్తం పవర్‌హాలిడే ప్రకటించారు.
అదే అదనుగా భావించిన విద్యుత్‌శాఖ అధికారులు లోటును పూడ్చుకోవడానికి ఉచిత క రెంట్‌కు కోత విధిస్తున్నారు. తద్వారా వ్యవసాయానికి రెండుగంటలు కూడా సక్రమంగా అందకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోతల కారణంగా చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. అడ్డూఅదుపులేని కోతల కారణంగా చేతినిండా పనిలేక కార్మికులు అల్లాడుతున్నారు. దీంతో వెల్డింగ్, జిరాక్స్ మిషన్లు, రిపేరింగ్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కరెంట్ లేక వచ్చినా ఆర్డర్లను సమయానికి ఇవ్వలేకపోతున్నామని చిన్న పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. జనరేటర్లు పెట్టి నడిపిస్తే లాభం రాకపోగా.. తీవ్రం గా నష్టపోవాల్సి వస్తోందని దిగులుచెందుతున్నారు.